నగల కోసం హతమార్చారు | Killed for jewelry | Sakshi
Sakshi News home page

నగల కోసం హతమార్చారు

Published Tue, Aug 26 2014 2:26 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

Killed for jewelry

  • హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
  • మదనపల్లెక్రైం : సులభ సంపాదనకు అలవాటుపడిన జులాయిలు బంగారు నగల కోసం ఒక వ్యక్తిని దారుణంగా హతమార్చినట్లు మదనపల్లె డీఎస్పీ కే.రాఘవరెడ్డి తెలిపారు. ఈ కేసులో సోమవారం రెండో పట్టణ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. డీఎస్పీ, సీఐ సీఎం.గంగయ్య కథనం మేరకు..

    పీటీఎం మండలం సంపత్‌కోటకు చెందిన కోటకొండ సుధాకర్(45), మదనపల్లె మండలం కోటవారిపల్లె పంచాయతీ ఉడుమువారిపల్లెతాండాకు చెందిన బనావత్ శంకర్‌నాయక్(31), తంబళ్లపల్లె మండలం చెట్లవారిపల్లెకు చెందిన మధు(33) మదనపల్లె నీరుగట్టువారిపల్లె టమాట మార్కెట్ యార్డులో కూలీలుగా పనిచేస్తున్నారు. దుర్వ్యసనాలకు బానిసై డబ్బు కోసం నేరాల బాట పట్టారు. వాల్మీకిపురం తేనీటి వీధికి చెందిన పీ.రమేష్‌బాబు (50) జూలై 24న మదనపల్లెకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండులో వేచి ఉన్నాడు.

    అతని మెడలో బంగారు చైను, వేళ్లకు రెండు ఉంగరాలు ఉండడంతో అతని వద్ద డబ్బు బాగా ఉంటుందని భావించిన సుధాకర్, శంకర్‌నాయక్, మధు మాటలు కలిపారు. తమ వద్ద కాలేజీ అమ్మాయిలు ఉన్నారని, కావాలనుకుంటే రాత్రికి వచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పారు. మాటలు నమ్మిన రమేష్‌బాబు వారి వెంట రవి గ్రూపు థియేటర్ సమీపంలోని పెద్దతోపు వద్దకు వెళ్లాడు. ముగ్గురు కలిసి నగలు ఇవ్వాలంటూ రమేష్‌బాబుపై దాడి చేశారు. రాళ్లతో తీవ్రంగా కొట్టి *60 వేలు విలువగల చైను, రెండు ఉంగరాలు, 2వేలు నగదు, 2వేలు విలువగల సెల్‌ఫోన్ తీసుకుని అతన్ని ముళ్లపొదల్లో పడేసి పారిపోయారు.

    రాత్రంతా అక్కడే ఉన్న రమేష్‌బాబును ఉదయాన్నే స్థానికులు గమనించి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా 30వ తేదీ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 2008లో ఇదేవిధంగా ఆర్టీసీ బస్టాండు సమీపంలోని కోమటివానిచెరువులో ఒక హత్య జరిగింది. ఆ కేసులో నూలుకుమార్‌తో పాటు సుధాకర్, శంకర్‌నాయక్, మధు నిందితులుగా ఉన్నారు.

    నూలుకుమార్ ఓ కేసులో జైలుశిక్ష అనుభవిస్తుండడంతో మిగతా ముగ్గురే ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావించారు. ఆ మేరకు తట్టివారిపల్లె వినాయకగుడి వద్ద సుధాకర్, శంకర్‌నాయక్ ఉన్నట్లు సమాచారం రావడంతో అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. మధు పరారీలో ఉన్నాడు. దోచుకున్న నగలను రికవరీ చేసి, నిందితులను అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించారు. కేసును ఛేదించిన ఎస్‌ఐలు హనుమంతప్ప, శ్రీనివాస్, కానిస్టేబుళ్లు రాజేష్, రాకేష్, శ్రీకాంత్‌లను డీఎస్పీ అభినందించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement