మంఖాల్‌లో రూ.180 కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణ
ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో విలువైన భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మహేశ్వరం మండలంలోని రూ.180 కోట్ల విలువ చేసే భూదాన్ భూమి మాయమైంది. బోర్డు పేరున భూమి ఉన్నట్టు ప్రభుత్వ రికార్డులు స్పష్టం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో భూమి కనిపించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిలో బోర్డులు నాటి, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఏళ్ల తరబడి అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో విలువైన ఈ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి.
భూదాన్ భూమి...
మంఖాల్ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 435లో 12.17 ఎకరాల భూమి ఉంది. 1955–58 పహాణీ ప్రకారం ఈ భూమి ఫకీర్ మహ్మద్ పేరున ఉంది. ఆయన దీనిని 3/1/1979న (ప్రొసీడింగ్ నంబరు: 1585/79 ) భూదాన్ బోర్డుకు దానం చేశారు. 1979–80 నుంచి 1985–86 వరకు భూదాన్ సమితి పేరున ఈ భూమి రికార్డుల్లో ఉంది.
ఆ తర్వాత ఈ భూమిని ప్రభుత్వం స్థానికంగా ఉన్న ఐదుగురు పేదలకు దానం చేసింది. ఆ తర్వాత ఈ భూమి పక్కనే ఉన్న ఓ పట్టాదారు ఆధీనంలోకి వెళ్లింది. సదరు రైతు ఈ భూదాన్ భూమిని తన పట్టా భూమిలో కలిపేసుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పంట సాగు చేస్తున్నాడు.
నివేదికతో సరి...
అసైన్‌దారుల ప్రమేయం లేకుండా రికార్డుల్లో పేర్లు మారడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిని అప్పట్లో ఏపీ లోకాయుక్త సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశాన్ని సుమోటో (కేసు నంబరు: 2585/2011)గా స్వీకరించింది. రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీ చేసింది. దీంతో మహేశ్వరం తహసీల్దార్ సదరు కబ్జాదారుకు రికార్డులు చూపించాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.
ఇందుకు ఆయన నిరాకరించడంతో 14/2/2012లో ఈ భూమిని తమ ఆ«దీనంలోకి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అంశాన్ని లోకాయుక్తకు కూడా నివేదించింది. ఈ భూమిలో హెచ్చరికల బోర్డు కూడా ఏర్పాటు చేసింది. అయితే కబ్జాదారు దీనిని కూలి్చవేయగా, తహసీల్దార్ ఫిర్యాదుతో మహేశ్వరం పీఎస్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. కానీ ఇప్పటివరకు ఆ భూమిని స్వా«దీనం చేసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పోరంబోకు..పట్టాగా మంఖాల్ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 608, 609, 610లలో 33.8 ఎకరాల పోరంబోకు భూమి ఉంది. నిన్నమొన్నటి వరకు పేదల చేతుల్లో ఉన్న ఈ భూములు ఇటీవల పెద్దల చేతుల్లోకి వెళ్లాయి. బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువ రూ.300 కోట్ల వరకు ఉన్నట్టు అంచనా. 1996 నుంచి ప్రభుత్వ రికార్డుల్లో ఈ భూములు పోరంబోకు/గైర్హాన్ సర్కారివిగా నమోదై ఉన్నాయి. 2012లో ప్రభుత్వం వీటిని నిషేధిత జాబితా (22ఎ)లో చేర్చింది.
ఆ మేరకు ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. విలువైన ఈ భూములపై కన్నేసిన కొంతమంది బడానేతలు రికార్డులు మాయం చేసి గుట్టుగా వీటిని కాజేశారు. అసలు సర్వే నంబర్లకు అనేక బై నంబర్లు సృష్టించగా, పట్టాదార్ పాస్ పుస్తకాలు కూడా జారీ అయ్యాయి. ఏడాదిక్రితం వరకు నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములు ఇటీవల పట్టా భూములుగా మారడంపై కలెక్టర్‌కు ఫిర్యాదులు అందగా, ఆయన విచారణకు ఆదేశించడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment