జాతీయ పర్యాటక కేంద్రంగా కొల్లేరు!
సీఎం చంద్రబాబు ప్రకటన
పక్షుల కేంద్రం పరపతి పెరిగేనా?
నష్టపరిహారం కోసం ప్రజల ఎదురుచూపు
కైకలూరు : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చిత్తడి నేలల ప్రాంత మైన కొల్లేరు సరస్సును జాతీయ స్థాయిలో గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడలో శనివారం జరిగిన జిల్లా కలెక్టర్ల రెండోరోజు సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఈ ప్రకటన పర్యాటక ప్రేమికులకు హర్షం కలిగిస్తోంది. మరోపక్క కొల్లేరు ప్రజలకు మాత్రం నిరాశనే మిగుల్చుతోంది.
ఇటీవల కొల్లేటికోట గ్రామంలో జరిగిన బహిరంగ సభలో కాంటూరు కుదింపు, కొల్లేరు ఆపరేషన్‌లో అదనంగా ధ్వంసం చేసిన 7,500 ఎకరాల భూములు పంపిణీ చేయాలనే ప్రధాన డిమాండ్లను కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని కొల్లేటి ప్రజలు కేంద్ర మంత్రులు జవదేకర్, వెంకయ్యనాయుడుల ముందుంచారు. కాంటూరు కుదింపు కోసం రాష్ట్రం నుంచి తీర్మానం చేసి పంపించినా, కేంద్రం దీనిపై నిర్ణయం ప్రకటించకపోవటం కొల్లేరు ప్రజలను డోలాయమానంలో పడేసింది.
పరిహారం లేకుండా పర్యాటకమా?
పరిహారం లేకుండా పర్యాటకం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని 77 వేల 131 ఎకరాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. కొల్లేరు ఆపరేషన్ సమమంలో రెండు జిల్లాల్లో కలిపి 31 వేల 125.75 ఎకరాల్లో అక్రమ చెరువులను ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లాలో కైకలూరు మండలంలో 10,175 ఎకరాలు, మండవల్లి మండలంలో 7,274 ఎకరాలు వెరసి 17,449 ఎకరాల్లో చెరువులు ఈ ఆపరేషన్‌లో ధ్వంసమయ్యాయి.
గత నెల 12న విజయవాడలో జరిగిన రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు (ఎస్‌బీడబ్ల్యూఎల్) సమావేశంలో కొల్లేరు అభయారణ్యాన్ని ఐదు నుంచి మూడుకు కుదిస్తే 43 వేల 777 ఎకరాల భూమి మిగులుతుందని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.కె.ఫరీడా లెక్కలు తేల్చారు. కాంటూరు కుదింపు అశం ఇప్పుడే తేలే అవకాశం కనిపించడం లేదు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో జిరాయితీ రైతుల భూములు ధ్వంసమయ్యాయి. ఇరు జిల్లాల్లో జిరాయితీ భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కింద రూ.625 కోట్లు కేటాయించాలని వైఎస్ ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా నష్టపరిహారాన్ని కొల్లేరు రైతులకు అందించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
పక్షుల కేంద్రం దశ తిరిగేనా?
రాష్ట్రంలోనే పక్షి ప్రేమికుల స్వర్గధామంగా కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రం వినుతికెక్కింది. అరుదైన విదేశీ పెలికాన్ పక్షులు ఇక్కడ స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇక్కడ 300 ఎకరాల్లో యాత్రికులకు విహార చెరువు ఉంది. కత్తిపూడి - పామర్రు జాతీయ రహదారి సమీపంలో ఈ కేంద్రం ఉండటంతో పర్యాటకుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. వచ్చిన యాత్రికులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఇక్కడ రిసార్టులు, పక్షుల ఆవాసాలకు ఏర్పాట్లు చేస్తే పర్యాటక ఆదాయం పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.