తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఉజ్వల భవిష్యత్ ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ ఏపీ ప్రజల ఆదరణ కోల్పోయిందని, సమస్యలపై పోరాటం చేస్తూ బీజేపీ ప్రజల మన్ననలు పొందేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఆదివారం తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ప్రజా ధన్యవాద సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో బీజేపీ బలపడుతుందని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలను రాహుల్ కాళ్లదగ్గర పెట్టిన చంద్రబాబును ఏపీ ప్రజలు క్షమించరని అన్నారు.
చంద్రబాబు తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారని ఎద్దేవా చేశారు. టీడీపీ సహా ఏ పార్టీతోనూ ఏపీ బీజేపీ జట్టుకట్టబోదని చెప్పారు. రానున్న రోజుల్లో సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల్లోకి చొచ్చుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలు సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్లాలని కోరారు. మోదీ కృషితో భారత్‌కు దేశ విదేశాల్లో గౌరవం పెరిగిందని అన్నారు. ఏపీని అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment