
కోడెల శివరామకృష్ణ మల్టీప్లెక్స్ ఎదుట కార్పొరేషన్‌కు వదిలేసిన స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ప్రహరీ, గేటు
గుంటూరు నడిబొడ్డున నాజ్ సెంటర్‌లో కోట్ల రూపాయల విలువ చేసే మల్టీఫ్లెక్స్ కాంప్లెక్స్ నిర్మించారు స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ. దీని నిర్మాణం కోసం ముందుగా కొంత స్థలాన్ని జీఎంసీకి ఇస్తూ ఆయన గాలం వేశారు. టైటిల్ డీడ్ కూడా మార్చకుండానే అధికారులు హడావుడిగా కాంప్లెక్స్ నిర్మాణానికి అన్ని అనుమతులు చకచకా మంజూరు చేశారు. అనంతరం కార్పొరేషన్‌కు సమర్పించిన స్థలం వెనక్కి ఇవ్వాలంటూ శివరామ్ లేఖ రాసేశారు. కార్పొరేషన్ ససేమిరా అనడంతో నిబంధనలన్నీ తుంగలో తొక్కి అదే స్థలంలో ప్రహరీ నిర్మించేశారు. ఇలా యథేచ్ఛగా ఉల్లంఘనులకు పాల్పడుతున్నా అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారు.
సాక్షి, గుంటూరు: మల్టీప్లెక్స్ అనుమతి కోసం లక్షల రూపాయల విలువైన స్థలం జీఎంసీకి అప్పగించారు. ఆ తర్వాత పక్కా ప్లాన్‌తో ఆ స్థలాన్ని మళ్లీ వెనక్కి తీసేసుకుని ప్రహరీ నిర్మించారు. కోట్ల రూపాయల వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటే రూపాయి కూడా చెల్లించకుండానే ఆక్కుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ), ప్రాపర్టీ ట్యాక్స్ పొందారు. అధికార పార్టీ మార్క్ రాజకీయం చూపారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే... గుంటూరు నగరంలోని నాజ్ సెంటర్‌లో ఇండో అమెరికన్ సూపర్‌స్పెషాలిటీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కోడెల శివరామకృష్ణ పేరుతో 5,135 చదరపు అడుగుల స్థలంలో మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టేందుకు 2013 జనవరిలో నగరపాలక సంస్థ అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టేందుకు రోడ్డు ఇరుకుగా ఉందని టౌన్‌ప్లానింగ్ అధికారులు చెప్పడంతో నిబంధనల ప్రకారం భవిష్యత్తులో రోడ్డు విస్తరణ కోసం 165.55 చదరపు అడుగుల స్థలాన్ని కార్పొరేషన్‌కు అప్పగించారు. దీంతో మల్టీప్లెక్స్ నిర్మాణానికి నగరపాలక సంస్థ అనుమతులు మంజూరు చేసింది.
అయితే అదే సమయంలో జిల్లాలోని ఓ ఉన్నత స్థాయి అధికారి పావులు కదిపి మల్టీప్లెక్స్ ఎదురుగా ఉన్న ఏఈఎల్సీ స్థలంలోకి రోడ్డు వేసి విస్తరణ చేశారు. అప్పట్లో దీనిపై తీవ్ర ఆందోళనలు కూడా జరిగాయి. అయితే అధికారులు మాత్రం బలవంతంగా రోడ్డు విస్తరణ చేసి తమ స్వామి భక్తిని చాటుకున్నారు. ఆ తర్వాత తాము రోడ్డు విస్తరణ కోసం ఇచ్చిన స్థలాన్ని వెనక్కు ఇవ్వాలంటూ నగరపాలక సంస్థ అధికారులకు లేఖ రాశారు. అయి తే రోడ్డు కోసం ఇచ్చిన స్థలాన్ని వెనక్కు ఇవ్వడం కుదరదని నగరపాలకసంస్థ అధికారులు తేల్చి చెప్పారు. అయితే కోడెల శివరామకృష్ణ మాత్రం నగరపాలక సంస్థ అధికారులు అనుమతి లేకుం డా దౌర్జన్యంగా కార్పొరేషన్‌కు ఇచ్చిన స్థలాన్ని కలుపుకుని ప్రహరీ గోడ నిర్మించేశారు. ఇదంతా తెలిసినప్పటికీ కార్పొరేషన్ అధికారులు అడ్డుకునే ధైర్యం చేయలేక వదిలేశారు. గుంటూరు నగరానికి నడిబొడ్డున ఉండే నాజ్‌సెంటర్‌లో గజం స్థలం విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుం దని చెబుతున్నారు. అంటే కోడెల శివరామకృష్ణ కార్పొరేషన్ నుంచి లాగేసుకున్న 18.3 గజాల స్థలం విలువ సుమారు రూ.50 లక్షలకు పైగా ఉం టుందని అంచనా వేస్తున్నారు. రోడ్డు పక్కన చిన్న చిన్న నిర్మాణాలను సైతం బలవంతంగా తొ లగించే నగరపాలక సంస్థ అధికారులు లక్షల వి లువ చేసే జీఎంసీ స్థలాన్ని లాగేసుకున్నా అడ్డుకో కపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు యత్నం
మల్టీప్లెక్స్ నిర్మాణం జరిపిన స్థలానికి సంబంధించి ఖాళీ స్థలానికి వేసే పన్నును ఇంత వరకూ చెల్లించలేదు. సుమారుగా రూ.1.30 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా టీఎస్ పలనీయపు పిల్లై పేరుతో సగం, ఇండో అమెరికన్ సూపర్‌స్పెషాలిటీస్ లిమిటెడ్ ఎండీ కోడెల శివరామకృష్ణ పేరుతో సగం స్థలం ఉంది. అయితే టైటిల్ కూడా ట్రాన్స్‌ఫర్ చేయకుండానే మొత్తం స్థలంలో మల్టీప్లెక్స్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం దారుణమైన విషయం. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ టీఎస్ పలనీయపు పిల్లై, ఇండో అమెరికన్ సూపర్‌స్పెషాలిటీస్ లిమిటెడ్ ఎండీ కోడెల శివరామకృష్ణ పేరుతో వేరువేరుగా వేసిన అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ మాత్రం టైటిల్ ట్రాన్సఫర్ కాకపోయినా ఇండో అమెరికన్ సూపర్‌స్పెషాలిటీస్ లిమిటెడ్ ఎండీ కోడెల శివరామకృష్ణ పేరుతో సగం, డీమార్టు పేరుతో సగం వేశారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అడ్డగోలుగా వ్యవహరించారు. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్‌కు సంబంధించి ఒక్క రూపాయి పన్ను చెల్లించకపోయినా ఆక్కుపెన్సీసర్టిఫికెట్ (ఓసీ), ప్రాపర్టీ ట్యాక్స్ వేశారంటే అధికార పార్టీ ముఖ్యనేత ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మినహాయింపు ఇచ్చిన పురపాలక శాఖ
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్న సామెత కోడెల మల్టీప్లెక్స్ విషయంలో పురపాలకశాఖ ఉన్నతాధికారులు అనుసరించిన తీరుకు సరిగ్గా సరిపోతుంది. నిబంధనల ప్రకారం ఏదైనా స్థలంలో అపార్ట్‌మెంట్, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టాలంటే ముందుగా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కోడెల మల్టీప్లెక్స్ విషయంలో మాత్రం సుమారు రూ.1.30 కోట్ల వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ బకాయి ఉన్నప్పటికీ నగరపాలకసంస్థ అధికారులు బిల్డింగ్ నిర్మాణ అనుమతులు, ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్‌లు ఇచ్చేశారు. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించకుండా ప్రాపర్టీ ట్యాక్స్ వెయ్యకూడదు. అయితే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్‌లో 50 శాతం మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కోడెల శివరాం పురపాలకశాఖ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు పరిశీలనలో ఉందన్న కారణాన్ని చూపి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ప్రాపర్టీ ట్యాక్స్ వేసేశారు. అధికారం చేతుల్లో ఉంటే ఏ పనైనా జరిగిపోతుందనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment