భార్యను హతమార్చి.. భర్త బలవన్మరణం
=అనుమానంతో కిరాతకం
=దుంపెల్లిగూడెంలో విషాద ఛాయలు
=దంపతుల మృతితో ఒంటరైన కుమారుడు
గోవిందరావుపేట, న్యూస్‌లైన్ : అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపి, ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని దుంపెల్లిగూడెంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన కొత్త ఉపేందర్‌రెడ్డి అలియూస్ ఉప్పల్‌రెడ్డి(45)కి సుమారు 19 ఏళ్ల క్రితం ఇదే మండలం అశ్వాపురం సమీపంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన పన్నాల కోటిరెడ్డి, సామ్రాజ్యం కుమార్తె విజయ(35)తో వివాహమైంది. వారి ఒక్కగానొక్క కుమారుడు నరేందర్‌రెడ్డి ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. కొద్ది సంవత్సరాలుగా భార్యను అనుమానిస్తూ ఉప్పల్‌రెడ్డి గొడవపడేవాడు. ఎవరితో మాట్లాడినా అనుమానించేవాడు.
ఈ విషయమై పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగారుు. అయినా గొడవలు సద్దుమణగకపోవడంతో 8 నెలల క్రితం విజయ తల్లిగారింటికి వెళ్లిపోయింది. పది రోజుల క్రితం రామన్నగూడెంలో జరిగిన తమ బంధువు దశదినకర్మకు ఇరువైపుల బంధువులు వచ్చారు. ఆ సమయంలోనే విజయను అత్తవారింటికి పంపించాలని బంధువులు మాట్లాడడంతో తల్లి సామ్రాజ్యం వారం రోజుల క్రితం కుమార్తెను దుంపెల్లిగూడెంలో దింపి వెళ్లింది.
రెండు రోజులుగా పొలం పనులకు భార్యభర్తలు కలిసే వెళ్లారు. గురువారం సాయంత్రం ఇంటికొచ్చాక అతడి సెల్‌ఫోన్‌కు ఫోన్ వచ్చింది. దీంతో ఉప్పల్‌రెడ్డి ఫోన్ పట్టుకుని బయటికి వచ్చి ఈ నంబర్ ఎవరిదో చూడండంటూ ఇంటిపక్కల వారికి చూపించాడు. ఆ నంబర్ ఎవరిదో తమకు తెలియదని చెప్పడంతో ఇంట్లోకి వెళ్లాడు. ఆ తర్వాత దంపతుల మధ్య ఏం జరిగిందోగానీ ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పక్కింటికి చెందిన వారు వెళ్లి తలుపు తట్టారు.
తలుపు తెరుచుకోగానే ఇంట్లో నుంచి పురుగుల మందు వాసన గుప్పుమనడంతోపాటు కదలని స్థితిలో మంచంపై ఉన్న దంపతులను చూసి పోలీసులకు, బంధువులకు సమాచారం ఇచ్చారు. సీఐ శ్రీధర్‌రావు, పస్రా ఎస్సై బాలాజీవరప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహాలను బయటకు తీసుకొస్తుండగా విజయ ఒంటిపై గాయాలు కనిపించడంతో ఆమెను గాయపరిచి చ ంపి, పురుగుల మందు తాగించి, ఆ తర్వాత ఉప్పల్‌రెడ్డి కూడా తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అరుుతే పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశముందని వారు తెలిపారు. మృతురాలి తల్లి సామ్రాజ్యంబోరున విలపించింది.
తల్లిదండ్రుల మృతితో అనాథగా కుమారుడు
తల్లిదండ్రుల మృతితో వారి కుమారుడు నరేందర్‌రెడ్డి అనాథగా మారాడు. ఇప్పటికే ఇంట్లో గొడవలతో మేనమామ మధుసూదన్‌రెడ్డి వద్ద ఉంటూ చదువుకుంటున్న అతడు తల్లిదండ్రుల మరణంతో ఒంటరిగా మిగిలాడు.