చివరి బంతితో సెంచరీ కొడతారా?
సంపూర్ణ తెలంగాణ సాధన దీక్షలో సీఎంను ప్రశ్నించిన కోదండరాం
ఆంక్షలతో తెలంగాణ వచ్చినా రానట్టే
బిల్లులో 13 అంశాలను సవరించాల్సిందే
సీమాంధ్ర నేతల తీరు రాజ్యాంగాన్ని, పార్లమెంట్‌ను అవమానించేలా ఉంది: కేకే
సవరణల అధికారం అసెంబ్లీకి లేదు: నాగం
సాక్షి, హైదరాబాద్: ఆఖరి ఓవరులో ఆఖరి బంతి మాత్రమే ఉందని, ఆ ఒక్క బంతితో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సెంచరీ కొడతారా అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ప్రశ్నించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై గవర్నర్‌కు అధికారాలు సహా పలు ఆంక్షలతో తెలంగాణ ఇచ్చినా ప్రత్యేక రాష్ట్రం రానట్టేనని అన్నారు. రాష్ట్రపతి పంపిన ముసాయిదా బిల్లులో సభ్యులు అభిప్రాయాలను మాత్రమే చెప్పాలని ఉందని, ఓటింగ్ ప్రస్తావన ఎక్కడా లేదని పేర్కొన్నారు. సమైక్యవాదులైన జగన్‌మోహన్‌రెడ్డి, కిరణ్‌కుమార్ రెడ్డి, చంద్రబాబునాయుడు వంటివారు తెలంగాణను అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలను ఇకనైనా మానుకుంటే మంచిదని సూచించారు. మంగళవారమిక్కడ ఇందిరాపార్కు వద్ద టీజేఏసీ ‘సంపూర్ణ తెలంగాణ సాధనా దీక్ష’ నిర్వహించింది.
ఇందులో కోదండరాంతోపాటు టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, బీజేపీ ఎమ్మెల్యేలు నాగం జనార్దన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్, న్యూడెమోక్రసీ నాయకులు పి.సూర్యం, కె.గోవర్ధన్, పలువురు జేఏసీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రపతి పంపిన బిల్లుపై శాసనసభ్యులు అభిప్రాయాలు తెలియజేసి వెంటనే తిప్పి పంపాలని డిమాండు చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు తెలియకుండానే శాసనసభలో వ్యవహారాలను రహస్యంగా దాస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో సజావుగా చర్చించాలని కోరారు. తెలంగాణ ఏర్పాటయ్యే దాకా ప్రజాప్రతినిధులంతా ఒకే మాట, ఒకే బాటగా నడవాలన్నారు. సంపూర్ణ తెలంగాణ కోసం జేఏసీ ప్రతిపాదించిన 13 అంశాలను సవరించాల్సిందేనని స్పష్టంచేశారు.
తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం శాసనసభాపక్ష నేతలు, ఎమ్మెల్యేలతో బుధవారం రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేశవరావు మాట్లాడుతూ... రాష్ట్రపతి పంపించిన బిల్లును చించివేసి, తగుల బెట్టిన సీమాంధ్ర ప్రజాప్రతినిధుల తీరు రాజ్యాంగాన్ని, పార్లమెంట్‌ను అవమానించేదిగా ఉందని మండిపడ్డారు. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకుని రాజ్యాంగ విలువలను రక్షించాలని కోరారు. వ్యక్తిగత అహాన్ని పక్కనబెట్టి తాను కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో ఎన్నోసార్లు సమావేశమై ఐక్యత కోసం చర్చించినట్టుగా చెప్పారు. అసెంబ్లీ స్పీకర్, సీఎం అతి తెలివి ప్రదర్శిస్తున్నారని, వ్యక్తిగత అఫిడవిట్లు అడిగి స్పీకర్ తప్పు చేశారని అన్నారు. జై సమైక్యాంధ్ర అంటూ శాసనసభలోనే ప్లకార్డులు పట్టుకుని తిరుగుతున్న శాసనసభ వ్యవహారాల మంత్రి శైలజానాథ్‌కు మంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని కేకే అన్నారు.
నాగం జనార్దన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభలో సవరణలపై ఓటింగ్ అడిగే హక్కు శాసనసభకు లేదన్నారు. సవరణలపై ఓటింగ్ ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను అవమానించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం కిరణ్ ఇంకా బ్యాటింగ్ చేస్తానంటే తెలంగాణ మహిళలు బాంబులనే బంతులుగా వేస్తారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు. దొంగ రాజీనామా డ్రామాతో మంత్రి శ్రీధర్‌బాబు తెలంగాణ ఉద్యమకారుడు కాలేడన్నారు. దీక్షలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జి.అరవింద్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఏనుగు రవీందర్ రెడ్డి, నల్లాల ఓదేలు, కావేటి సమ్మయ్య, మొలుగూరి భిక్షపతి, దాస్యం వినయ్‌భాస్కర్, సోమారపు సత్యనారాయణ, ఎస్.వేణుగోపాలచారి, జేఏసీ నేతలు దేవీ ప్రసాద్, అద్దంకి దయాకర్, సి.విఠల్, కత్తి వెంకటస్వామి, రాజేందర్ రెడ్డి, రసమయి బాలకిషన్, వి.శ్రీనివాస్‌గౌడ్, రోషం బాలు, మణిపాల్ రెడ్డి, పిట్టల రవీందర్, థామస్ రెడ్డి, వెంకటరెడ్డి, మట్టి మనుషులు వేనేపల్లి పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.