
కిడ్నీ రోగులకు కంటితుడుపు!
కిడ్నీ వ్యాధి... అంతుచిక్కని కారణమేదైనా కానీ ఉద్దానంలో కొన్ని వేల కుటుంబాలను పీల్చిపిప్పి చేసేస్తోంది. వారందర్నీ ఆదుకుంటామని హామీలిచ్చి గత ఎన్నికలలో గట్టెక్కిన టీడీపీ నాయకులు... అధికారంలోకి వచ్చాక అసలు విషయం మరచిపోయారు!
గత మూడేళ్లూ తూతూ మంత్రం చర్యలతో సరిపెట్టారు! వందల సంఖ్యలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వదిలించారు. మే నెలలో ఉద్దానం పర్యటనలోనూ, ఇటీవల పార్టీ జాతీయ ప్లీనరీలోనూ కిడ్నీ వ్యాధి బాధితులకు భరోసా ఇచ్చారు.
తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.10 వేల చొప్పున నెలనెలా పింఛను ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం మూడేళ్ల మొద్దునిద్రను వీడి దిగొచ్చింది. డయాలసిస్ రోగులకు రూ.2,500 చొప్పున పింఛను ఇస్తామని మంగళవారం ప్రకటించింది. ఇది కంటితుడుపు చర్యే తప్ప మరొకటి కాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి– శ్రీకాకుళం: ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోనున్న ఉద్దానం ప్రాంతంలో కుటుంబానికి ఒక్కరైనా కిడ్నీవ్యాధి బాధితులున్నారు! వారిలోనూ ఎక్కువ మంది కుటుంబానికి ఆధారమైనవారే! తండ్రి.. లేదంటే తల్లి, కొన్ని కుటుంబాల్లో ఇద్దరూ, కొన్నికొన్ని కుటుంబాల్లో పిల్లలను కూడా ఈ మహమ్మారి కబళిస్తోంది! ఈ ప్రాంతంలోని దాదాపు రెండు లక్షల మంది జనాభాలో సుమారు 28 శాతం మంది కిడ్నీవ్యాధి బాధితులేనని ఓ అంచనా! వైద్యం, డయాలసిస్, మందుల కోసం ఆస్తులు అమ్మేస్తున్నవారు కొందరైతే, అప్పులు చేసి మరీ మృత్యువు నుంచి కాపాడుకోవడానికి నిత్య పోరాటం చేస్తున్నారు! ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరస్థాయిలో కిడ్నీ వ్యాధిగ్రస్థులు కేంద్రీకృతమైన మూడు ప్రాంతాల్లో ఉద్దానం ఒక్కటి.
గత ఏప్రిల్ 15వ తేదీ వరకు ఏడు మండలాల పరిధిలోని 170 గ్రామాల్లో కిడ్నీ వ్యాధి నిర్ధారణ పరీక్షలను వైద్య బృందాలు నిర్వహించాయి. ఒక లక్షా పదిహేను వేల మందికి ప్రాథమిక దశ పరీక్షలు చేస్తే వారిలో 13 వేల మందికి పాజిటివ్ వచ్చింది. రెండో దశ పరీక్షలు చేస్తే వారిలో కిడ్నీ వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో తేలుతుంది. ఇప్పటివరకూ ఈ రెండో దశ పరీక్షలు కేవలం నాలుగు వేల మందికే నిర్వహించారు. మరో 9 వేల మందికి ఇంకా చేయాల్సి ఉంది. ఇక ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సివారు కూడా 70 వేల మందికి పైగా ఉంటారు. ఇవన్నీ పూర్తయితే కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య 50 వేల వరకూ ఉంటుందని స్థానిక వైద్యనిపుణులు చెబుతున్నారు.
బాధితుల గోడు వినరా...
కిడ్నీ వ్యాధి వస్తే ప్రాథమిక దశలో వైద్యం కోసం పలాస, టెక్కలి, శ్రీకాకుళం ఆసుపత్రులకు వెళ్లేవారే ఎక్కువ. కొంతమంది విశాఖపట్నం, ఒడిశా రాష్ట్రంలోని బరంపురం ఆసుపత్రులకు కూడా వెళ్తున్నారు. ఇక నాలుగు, ఐదు దశలకు వ్యాధి వచ్చేసిన తర్వాత డయాలసిస్ ఒక్కటే శరణ్యం. ఇందుకోసం ఉద్దానం నుంచి ఎక్కువ మంది శ్రీకాకుళం, విశాఖపట్నం ఆసుపత్రులకే వెళ్తున్నారు. టెక్కలి, పాలకొండ, సోంపేట ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసినా అక్కడ వైద్య సిబ్బంది తగినంతగా లేరు. కొన్ని కేంద్రాల్లో కిడ్నీవ్యాధి వైద్య నిపుణులు లేనేలేరు. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం ఈ మూడేళ్లలో చూపిన చొరవ తక్కువే.
ఇటీవలే పాలకొండ, సోంపేట కేంద్రాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కానీ కిడ్నీ వ్యాధిగ్రస్థులు, వారి కుటుంబసభ్యులు ప్రభుత్వానికి పలు విన్నపాలు చేస్తున్నా వాటిపై దృష్టి పెట్టలేదు. వీలైనంత సమీపంలోనే డయాలసిస్ సౌకర్యం కల్పించాలని, విశాఖలోని కార్పోరేట్ ఆస్పత్రులకు వెళ్లినా సకాలంలో డయాలసిస్ జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్న దృష్ట్యా బస్సు, రైలు ఛార్జీల్లో రాయితీ ఇస్తూ ప్రత్యేక పాసులు ఇవ్వాలనేది మరో ముఖ్యమైన విన్నపం. ఇక అత్యంత ప్రధానమైన వేడుకోలు ఏదంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛను సౌకర్యం కల్పించాలనేది. వారి విన్నపాల్లో ఏ ఒక్కటీ నెరవేర్చడానికి టీడీపీ ప్రభుత్వం గత మూడేళ్లలో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
జగన్ రంగప్రవేశంతో...
వేలాది మంది కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నా, వైద్యం చేయించుకోలేక వందలాది మంది మృత్యువాత పడుతున్నా మూడేళ్లుగా టీడీపీ ప్రభుత్వం మొద్దునిద్ర వీడలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. జనవరిలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇచ్ఛాపురంలోని ఒక సినిమా థియేటర్‌లో కొందరు కిడ్నీ వ్యాధిగ్రస్తులతో నిర్వహించిన సమావేశంలో అల్టిమేటం ఇచ్చినా పట్టించుకోలేదు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ జిల్లాకొచ్చి రెండు చోట్ల డయాలసిస్ కేంద్రాలు ప్రారంభించారు. కిడ్నీ వ్యాధిపరీక్షల నిమిత్తం వైద్య బృందాల పర్యటనకు పచ్చజెండా ఊపే కార్యక్రమాలకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో మే 20వ తేదీన రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దానం కిడ్నీరోగుల బాధలను స్వయంగా తెలుసుకోవడానికి వచ్చారు.
కవిటి మండలంలోని జగతి గ్రామంలో వందలాది మంది కిడ్నీరోగులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. వైద్యం, డయాలసిస్ కోసం ఆసుపత్రులకు వెళ్లిరావడానికి, మందులకు వేలాది రూపాయలు ఖర్చవుతున్నా ప్రభుత్వం నుంచి సాయం అందట్లేదని వారు చెప్పారు. వైద్యానికే గాక మరోవైపు కుటుంబ పోషణకు చేతిలో పైసల్లేక అప్పులపాలవుతున్న వైనాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చలించిపోయిన ఆయన... తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినవెంటనే కిడ్నీ రోగులకు ప్రతినెలా రూ.10 వేల చొప్పున పింఛను అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు సమీప ఆస్పత్రుల్లోనే డయాలసిస్ కేంద్రాలు తగిన సంఖ్యలో ఏర్పాటు చేయిస్తానని, కిడ్నీ వ్యాధికి మూలకారణాలను శోధించేందుకు ఎయిమ్స్ వైద్యుల సహకారంతో పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తామనీ చెప్పారు.
నవరత్నాలతో కదలిక....
గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఈ నెల 8, 9వ తేదీల్లో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జాతీయ ప్లీనరీలో జగన్ నవరత్నాల్లాంటి తొమ్మిది హామీలు ప్రజలకు ఇచ్చారు. వాటిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల పింఛను సౌకర్యం కల్పన కూడా ఒక్కటి. ఇవన్నీ చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం రూ.2,500 చొప్పున పింఛను ఇవ్వాలని నిర్ణయించింది.
ప్రజలకు భ్రమ కల్పించడానికే...
ఎప్పుడైతే జగన్ రూ.10 వేలు పింఛను ఇస్తామని ప్రకటించారో టీడీపీ ప్రభుత్వ పెద్దల్లో అలజడి మొదలైంది. మూడేళ్లలో చేతగానిపాలన చూసి నిరసన గళం వినిపిస్తున్న ప్రజలకు భ్రమ కల్పించడానికే రూ.2,500 పింఛనును టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. అంతేతప్ప కిడ్నీ వ్యాధిగ్రస్తులను, ఉద్దానం ప్రాంతంలో చితికిపోయిన కుటుంబాలను ఆదుకోవాలన్న సంకల్పం ఏమీ కనిపించట్లేదు. జిల్లాలో తూతూమంత్రంగా అయిదారు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసినా వాటి నిర్వహణకు ఇప్పటికీ వైద్య సిబ్బందిని, నిపుణులను నియమించలేదంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో తెలిసిపోతోంది.
– రెడ్డి శాంతి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు