సీఎం కిరణ్ రాజీనామా చేయాలి | Kiran Should Immediately Resign, Demands Paturi Sudhakar Reddy | Sakshi
Sakshi News home page

సీఎం కిరణ్ రాజీనామా చేయాలి

Published Sun, Sep 29 2013 2:25 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

Kiran Should Immediately Resign, Demands Paturi Sudhakar Reddy

సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమానికి నాయకత్వం వహించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి సూచించారు. శనివారం స్థానిక ఐబీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్రలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు ఐక్యమై తమ పదవులకు రాజీనామా చేశారని తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజల మనోభావాలను గౌరవించకుండా పదవులను అంటిపెట్టుకొని వేలాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాంత మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.
 
  సీఎం కిరణ్ మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకి అన్నారు. ఆయన సమైక్యాంధ్రకు మద్దతు పలుకుతున్నందున రాజీనామా చేసి ఉద్యమానికి సారధ్యం వహించాలని సూచించారు. తెలంగాణ ఏర్పడితే జల వివాదాలు ఏర్పడతాయని సీఎం వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు.  ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో జల వివాదాలు ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వివాదాలను జాతీయ జల వనరుల కమిటీ పరిష్కరి స్తుందని, అది తీసుకునే నిర్ణయానికి ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉంటే చాలన్నారు.
 
 మద్రాసు నుంచి సీమాంధ్రులను తరిమికొడితే పైసా పెట్టుబడి లేకుండా హైదరాబాద్‌కు వచ్చి కోటీశ్వరులయ్యారన్నారు. ఉద్యోగాల విషయంలో జరిగిన అన్యాయాన్ని సహించలేకనే తెలంగాణ ఉద్యమం లేవదీశామని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా ఉద్యోగావకాశాలు రాకుండా పోతాయని సీఎం ప్రకటించడం సిగ్గుచేటన్నారు. లోకల్ కేటగిరీలో సీఎం గణాంకాల ప్రకారమే సచివాలయంలో 19వేల మంది ఉన్నారని దీనిని పరిశీలిస్తే తెలంగాణ ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని కోరితే కేంద్రం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించిన సీఎం ఇప్పుడు ఎందుకు అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ సంక్షోభం ద్వారానే తెలంగాణ ఏర్పడుతుందని అందుకోసం తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలన్నారు. 29న నిర్వహించే సకల జన  భేరికి భారీ సంఖ్యలో తెలంగాణ వాదులు తరలి రావాలని ఆయన కోరారు.  సమావేశంలో తెలంగాణ పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాలస్వామి, జిల్లా అధ్యక్షుడు లచ్చిరెడ్డి, నాయకులు కృష్ణమూర్తి, ఎండీ గౌస్, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
 
 సీఎంను బర్తరఫ్ చేయాలి
 వెల్దుర్తి: తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమైక్యవాద సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని టీఆర్‌ఎస్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వారు వెల్దుర్తిలో విలేకరులతో మాట్లాడుతూ  కాంగ్రెస్ అధిష్టానం పెట్టిన భిక్షతో సీఎం అయిన కిరణ్ కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించడం దుర్మార్గ చర్య అన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏకమై కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో తలపెట్టిన సకల జనభేరి విజయవంతం చేసేందుకు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 15 బస్సులు, 50 సుమోల్లో 1500 మంది ఉద్యోగులు, విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివెళుతున్నారన్నారు.  సభలో మంత్రులు,  అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు  విధిగా పాల్గొనాలని సూచించారు.  సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు కోదండ క్రిష్ణాగౌడ్, స్థానిక సర్పంచ్ మోహన్‌రెడ్డి, శివ్వంపేట పీఏసీఎస్ చెర్మైన్ వెంకటరామిరెడ్డి, స్థానిక టీఆర్‌ఎస్ నేతలు నర్సింలు, భూపాల్‌రెడ్డి, కర్రె వెంకటేశ్, హన్మంత్‌రెడ్డి,టీఆర్‌ఎస్వీ నాయకుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
 
 సీమాంధ్ర పక్షపాతి సీఎం కిరణ్
 జిన్నారం: తెలంగాణ ఆకాంక్షను మరోసారి చాటేందుకు నిర్వహిస్తున్న సకలజనభేరి కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్ పిలుపునిచ్చారు. సకలజనభేరీని విజయవంతం చేయాలని కోరుతూ స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థులు  శనివారం ‘సకలజన భేరి’ పేరున మానవహారంగా ఏర్పడి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేశంగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవడం హర్షనీయమన్నారు. సీఎం తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించకుండా, సమైకాంధ్రకు మద్దతు పలకటం సరి కాదన్నారు. సీఎం వెంటనే రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. సీఎం కనుసన్నల్లోనే సీమాంధ్ర ఉద్యమం నడుస్తోందన్నారు. తెలంగాణ సత్తా మరోసారి చాటేందుకు సకల జనభేరిలో ప్రతి ఒక్క తెల ంగాణవాది పాల్గొనాలన్నారు.   కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుదర్శన్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, పార్టీ నాయకులు సంజీవ, నర్సింగ్‌రావు, వెంకటేశ్, శంకరప్ప, బ్రహ్మేందర్‌గౌడ్, నరేందర్, రవి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement