కోడెల శివరామ్‌కు చుక్కెదురు | Kodela Siva rama krishna Gowtham Hero Showroom Authorization Cancelled In Guntur | Sakshi
Sakshi News home page

కోడెల శివరామ్‌కు చుక్కెదురు

Published Fri, Aug 30 2019 9:18 AM | Last Updated on Fri, Aug 30 2019 9:18 AM

Kodela Siva rama krishna Gowtham Hero Showroom Authorization Cancelled In Guntur - Sakshi

గుంటూరు నగరంలోని కోడెల శివరామ్‌కు చెందిన గౌతమ్‌ హీరో షోరూమ్‌

సాక్షి, గుంటూరు : పాపం పండింది.. కేసులు చుట్టుముడుతున్నాయి.. చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరపడ్డాయి.  కే–ట్యాక్స్‌లు, ల్యాండ్‌ కన్వర్షన్‌ల పేరుతో ప్రజలను, సొంత పార్టీ నేతలను దోచుకున్న మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామకృష్ణకు చుక్కెదురైంది. శివరామ్‌కు చెందిన గౌతమ్‌ హీరో షోరూమ్‌ ఆథరైజేషన్‌ను రవాణా శాఖ అధికారులు రద్దు చేశారు. గుంటూరు నగరంలోని చుట్టుగుంట సెంటర్‌లో కోడెల శివరామ్‌కు చెందిన గౌతమ్‌ హీరో షోరూమ్‌లో బైక్‌ల విక్రయాల్లో భారీ కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. 1025 బైక్‌లను టీఆర్‌ లేకుండా విక్రయించినట్టు రవాణా శాఖ అధికారులు గుర్తించారు. టీఆర్‌ (తాత్కాలిక రిజిస్ట్రేషన్‌) లేకుండా బైక్‌లు డెలివరీ చేసిన శివరామ్‌ టీఆర్, లైఫ్‌ ట్యాక్స్, శాశ్వత రిజిస్ట్రేషన్, సర్వీస్‌ చార్జీ, హెచ్‌ఆర్‌పీఎస్‌ (హైసెక్యూరిటీ) నంబర్‌ ప్లేట్, పోస్టల్, ఇతర ఫీజుల కింద ఒక్కో బైక్‌కు సగటున రూ.8 వేల చొప్పున వసూలు చేశారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా కోడెల శివరామ్‌ నొక్కేశారు.

రవాణా శాఖ అధికారుల విచారణలో ఈ విషయాన్ని బైక్‌ల యజమానులు తెలిపారు. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా టీఆర్‌ లేకుండా బైక్‌ల విక్రయాలు చేసి ప్రభుత్వానికి రూ.లక్షల్లో గండి కొట్టిన శివరామ్‌పై పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. రవాణా శాఖ అధికారులు గౌతమ్‌ షోరూమ్‌ను సీజ్‌ చేయడంతో శివరామ్‌ కోర్టును ఆశ్రయించాడు. 576 వాహనాలను మాత్రమే టీఆర్‌ లేకుండా విక్రయించామని కోర్టు ముందు ఒప్పుకున్నాడు.  ఈ బైక్‌ల విక్రయాలకు సంబంధించి ఎగ్గొట్టిన మొత్తాన్ని చెల్లిస్తానని శివరామ్‌ తెలియజేశాడు. 576 బైక్‌లకు సంబంధించి 40.26 లక్షలు ప్రభుత్వ ఖజానాకు వెళ్లాల్సిన మొత్తాన్ని శివరామ్‌ ఎగ్గొట్టినట్టు రవాణా శాఖ అధికారులు నిర్ధారించారు. 

షాక్‌ల మీద షాక్‌లు..
కోడెల శివరామ్‌కు షాక్‌ మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఫర్నిచర్‌ను షోరూమ్‌లో వినియోగించుకున్నందుకు శివరామ్‌పై ఇటీవలే పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు నగరంలో భాగ్యనగర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఏరియాలో అక్రమంగా నిర్మిస్తున్న భవనానికి కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నోటీసు జారీ చేశారు. త్వరలో ఆ భవనాన్ని కూల్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్‌ హీరో షోరూమ్‌ ఆథరైజేషన్‌ రద్దు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన పాపాలన్నీ పండుతున్నాయని తగిన మూల్యం చెల్లించుకుంటున్నాడని అందరూ అంటున్నారు. 

మిగిలిన విక్రయాలపై విచారణ...
గౌతమ్‌ షోరూమ్‌లో 1025 బైక్‌లు నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్టు రవాణా శాఖ అధికారుల విచారణలో తెలిసింది. అయితే 576 బైక్‌లను మాత్రమే టీఆర్‌ లేకుండా విక్రయించినట్టు శివరామ్‌ ఒప్పుకున్నారు. మిగిలిన 449 బైక్‌ల విక్రయాలపై రవాణా శాఖ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. బైక్‌ల విక్రయాల్లో జరిగిన కుంభకోణంలో శివరామ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. ఒక వైపు రవాణా శాఖ, మరో వైపు పోలీస్‌ శాఖ అధికారులు బైక్‌ల విక్రయాల కుంభకోణంపై విచారణ వేగవంతం చేస్తుండటంతో కోడెల శివరామ్‌కు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈయనపై సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు నగరంలోని నగరంపాలెం, తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లలో క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోసం శివరామ్‌ హైకోర్టును ఆశ్రయించాడు. కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ నుంచి దొంగతనంగా తీసుకువచ్చిన ఫర్నిచర్‌ను శివరామ్‌ తన షోరూమ్‌లో వినియోగించాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement