ఇది కిరణ్ సర్కార్ భూదాన్!
అయినకాడికి పందేరం చేస్తున్న వైనం
కోట్లు విలువ చేసే భూములు కారుచౌకగా అప్పగింత
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి భూదానోద్యమానికి తెర తీశారు! రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్య ముసుగు, రాజీనామా లీకులతో అందరి దృష్టినీ మళ్లిస్తూ... కీలకమైన ఫైళ్లను వేగంగా క్లియుర్ చేసేస్తున్నారు. 45 రోజులుగా సచివాలయానికి రావడమే మానేసిన ఆయన, క్యాంపు కార్యాలయం నుంచే పని కానిచ్చేస్తున్నారు. గత వారం రోజులుగానైతే వందలాది ఫైళ్లను అర్ధరాత్రి దాకా మేల్కొని మరీ పరిష్కరిస్తున్నారు. ఫైళ్లు క్లియుర్ చేరుుంచుకోవటానికి ఇదే సరైన సవుయువునీ, ‘వూట్లాడుకో-పని సాధించుకో’ తరహాలో వాటి పరిష్కారం జరిగిపోతోందని సచివాలయమంతా కోడై కూస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వారం రోజులుగా సీఎం కార్యాలయం నుంచి వందల సంఖ్యలో ఫైళ్లు వస్తుండటంతో పలు శాఖల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది.
ఫైళ్లతో పాటు సంబంధిత వ్యక్తులు కూడా జీవోల జారీకి ఆయా విభాగాల వద్ద బారులు తీరుతున్నారు. నెలలు, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూముల కేటాయింపుతో పాటు ఏసీబీ, విజిలెన్స్ కేసుల ఫైళ్లు కూడా ఇప్పుడు ఒక్కసారిగా జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతున్నాయి. ప్రధానంగా సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో రెవెన్యూ విభాగంలో జీవోల జారీ కోసం పైరవీకారులు పెద్ద ఎత్తున తిష్ట వేస్తున్నారు. కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు కాదంటున్నా సరే... ఆయా ఫైళ్లకు అటు రెవెన్యూ మంత్రి, ఇటు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేస్తున్నారు. ఈ బాగోతానికి కొన్ని ఉదాహరణలు...
రూ.35 కోట్ల భూమి.. 2 కోట్లకే!: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 141లోని డి-పట్టాలకు చెందిన 32.1 ఎకరాల అసైన్డ్ భూమిని, సర్వే నంబర్ 318లోని మూడెకరాలను ఎకరం కేవలం రూ.6 లక్షల చొప్పున కారుచౌకగా సత్యనారాయణ శీతల గిడ్డంగి ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించే ఫైలుకు కిరణ్ ఆమోదం తెలిపారు. సాక్షాత్తు భూ పరిపాలన ప్రధాన కమిషనరే (సీసీఎల్‌ఎ) ఈ భూమికి ఎకరా రూ.40 లక్షల ధరను సిఫార్సు చేశారు. బహిరంగ మార్కెట్‌లోనైతే రూ.కోటిపైనే ఉంది. అలాంటి భూమిని సీసీఎల్‌ఏ సిఫార్సులను కూడా కాదని రూ.6 లక్షల చొప్పున రెవెన్యూ మంత్రి సిఫార్సు చేస్తే సీఎం ఆమోదం తెలిపారు. ఫైలును జీవో జారీ కోసం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి పంపారు. కానీ ఆయన జీవో జారీ చేయకుండా, నిర్ణయాన్ని పున:పరిశీలించాలంటూ ఫైలును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు.
అతి విలువైన స్థలం.. అప్పనంగా అప్పగింత
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లో సర్వే నెంబర్ 129/40లోని అత్యంత విలువైన 3,665 చదరపు మీటర్ల స్థలాన్ని బ్లిట్జ్ హోటల్ యాజమాన్యానికి రియల్ ఎస్టేట్ కోసం అప్పగిస్తూ రెవెన్యూ మంత్రి, కిరణ్ నిర్ణయం తీసుకున్నారు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం ప్రత్యేక ఆఫీసర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఏకంగా సీసీఎల్‌ఎ కూడా వద్దన్నా వారు పట్టించుకోలేదు! 2007లో ఆసియా అభివృద్ధి బ్యాంకు సమావేశాల నేపథ్యంలో హోటల్ నిర్మాణానికి పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ ఆ సంస్థ హోటల్ నిర్మాణం చేపట్టలేదు. తర్వాత రెసిడెన్సియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతి కోరగా అధికారులు తిరస్కరించారు. భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నారాయణగూడ ప్రాంతంలో దీపక్ మహల్ స్థలంపైనా ఇలాంటి వివాదమే వస్తే యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించగా అధికారులు స్పెషల్ లీవ్ పిటీషన్ వేసి వాదిస్తున్నారు. బ్లిట్జ్‌కూ దాన్నే వర్తింపజేయాలని అధికారులు పేర్కొన్నా బడా బాబులు పట్టించుకోకుండా జీవో జారీ చేయించారు!
విశాఖలోనూ...
విశాఖపట్నంజిల్లా చినగదిలి మండలం కూర్మన్నపాలెం గ్రామంలోని 20 ఎకరాల అత్యంత విలువైన జాగీర్దారీ భూమిని ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఉద్దేశించిన ఫైలుకూ కిరణ్ ఆమోదం తెలిపారు. ఇందుకు ఓ మంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. జీవో జారీకి ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఇటీవలే నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ఎస్‌ఎఫ్‌ఆర్ రిసార్ట్స్ సంస్థకు 431 ఎకరాల్ని అక్రవుంగా అన్ని నియువూలనుంచి మినహాయింపు ఇవ్వడం తెలిసిందే. ఇందుకు సంబంధించిన జీవో జారీ అయ్యాక ఆ జీవోను రద్దు చేయమని కలెక్టర్, సీసీఎల్‌ఎ, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి కోరినా రెవెన్యూ మంత్రి, సీఎం తిరస్కరించారు.
సోదరుడా... మజాకా!
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ అధీనంలోని 2.38 ఎకరాల కాందిశీకుల భూమిని జి.శ్రీనివాస్, కె.ప్రతాపరెడ్డి అనే వ్యక్తులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. విచిత్రమేమిటంటే ఇందుకు సంబంధించిన ఫైలును అధికారులంతా తిరస్కరించడంతో కిరణ్ కూడా తొలుత తిరస్కరించారు. ఆ మేరకు జీవో కూడా జారీ అయింది. కానీ సీఎం సోదరుని ఒత్తిడితో ఫైలుకు మళ్లీ కదలిక వచ్చింది. ఆ ఫైలును రీ సర్క్యులేట్ చేయాల్సిందిగా రెవెన్యూ శాఖ కు సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యా యి. దాంతో ఫైలు సీఎం కార్యాలయానికి చేరింది!
తిమింగలాలకూ విముక్తి
మెదక్‌లో పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన (పరిశ్రమల) భూ సేకరణ డిప్యూటీ కలెక్టర్ పి.రామ్‌గోపాల్‌కు విచారణ నుంచి విముక్తి కల్పిస్తూ కిరణ్ నిర్ణయం తీసుకున్నారు! రామ్‌గోపాల్ ఏకంగా రూ.11 లక్షల లంచం తీసుకుంటూ 2008లో ఏసీబీకి అడ్డంగా దొరికారు. ఆయనను అరెస్టు చేయడంతో పాటు సస్పెండ్ చేశారు. కానీ ఒక ఎమ్మెల్యే పైరవీతో ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఇస్తూ, కేవలం శాఖాపరమైన విచారణతో సరిపుచ్చడానికి కిరణ్ అనుమతించారు. వారం రోజులుగా ఇలాంటి మరెన్నో కేసులకు సంబంధించిన పలు ఫైళ్లను ఆయన ‘క్లియర్’ చేశారు.