కోతలే మిగిలాయ్!
నరసన్నపేట రూరల్:ఖరీఫ్ రైతు నష్టాల సుడిలో చిక్కుకున్నాడు. సీజన్ ప్రారంభం నుంచీ అటుపోట్లు ఎదుర్కొంటున్న వరి రైతులు చివరి దశలో హుద్‌హుద్ తుపానుకు తీవ్రంగా దెబ్బతిన్నారు. అది చాలదన్నట్లు పంట కోత దశలో సుడిదోమ కాటుకు గురై విలవిల్లాడుతున్నారు. ఒకవైపు రుణమాఫీ ఆశలు నీరుగారుతున్నాయి. కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముఖం చాటేశారు. తుపాను నష్టపరిహారం ఎప్పుడొస్తుందో తెలీదు. దోమపోటు నష్టాలను ఇప్పటికీ అంచనా వేయలేదు. ఆ హామీ ఇచ్చిన మంత్రులు తర్వాత ఆ విషయాన్నే విస్మరించారు. ఈలోగా అల్పపీడనం రూపంలో మరో ప్రమాదం ఎదురుకావడంతో ఉన్న పంటనైనా కాపాడుకోవాలన్న తాపత్రయంతో పంట కోతలు ప్రారంభించారు. అవి చివరి దశకు వచ్చినా దోమపోటు నష్టాల అంచనాకు ఆదేశాలే రాలేదని వ్యవసాయాధికారులే చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కోతలు పూర్తి అయ్యాక నష్టాలను ఎలా లెక్కిస్తారని ప్రశ్నిస్తున్నారు. తమ పరిస్థితి ఏమిటని ఆవేదన చెందుతున్నారు.
మూడోవంతు పంటకు నష్టం
జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో వరి పండించగా ఇందులో మూడో వంతు పంటను దోమ తినేసిందని రైతుల అంచనా ప్రకారం తెలుస్తోంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు నష్టాలను స్వయంగా పరిశీలించారు. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావులు కూడా స్వయంగా పరిశీలించారు. ఎన్ని మందులు వాడినా దోమ నశించకపోవడంతో నష్టం ఎక్కువగానే ఉందని వ్యవసాయాధికారులు అంచనాకు వచ్చారు. ఇంత జరిగినా మంత్రు హామీలకు అనుగుణంగా తదుపరి చర్యలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతో జిల్లాలో దోమపోటు తీవ్రతను వివరిస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్‌కు జిల్లా కలెక్టర్ నివేదిక పంపారు. ఇది ప్రభుత్వానికి చేరిందో లేదో తెలియదు గానీ.. అటు నుంచి స్పందన లేదు. నష్టాల నివేదిక ఇవ్వాలని ఇప్పటి వరకూ రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. దీంతో అధికారులు తుపాను నష్టాల నివేదిక తయారీలోనే నిమగ్నమయ్యారు. కాగా మండలాల వారీగా దోమపోటు నష్టం వివరాలు జిల్లా అధికారులు రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా సేకరించినా.. క్షేత్రస్థాయి గణాంకాలు సేకరిచాలని గానీ, నష్టపోయిన రైతులను గుర్తించాలని గానీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతో నష్టపరిహారం విషయంలో వారు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికీ ఆదేశాలు రాలేదు: జేడీ
సుడి దోమ వల్ల జిల్లాలో రైతులకు నష్టం అధికంగా ఉందని వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ బి.వి.ఎస్. హరి చెప్పారు. పరిస్థితి తీవ్రతను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయితే నష్టాల పరిశీలన, అంచనాకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని ఆయన వివరించారు.
ఇంకెప్పుడు గుర్తిస్తారు
దోమ నష్టాలకు గురైన రైతులను ఇంకెప్పుడు గుర్తిస్తారు. వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరో వారం రోజుల్లో కోతలు ముగుస్తాయి. అవి పూర్తి అయితే నష్టం అంచనా సాధ్యం కాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వెంటనే అధికారులను రంగంలోకి దించాలి.
-గురువల్లి గోవిందరావు, దేవాది
కోతల తర్వాత అంచనా ఎలా?
ఈపాటికే దోమ పోటు నష్టాలను గుర్తిస్తే బాగుండేది. ఇంతవరకూ ప్రభుత్వం నాన్చి ఇప్పుడు పరిహారం ఎవరికి ఇస్తారు, పేర్లు ఎలా గుర్తిస్తారు. చివరి నిమషంలో టీడీపీ వారి పేర్లు రాసుకుంటారా?.. ఇప్పటికూనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.
-యాళ్ల కృష్ణం నాయుడు. మాకివలస