Bird sanctuary
-
పురిటి కోసం విదేశాల నుంచి వస్తున్న పక్షులు.. ఎక్కడో తెలుసా?
తేలినీలాపురం.. సైబీరియా పక్షుల విడిది కేంద్రం. పురిటి కోసం పక్షులు ఎంచుకున్న ప్రాంతం. అల్లంత దూరం నుంచి పక్షులను చూడడం, చెట్టుపై వాలిన వాటి అందాలు గమనించడం సహజం. అవే పక్షులను దగ్గరగా చూస్తే..? వాటి ఆహారం, ఆహార్యం, అలవాట్లను తెలుసుకోగలిగితే..? చింత, రావి, తుమ్మ, గండ్ర, వెదురుపై వాలే అతిథి విహంగాల జీవన క్రమాన్ని అర్థం చేసుకోగలిగితే..? ఎంత బాగుంటుందో కదా. ఆ సరదాను తీర్చడానికి తేలినీలాపురంలో పక్షుల మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఆహార అన్వేషణ, ఆవాసాలపై జీవించే క్రమంలో ఆయా పక్షుల ప్రత్యేకతలను వివరంగా తెలియజేస్తూ పక్షుల బొమ్మలను ఏర్పాటు చేశారు. పెలికాన్ పెలికాన్ బాతు జాతికి చెందిన పక్షి. దీని బరువు సుమారు 8 కిలోలు ఉంటుంది. దీని నోరు పొడవు సుమారు 14 సెంటీమీటర్లు. దీని రెక్కల పొడవు సుమారు 118 ఇంచీలు, రోజుకు 4 కిలోల చేపల్ని తింటుంది. ఒకే సారి 2 కిలోల బరువు కలిగిన చేపను సునాయాశంగా తినగలిగే సామర్థ్యం ఉంది. దీని గుడ్డు బరువు సుమారు 150 గ్రాములు. ప్రతీ సీజన్‌కు 4 గుడ్లను మాత్రమే పెడుతుంది. దీని గుడ్డు 28 రోజుల్లో పిల్లగా పరిపక్వత చెందుతుంది. 3 నెలల్లో పిల్ల తల్లిగా మారుతుంది. దీని దవడ సంచి ఆకారంలో ఉంటుంది. గంటకు 100 కిలో మీటర్ల వేగంతో పయనిస్తాయి. రోజుకు సుమారు 4 సార్లు బయటకు వెళ్తూ ఆహారాన్ని తీసుకువస్తాయి. పెలికాన్ దవడ సంచి ఆకారంలో ఉంటుంది. ఈ దవడలో సుమారు 4 కిలోల వరకు చేపల్ని నిల్వ చేయగలవు. పిల్లలకు ఆహారాన్ని నోటి ద్వారా అందజేస్తాయి. దీని జీవిత కాలం సుమారు 29 సంవత్సరాలు. పెయింటెడ్ స్టార్క్ పెయింటెడ్ స్టార్క్ కొంగ జాతికి చెందిన పక్షి. దీని బరువు సుమారు 5 కిలోలు ఉంటుంది. దీని రెక్కల పొడవు 63 ఇంచీలు, ఇవి చిన్న చేపలు, పురుగులు, నత్తలు తింటాయి. కేవలం పావు కిలో వరకు మాత్రమే నోటిలో ఆహారాన్ని నిల్వ చేయగలుగుతాయి. తీసుకువచ్చిన ఆహారాన్ని గూడు మీద వేస్తే పిల్లలు తింటాయి. దీని నోటి పొడవు సుమారు 16 సెంటీ మీటర్లు. ఆహారం కోసం రోజుకు 2 సార్లు బయటకు వెళ్తుంటాయి. దీనికి సాధారణ దవడ మాత్రమే ఉంటుంది. దీని గుడ్డు సుమారు 75 గ్రాములు. ఇవి ఒక సీజన్లో 4 గుడ్లు మాత్రమే పెడతాయి. 28 రోజుల్లో గుడ్డును పిల్లగా పరిపక్వత చేస్తుంది. పిల్ల తల్లిగా మారాలంటే సుమారు 3 సంవత్సరాలు కాలం పడుతుంది. దీని జీవిత కాలం సుమారు 29 సంవత్సరాలు. 120 రకాల పక్షుల్లో కొన్నింటి ప్రత్యేకతలు.. పొడుగు ముక్కు ఉల్లంకి: ఈ పక్షి మట్టిలో ఆహార ఆన్వేషణకు బురద మట్టి ఇసుక నేలలో అనేక రకాలైన చిన్న పురుగులను కొక్కెం వంటి ముక్కుతో వేట కొనసాగిస్తుంది. ఈ పక్షి నమూనా మ్యూజియంలో ఏర్పాటు చేశారు. తెడ్డు మూతి కొంగ: ఈ పక్షి మూతి చెంచా ఆకారంలో ఉంటుంది. నీటి అడుగున ఉన్న చిన్న జీవులను వేటాడుతుంది. అర్ధ చంద్రాకారంలో గల మూతితో వేట కొనసాగిస్తుంది. పాము బాతు : బల్లెం వంటి ముక్కు ఆకారంతో ఈ పక్షి వేట కొనసాగిస్తుంది. మట్టి, నీటిలో పొడుచుకుంటూ ఆహారాన్ని సేకరిస్తుంది. రాజహంస: జల్లెడ మాదిరిగా ఉన్న ముక్కు కలిగిన ఈ రాజహంస సూక్ష్మ జీవులను సునాయాశంగా వేటాడుతుంది. ఈ పక్షి ముక్కులో ఒక రకమైన వడపోత పరికరం బిగించి ఉన్నట్లు ఉంటుంది. నత్తగుల్ల కొంగ: నత్తలను వేటాడడంలో ఈ పక్షి ముక్కు ఎంతో షార్ప్‌గా ఉంటుంది. నత్తలను గట్టిగా పట్టుకోవడంతో ఆహారాన్ని సంపాదించుకుంటాయి. మ్యూజియం చూసొద్దామా... టెక్కలి సమీపంలోని తేలినీలాపురంలొ ఈ మ్యూజియం ఉంది. ఇది శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి ఎంత దూరం 70 కిలోమీటర్లు ఉంటుంది. రవాణా: టెక్కలి వరకు రైలు సదుపాయం ఉంది. బస్సు సదు పాయం కూడా ఉంది. టెక్కలి నుంచి పూండి మార్గంలో ఉన్న ఈ ప్రదేశానికి బస్సులు, ఆటోలు కూడా ఉన్నాయి. సందర్శనీయ వేళలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. -
వి‘హంగామా’.. విదేశీ పక్షులతో ‘తేలుకుంచి’ పులకింత
సాక్షి, శ్రీకాకుళం: పచ్చని చెట్లు తెల్లటి దుప్పటి కప్పుకున్నాయా.. అన్నట్లు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి గ్రామంలో విదేశీ పక్షులు కనువిందు చేస్తున్నాయి. మేఘాల పల్లకిలో వేల కిలోమీటర్లు అలుపూ సొలుపు లేకుండా పయనించి అబ్బురపరుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు చిత్ర విచిత్రమైన చప్పుళ్లతో చెట్లపై సందడి చేస్తున్నాయి. ఇవీ ప్రత్యేకతలు.. చెట్లపై కొమ్మలు, రెమ్మలు ఉంటే తప్ప గూడు ఏర్పాటు చేసుకోలేని ఈ పక్షులు గుడ్లు పెట్టేందుకు చెట్లనే ఆశ్రయిస్తుంటాయి. ఒక్కో పక్షి 2 నుంచి 6 గుడ్లు వరకు పెడుతుంటాయి. 27 నుంచి 30 రోజుల వరకు తల్లి పక్షి గుడ్లు పొదుగుతుంది. పొదిగిన రోజు నుంచి 36 రోజుల పాటు ఆహారాన్ని తీసుకువచ్చి అందించి సంరక్షిస్తాయి. పిల్ల పక్షులు ఎగిరేంత వరకు తల్లి పక్షి గానీ, మగ పక్షి గానీ గుళ్లలో కాపలాగా ఉంటాయి. ఏటా తొలకరి జల్లులు కురిసే జూన్‌లో సైబీరియా నుంచి వస్తోన్న ఈ పక్షుల అసలు పేరు ఓపెన్ బిల్ స్టార్క్స్ (నత్తగొట్టు కొంగలు, చిల్లు ముక్కు కొంగలు). శాస్త్రీయ నామం ‘అనస్థోమస్’. తూర్పు–దక్షిణాసియా ఖండంలో ముఖ్యంగా భారత్, శ్రీలంక నుంచి మొదలుకొని తూర్పు ప్రాంతంలో విస్తారంగా సంచరిస్తుంటాయి. వీటి జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. బాగా ఎదిగిన పక్షి 81 సెంటీమీటర్ల పొడవు, 11 కిలోల బరువు ఉంటుంది. రెక్కలు విప్పారినప్పుడు 149 సెంటీ మీటర్ల వరకు ఉంటుంది. పగలంతా తంపర భూములు, వరి చేలల్లో తిరుగుతూ చేపలు, నత్తలు, కప్పలు, పురుగులు, ఆల్చిప్పలను ఆహారంగా తీసుకుంటాయి. 6 నెలల పాటు పిల్లలతో గడిపిన పక్షులు పిల్లలు ఎగిరేంత బలం రాగానే డిసెంబర్, జనవరిలో తమ ప్రాంతాలకు పయనమవుతుంటాయి. మోడువారిన చెట్లపై నివసిస్తున్న పక్షులు ఆడపడుచుల్లా విదేశీ పక్షులు.. ఈ పక్షులను తేలుకుంచి గ్రామస్తులు తమ ఆడపడుచుల్లాగా భావిస్తుంటారు. గ్రామస్తులకు వాటితో విడదీయరాని అనుబంధం ఉంది. సకాలంలో పక్షులు గ్రామానికి చేరకపోతే ఇక్కడి ప్రజలు ఆందోళనపడుతుంటారు. ఏటా జూన్‌లో ఈ పక్షుల రాకతోనే నైరుతి పవనాలు ఆరంభమవుతాయని గ్రామస్తుల నమ్మకం. వీటి రాకతో తమ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండుతాయని వారి విశ్వాసం. తాము కూర్చున్న చోట పక్షులు వాలుతాయే తప్ప ఎవ్వరికీ ఎటువంటి హాని చేయవని, వీటిని వేటగాళ్ల బారినుంచి తామే రక్షిస్తుంటామని గ్రామస్తులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా పక్షులకు హాని తలపెట్టాలని చూస్తే గ్రామ కట్టుబాటు ప్రకారం ఆ వ్యక్తికి గుండు గీయించి ఊరేగిస్తారు. తిత్లీ, పైలాన్ తుఫాన్ తీవ్రతకు చెట్లు నేలకొరగడంతో విహంగాలకు తేలుకుంచిలో విడిదిలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఏడాదికి వీటి సంఖ్య 30–40% తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం పక్షులు గూళ్లు పెట్టేందుకు నానాపాట్లు పడుతున్నాయి. చెట్లనే ఆవాసాలుగా ఏర్పాటు చేసుకునే ఈ పక్షులు చెట్లు లేక గడ్డికుప్పలు, ఇళ్లపై, పంట పొలాల చాటున గూళ్లు పెట్టుకునేందుకు సిద్ధపడుతున్నాయి. రాత్రి సమయాల్లో విష పురుగులు బారినపడి పక్షులు మృతి చెందుతున్నాయి. పక్షులను సంరక్షించేందుకు గ్రామంలో చెట్లు పెంచాలని అధికారులకు తేలుకుంచి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
Tourist Spot: భరత్పూర్ బర్డ్ శాంక్చురీ విహారం.. ఖండాంతరాలు దాటి..
భరత్పూర్ బర్డ్ శాంక్చురీ... మన పక్షి ప్రేమికుడు సలీం అలీ మానసపుత్రిక. పక్షులు... ఖండాలు దాటి వస్తాయి. పర్యాటకులు... దేశాలు దాటి వస్తారు. పిల్లలు... ఏకంగా బడినే తెచ్చేస్తారు. worlds most important bird breeding: భరత్పూర్ బర్డ్ శాంక్చురీ రాజస్థాన్‌లో ఉంది. ఈ ప్రదేశం దేశరాజధాని ఢిల్లీకి ఆ రాష్ట్ర రాజధాని జైపూర్‌కు సమదూరంలో ఉంది. ఆగ్రాలో తాజ్‌మహల్ చూసిన తర్వాత పశ్చిమంగా యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తే భరత్‌పూర్‌లో ఉంటాం. ఏటా ఇక్కడికి సైబీరియా పక్షులు వస్తాయి. ఇక్కడ ఉన్నవి, అతిథులుగా వచ్చినవి కలిపి మొత్తం 370 పక్షిజాతులను చూడవచ్చు. అందుకే ప్రపంచంలోని ఆర్నిథాలజిస్టులు భరత్‌పూర్‌కి క్యూ కడతారు. ఏడాదికి లక్ష మంది పర్యాటకులకు తగ్గరు, వారిలో యాభై వేల మంది విదేశీయులే. స్కూలు పిల్లలైతే ఆ పరిసరాల జిల్లాలే కాదు ఢిల్లీ నుంచి కూడా ఎక్స్కర్షన్కి భరత్‌పూర్‌కి వస్తారు. పిల్లలకు వంద పేజీల పుస్తకంతో కూడా చెప్పలేనన్ని సంగతులను ఒక్క టూర్‌తో చెప్పవచ్చు. అందుకే బడి అప్పుడప్పుడూ అడవిలోకి వచ్చేస్తుంటుంది. బర్డ్ సాంక్చురీలో ఏనుగు మీద విహారం ఏనుగు అంబారీ! భరత్పూర్ బర్డ్ శాంక్చురీలో ఎలిఫెంట్ సఫారీ, జీప్ సఫారీతోపాటు రిక్షా సఫారీ కూడా ఉంటుంది. పక్షులు శబ్దాలకు బెదిరి ఎగిరిపోకుండా ఉండాలంటే ఏనుగు మీద కానీ రిక్షాలో కానీ వెళ్లాలి. రిక్షావాలానే గైడ్‌గా వ్యవహరిస్తాడు. దట్టమైన అటవీప్రదేశంలోకి వెళ్లడానికి మాత్రం జీప్ సఫారీనే మంచి ఆప్షన్. ఇక్కడ సఫారీ పగలు మాత్రమే. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది. బర్డ్ శాంక్చురీ ప్రవేశ ద్వారం దగ్గరే జీప్ బుక్ చేసుకోవాలి. మితిమీరిన శబ్దాలను, హారన్లను అనుమతించరు. సొంత వాహనంలో వెళ్లినా సరే శాంక్చురీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఆ వాహనాన్ని వదిలి టూరిజం శాఖ వాహనాల్లోనే లోపలికి వెళ్లాలి. ఇక్కడ ఫొటోగ్రఫీ, వీడియో షూటింగ్‌ను అనుమతిస్తారు. కానీ ఎంట్రీ టికెట్‌తోపాటు కెమెరాలకు చార్జ్ చెల్లించాలి. చదవండి: ఈ సబ్బు ఖరీదు తెలిస్తే మూర్చపోతారు!.. రూ. 2.7 లక్షలట!! వేటాడే అడవి కాదిప్పుడు ►ఇది ఒకప్పుడు భరత్పూర్ రాజుల వేటమైదానం. బ్రిటిష్ వైశ్రాయ్‌లు కూడా ఏటా ఇక్కడ డక్షూట్ నిర్వహించేవారు. ►ఒక ఏడాది వైశ్రా య్ లార్డ్ లినిత్గౌ వేటలో వేలాది పక్షులు వేట ఆనందానికి బలయ్యాయి. ►ప్రసిద్ధ పక్షి ప్రేమికుడు సలీం అలీ కృషితో నలభై ఏళ్ల కిందట ఈ ప్రదేశం పక్షి సంరక్షణ కేంద్రంగా మారింది. ►1985లో ఇది వర ల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది. ►అడవిలో నేల రాళ్ల మయం. నున్నటి కాలిబాట వంటి రోడ్డు కూడా ఉండ దు. రాళ్లబాటలోనే నడవాలి. కాబట్టి ఈ టూర్లో మంచి షూస్ ధరించాలి. ►ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, జైపూర్ టూర్ ప్లాన్‌లో భరత్పూర్ కూడా ఇమిడిపోతుంది. ఇదే మంచికాలం! ఖండాంతరాల నుంచి వచ్చే వలస పక్షులను చూడాలంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వెళ్లాలి. ఆహ్లాదకరంగా వెకేషన్ కోసమే అయితే ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఎప్పుడైనా వెళ్లవచ్చు. గడ్డకట్టే చల్లని వాతావరణం నుంచి సమశీతోష్ణమైన వాతావరణాన్ని వెతుక్కుంటూ వచ్చే ఈ పక్షులకు ఆరు నెలల పాటు మంచి విడిది భరత్పూర్ బర్డ్ శాంక్చురీ. ఏదైనా కారణం చేత ఒక ఏడాది నీటి నిల్వలు లేకపోయినట్లయితే ఈ పక్షులు నీళ్లున్న వేరే ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్లిపోతాయి. ఒకసారి ఈ చక్రం గాడి తప్పితే మళ్లీ పక్షులు ఈ ప్రదేశానికి రావడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఈ బర్డ్ శాంక్చురీ అసలు పేరు కేలాదేవ్ నేషనల్ పార్క్. ఈ పక్షి సంరక్షణ కేంద్రం భరత్‌పూర్‌కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే భరత్‌ఫూర్ శాంక్చురీగా వాడుకలోకి వచ్చింది. ఆకాశంలో ఉండే ఇంద్రధనస్సు నేలకు దిగి పక్షుల రెక్కల్లో ఒదిగిపోయినట్లు్ల ఉంటుంది. రంగురంగుల పక్షులు నీటిలో మునిగి చేపలు పట్టుకుని కడుపు నిండిన తర్వాత ఒడ్డుకు చేరతాయి. తడిసిన రెక్కలను విప్పార్చి సన్‌బాత్ చేస్తున్న దృశ్యం ఈ టూర్లో కనువిందు చేసే మరో ప్రత్యేకత. చదవండి: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్.. -
విదేశీ వలస విహంగాలొచ్చేశాయ్....
దొరవారిసత్రం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి అతిథులు వచ్చేశాయ్. ప్రస్తుతం వందల సంఖ్యలో వలస విహంగాలు ఇక్కడ విడిది చేస్తున్నాయి. విదేశీ వలస పక్షుల్లో రారాజుగా ప్రసిద్ధి చెందిన గూడబాతులు (పెలికాన్స్) గత మూడు రోజులుగా సందడి చేస్తున్నాయి. కేంద్రంలో ప్రస్తుతం 200కి పైగా గూడబాతులు విడిది చేస్తున్నట్లు వన్యప్రాణి విభాగం సిబ్బంది తెలిపారు. వీటితోపాటు సీజన్‌కు ముందే ఇక్కడకు విచ్చేసిన నత్తగుళ్ల కొంగలు (ఓపెన్ బిల్‌స్టార్క్స్) 500, తెల్లకంకణాయిలు (వైట్‌ఐబీస్) 200, పెద్ద నీటికాకులు (కార్మోరెంట్స్) 100కి పైగా విడిది చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: నాణేనికి మరోవైపు.. ‘అట్టర్’లతో అసలుకే ఎసరు!) ఇంకా తెడ్డుముక్కు కొంగలు, నారాయణ పక్షులు, పాముమెడ కొంగలు వంటి పక్షులు రావాల్సి ఉంది. అయితే.. ప్రసిద్ధి చెందిన గూడబాతులకు స్థానికంగా వాతావరణం అనుకూలించకపోతే మాత్రం అవి వెనుతిరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు కురిసిన వానలకు అత్తిగుంట, నేరేడుగుంట, మారేడుగుంట చెరువుల్లోకి అరకొరగా మాత్రమే నీళ్లు చేరుకున్నాయి. విడిది కోసం వచ్చిన విహంగాలు అడుగంటిన నీళ్లలోనే జలకాలాడుతూ సంచరిస్తున్నాయి. పుష్కలంగా వర్షాలు కురిసి చెరువుల్లో çపూర్తి స్థాయిలో నీళ్లు ఉంటే ఇప్పటికే వేల సంఖ్యలో వలస విహంగాలు ఇక్కడ విడిది చేస్తూ ఉండేవి. చదవండి: ప్రారంభమైన ఫ్లెమింగోల సందడి.. -
AP Special: పక్షుల ప్రేమాయణ కేంద్రం నేలపట్టు..!
నాయుడుపేట: నెల్లూరుజిల్లా నేలపట్టు గ్రామం పక్షుల ప్రేమాయణ కేంద్రంగా పిలవబడుతోంది. నాయుడుపేటకు 12 కిలోమీటర్లు దూరంలో దొరవారిసత్రం మండల పరిధిలోని ఈ గ్రామం ఉంది. క్రమేపీ ఈ గ్రామం విదేశీ పక్షులకు కేంద్ర బిందువుగా మారింది. 40–50 ఏళ్లు క్రితం నుండి పక్షుల నేలపట్టు, మైలింగం గ్రామాల చెరువులు, అటవీ ప్రాంతం వైపు సంచరించేవి. దట్టమైన చిట్టడివి కావడం పక్షులు విడిది చేసేందుకు వీలుగా వుండడం, జన సంచారంలేని ప్రాంతంగా వుండేది. పగలంతా అటవీ ప్రాంతంలో పురుగులు, చేపలను వేటాడి ఆహారంగా తీసుకునేవి. సందగూకల (సాయింత్రంవేళ) నేలపట్టు గ్రామంలో చెట్లుపై కిలకిలరావాలతో సందడి చేసేవి. దేవతా పక్షులుగా పూజలు... మెట్ట ప్రాంతంగా పేరున్న నేలపట్టు, మైలాంగి గ్రామాలు వర్షాలు పడేవి కావు. జీవనోపాధి కోసం గ్రామస్థులు కూలీ పనులకు ఇతర మండలాలలకు వలస వెళ్లేవారు. విదేశీ పక్షులు రావడం ఆరంభించాక, సకాలంలో వర్షాలు రావడంతో గ్రామస్థులు శుభ సూచికంగా భావించారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా వర్షాలు రావడం పంట పండించుకోవడంతో వలసలకు పుల్‌స్టాఫ్ పడింది. ఆనాటి నుండి వీటిని దేవత పక్షులుగా నేలపట్టు, మైలాంగం రైతులు పక్షులకు పూజలు చేయడం కొనసాగించారు. పక్షులపై దాడులు, పక్షులను వేటాడనివ్వకుండా సంరక్షించే బాధ్యత రైతులే తీసుకున్నారు. రైతులకు కావాల్సిన వర్షాలు సంవృద్దిగా కురవడంతో పాటు పంటల దిగుబడి బాగా వుండేది. 1976లో అటవీశాఖ, వన్యప్రాణి సంరక్షణ శాఖల అధికారులు పక్షులను సంరక్షించే బాధ్యత తీసుకున్నారు. నేటపట్టులో చెరువులకు నీటిని నింపడం, బలహీనంగా వున్న చెరువు కట్టలను బాగు చేయడం, చెట్లు పెంచడం, పక్షులకు మేతను ఇచ్చే మొక్కలు పెంచడం, చెరువుల్లో చేప పిల్లలను వృద్ది చేయడం వంటి పలు సంరక్షణ చర్యలు చేపట్టారు. పైగా పక్షులకు ఆసియా కండంలోనే అతి పెద్ద రెండవ ఉప్పునీటి పులికాట్ సరస్సు వుండడం పక్షులకు అనువైన ఆవాసయోగ్యమైన ప్రాంతంగా నిలుస్తోంది. సంతానోత్పత్తి ఇక్కడే.... విహంగాల్లో ప్రసిద్ధి చెందిన రారాజులుగా పిలువబడే గూడబాతులు (పెలికాన్స్), తెల్లకంకణాయిలు, తెడ్డు ముక్కుకొంగలు, నత్తగుళ్లకొంగలు (ఓపెన్‌బిల్‌స్టార్క్స్), నీటి కాకులు, స్వాతికొంగలు, పాముమెడకొంగలతో పాటు బాతు జాతీకి చెందిన పలు రకాల పక్షులు సైబీరియా, నైజీరియా, ఖజికిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బర్మ, నేపాల్ తదితర దేశాల నుంచి తరలివస్తాయి. ఇలాంటి విదేశీ పక్షులకు వాతావరణ సమతుల్యత, విశాలమైన భూభాగం కలిగివుండడం వీటి సతానోత్పత్తికి అనువైన ప్రాంతంగా నిలుస్తోంది. విదేశాల నుండి వచ్చిన పక్షులు స్నేహభావంతో మెలగడం, సహజీవనం చేయడం, ప్రేమాయణంలోపడి సంతానోత్పత్తిని వృద్ది చేసుకుంటాయి. సమీపంలోని చెరువులు, సరస్సుల్లో చేపలను పిల్లలకు ఆహారంగా అందించి తమ స్వస్థలాలకు తిరిగి ఏప్రిల్ నెలలో పయనమవుతాయి పక్షులు. నేలపట్టు పక్షుల కేంద్రాన్ని విదేశీ పక్షుల ప్రేమాయణ కేంద్రంగా స్థానికులు చర్చించుకోవడం విశేషం. -
నాణేనికి మరోవైపు.. ‘అట్టర్’లతో అసలుకే ఎసరు!
ఉప్పలపాడు పక్షి కేంద్రం వేలాది వలస పక్షులకు స్వర్గధామం. మూడు దశాబ్దాలుగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆవాసానికి ఇప్పుడు అట్టర్‌ల (నీటికుక్కలు) రూపంలో పెద్ద చిక్కొచ్చి పడింది. మాంసాహార క్షీరదాలైన ఈ అట్టర్లు వలస పక్షులను కబళిస్తున్నాయి. ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా సైట్‌గా బోంబే నేచురల్ సొసైటీ గుర్తింపు పొందిన ఈ పక్షి కేంద్రం భవితవ్యంపై ఇప్పుడు నీలినీడలు అలుముకున్నాయి. అట్టర్లు.. వాటి కథాకమామీషు ఏంటంటే.. తెనాలి : సహజసిద్ధంగా ఏర్పడే పక్షుల ఆవాసాలకు భిన్నమైంది గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు పక్షి కేంద్రం. మాగాణి భూముల్లోని చెరువులో పక్షి ప్రేమికుల ప్రోత్సాహం, గ్రామస్తుల సహకారం, ప్రభుత్వ తోడ్పాటుతో మూడు దశాబ్దాలుగా ప్రత్యేకత సంతరించుకున్న ఈ పక్షి కేంద్రం.. ఇటీవల అరుదైన క్షీరద జాతికి ఆవాసమైంది. ఐక్యరాజ్య సమితి తరఫున ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్ (ఐయూసీఎన్) సంస్థ రెడ్‌లిస్ట్‌లో చేర్చిన ఈ అట్టర్లు ఇక్కడ విహరిస్తున్నాయి. స్థానికులు నీటికుక్కలుగా పిలుచుకుంటున్న ఈ ఆట్టర్‌లు పక్షి కేంద్రం చెరువులో స్వేచ్ఛగా సంచరిస్తుండం తెలిసిన పర్యావరణ ప్రేమికులు, ఆరోగ్యకర ఆవరణకు స్పష్టమైన సూచికలుగా సంతోషిస్తున్నారు. ఇది నాణేనికి ఓ వైపు. మరోవైపు.. వలస పక్షులకు స్వర్గధామంలాంటి ఈ పక్షి కేంద్రంలోకి అట్టర్‌ల ప్రవేశం, దీని మనుగడకు ప్రమాదకరమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వలస పక్షులపై అట్టర్‌ల దాడి ఇందుకు ఆస్కారమిస్తోంది. ఏటా 20వేల పక్షుల రాక తెనాలి–గుంటూరు వయా నందివెలుగు రహదారి మార్గంలో గల ఉప్పలపాడులోని 8–9 ఎకరాల చెరువులోని చెట్లపై కిక్కిరిసినట్టుండే పక్షి కేంద్రానికి సీజన్ల వారీగా రమారమి 20 వేల పక్షులు వస్తుంటాయి. ఇతర చోట్లకు భిన్నంగా ఇక్కడ ఏడాది పొడవుగా ఇవి ఇక్కడే ఉండటం మరో ప్రత్యేకత. వర్షాకాలం ఆరంభంలో నత్తగొట్టు కొంగలు (ఓపెన్ బిల్డ్ స్టార్క్), తెల్ల కొంకణాలు (వైట్ ఐబీస్) రాకతో సీజను మొదలు.. గూడబాతు (స్పాట్‌బిల్డ్ పెలికాన్), కలికి పిట్ట (డార్టర్), ఎర్రకాళ్ల కొంగ (పెయింటెడ్ స్టార్క్), శాంతి కొంగ (కాటిల్ ఇగ్రెంట్), చిన్న తెల్లకొంగ (లిటిల్ ఇగ్రెంట్), చింత వొక్కు (నైట్ హెరాన్), తట కంకణం (గ్లోజీ ఐబిస్) వంటి పక్షులు సహా 25 రకాలు వస్తుంటాయి. తెల్ల పెలికాన్ పక్షులు, శీతాకాలంలో కొన్ని విదేశీ వలస పక్షులూ వస్తుంటాయి. అటవీశాఖ వీటికోసం కృత్రిమ గూళ్లను కూడా నిర్మించింది. సందర్శకులకూ తగిన ఏర్పాట్లు సైతం చేసింది. అట్టర్లు మాంసాహార క్షీరదాలు పక్షి కేంద్రం చెరువులో స్మూత్ కోటెడ్ అట్టర్ (నీటి కుక్క)ల విహారాన్ని గత జనవరిలో గ్రామస్తులు గమనించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ వీటి కదలికలను రికార్డు చేసింది. అట్టర్ అనేది మాంసాహార క్షీరదం. ప్రపంచంలో 13 జాతుల అట్టర్లు ఉంటే, మనదేశంలో మూడు జాతులున్నాయి. ఉప్పలపాడు చెరువులో కనిపించిన స్మూత్ కోటెడ్ ఆట్టర్ వీటిలో ఒకటి. శరీరం చేపలా మృదువుగా ఉంటుంది. హిమాలయాల దక్షిణ భాగం నుంచి దేశంలోకి విస్తరించినట్టు చెబుతారు. శాస్త్రీయ నామం లూట్రజేల్ పెర్సిపిసిల్లేట్. ఒక మగ అట్టర్, నాలుగైదు ఆడ అట్టర్లు పిల్లలతో సహా కుటుంబంగా జీవిస్తుంటాయి. పెలికాన్‌లను కబళిస్తున్న అట్టర్లు ఇలాంటి అరుదైన అట్టర్లు, జనావాసంలోని ఉప్పలపాడు వంటి పక్షి కేంద్రంలోకి రావటం విశేషమైతే, వీటివల్ల అక్కడ ఆవాసంగా జీవిస్తున్న వలస పక్షుల మనుగడకు ప్రమాదమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొన్నిరకాలు చేపలు, గూళ్లలోంచి జారిన పక్షి పిల్లలు, ఇతర జీవులను ఆహారంగా తీసుకునే అట్టర్లు, పక్షి కేంద్రంలోని భారీ పెలికాన్‌ను కబళిస్తున్న దృశ్యాలను పలువురు సందర్శకులు ప్రత్యక్షంగా చూశారు. అట్టర్‌ల సంచారం జీవవైవిధ్యానికి తోడ్పడేది వాస్తవమే. అయితే.. పక్షులను తినేయటం కొనసాగితే, ప్రశాంతంగా గడుపుతున్న వలస పక్షులు ఎగిరిపోయే ప్రమాదముంది. అలాగే, ఐబీఏ సైట్ (ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా సైట్)గా బోంబే నేచురల్ సొసైటీ గుర్తింపు పొందిన ఈ పక్షి కేంద్రం భవితవ్యంపై నీలినీడలు పరుచుకుంటాయని, దీని మనుగడకే ప్రమాదకరం కాగలదన్న భయాందోళనలను పక్షి ప్రేమికులు వ్యక్తంచేస్తున్నారు. -
పక్షులకు అభయారణ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో పక్షుల అభయారణ్యాన్ని ఏర్పాటుచేయాలనే యోచనలో ఉన్నట్టు పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. విదేశాల నుంచి భారీ సంఖ్యలో వలస పక్షులు రావటంతో పాటు, రాష్ట్రంలో పక్షుల రకాల సంఖ్య కూడా మెరుగ్గా ఉన్న నేపథ్యంలో వలస పక్షులకు కేంద్రంగా ఉన్న మంచి జలాశయమున్న ప్రాం తాన్ని పక్షుల అభయారణ్యంగా మార్చనున్నట్టు వెల్లడించారు. ఇందుకు కావాల్సిన సూచనలు చేయాల్సిందిగా నగరం కేంద్రంగా పనిచేస్తున్న యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీని కోరారు. బుధవారం ఆ సొసైటీ సభ్యులతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వంతో కలసి పనిచేయండి.. ప్రమాదంలో ఉన్న జంతువులను సాహసం చేసి మరీ రక్షించటం, జలాశయాలను శుభ్రపరచటం ప్రధాన వ్యాపకంగా చేసుకుని కొంతమంది యువత యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ పేరుతో చేస్తున్న సేవలను వివరిస్తూ గత నవంబర్ తొలివారంలో ‘మూగ నేస్తాలు’ శీర్షికతో ‘సాక్షి’ మొదటి పేజీలో కథనాన్ని ప్రచురించింది. దీనికి అదే రోజు స్పందించిన మంత్రి కేటీఆర్, ఆ సభ్యుల కృషిని సాక్షి వెలుగులోకి తేవడాన్ని అభినందిస్తూ, ఆ సొసైటీ సభ్యులతో భేటీ కావాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఆయన.. బుధవారం ఆ సొసైటీ ప్రతినిధులను భేటీకి ఆహ్వానించారు. వారితో దాదాపు అరగంట పాటు చర్చించి, వారి సేవలను ప్రస్తుతిస్తూ, వారికి ప్రభుత్వ పరంగా కావాల్సిన ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో కలసి పని చేయాల్సిందిగా స్వాగతించారు. ఈ సందర్భంగా పక్షుల అభయారణ్యం ఏర్పాటు అంశాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో ఏ ప్రాంతం అందుకు అనువుగా ఉంటుందో గుర్తించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న జంతు సంరక్షణ కేంద్రాలను నిర్వహించే విషయంలో కూడా వారి సలహాలు అవసరమన్నారు. రాష్ట్రంలో కుక్కలు, కోతులు, పందుల సమస్య అధికంగా ఉన్నందున, వాటికి సంతాన నిరోధక చర్యలు తీసుకునే విషయంలోనూ ఆ సొసైటీ సహకారాన్ని కోరారు. ప్రమాదంలో ఉన్న జంతువులను రక్షించే విషయంలో కావాల్సిన పరికరాల జాబితా అందిస్తే సమకూర్చనున్నట్టు హామీ ఇచ్చారు. రూ.10 లక్షల ఆర్థిక సాయం.. మూగజీవాలను రక్షించే విషయంలో ప్రతినెలా తమ జేబు నుంచి ఖర్చు చేస్తున్న సొసైటీ సభ్యులను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. వారి సంపాదనలో సింహభాగం ఇందుకే ఖర్చు చేస్తున్న తీరును కొనియాడారు. గొప్ప సేవ చేస్తున్నందుకు తన వంతుగా రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు పేర్కొన్న ఆయన.. వెంటనే అంతమేరకు చెక్కును అందించారు. ప్రభుత్వంతో కలసి మరింత ఉన్నతంగా పనిచేయాలని సూచించారు. మా బాధ్యతను మరింత పెంచింది.. ‘ప్రమాదంలో ఉన్న జంతువులను రక్షించడంతో పాటు చెరువులను శుభ్రపరిచే తమ సేవలను ప్రస్తుతిస్తూ చాలా ఉదారంగా వ్యవహరించిన మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు.. ఆయన సొంత డబ్బు రూ.10 లక్షలు సాయం చేయటమే కాకుండా, జంతువులను రక్షించే విషయంలో కావాల్సిన పరికరాలను ప్రభుత్వ పరంగా సమకూర్చనున్నట్టు వెల్లడించటం చాలా ఆనందంగా ఉంది. ఇది మా బాధ్యతను మరింత పెంచింది. మరింత మందితో సొసైటీని విస్తరించి సేవలను కూడా పెంచుతాం. మంత్రితో పాటు అక్కడే ఉన్న చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా సాయం చేయటానికి ముందుకొచ్చారు. ఆయన త్వరలో కలుస్తానని హామీ ఇచ్చారు. ‘సాక్షి’మా కృషిని వెలుగులోకి తేవటంతో పాటు ప్రముఖంగా ప్రచురించటం వల్లనే కేటీఆర్ స్పందించారు. ఇందుకు ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు. కేటీఆర్ చేసిన సూచనల మేరకు త్వరలో సమగ్ర వివరాలతో నివేదిక రూపొందించి అందిస్తాం. రాష్ట్రంలో పక్షి అభయారణ్యం ఏర్పడితే గొప్ప పరా>్యటక కేంద్రం అవటమే కాకుండా, పక్షులకు ఎంతో మేలు చేసినట్టవుతుంది..’ – ప్రదీప్‌నాయర్, యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ అధ్యక్షుడు -
లాహిరి లాహిరి లాహిరిలో..
పక్షి ప్రేమికుల స్వర్గధామమైన కైకలూరులోని ఆటపాక పక్షుల కేంద్రంలో బోటు షికారు చేస్తూ విదేశీ పక్షుల అందాలను తిలకించడం ఓ మధురానుభూతి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ అవకాశాన్ని పర్యాటకులకు దగ్గరచేస్తూ అటవీశాఖ రేంజర్ జి.శ్రావణ్‌కుమార్ సోమవారం బోటు షికారును ప్రారంభించారు. ఏడాదిన్నర కాలంగా పక్షుల విహార చెరువు నీరు లేక ఎండిపోయింది. ఇటీవల ఎగువన కురిసిన వర్షాలకు నాగరాజు ఏరుకు పూర్తిస్థాయి నీరు రావడంతో గండికొట్టి నీటిని చెరువులోకి మళ్లించారు. ఇప్పుడు చెరువు నిండుకుండను తలపిస్తోంది. దీంతో పెలికాన్ (గూడబాతు), పెయింటెడ్ స్టార్క్స్ (ఎర్రకాళ్ల కొంగ), గ్రేహెరాన్ (నారాయణ పక్షి), బ్లాక్ ఐబీస్ (నల్ల కంకణాల పిట్ట), ఈ గ్రేట్స్ (తెల్లకొంగ), పర్పుల్ మోర్హెన్ (కొండింగాయి), బ్లాక్ వింగేడ్ స్టిల్ట్ (ఎర్ర కాళ్ల ఉలస), కామన్ టీల్ (పరజా) కనువిందు చేస్తున్నాయి. ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ పక్షుల కేంద్రం వద్ద మొత్తం మూడు బోట్లకు గానూ ఒక బోటును అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలో మరో రెండు బోట్లు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. గతంలో ఒక కుటుంబం బోటు షికారుచేస్తే రూ.200 టికెట్ ఉండేదని, ఇప్పుడు రూ.250కు పెంచినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఫారెస్టు రేంజర్ ఈశ్వరరావు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. – ఆటపాక (కైకలూరు) -
జాతీయ పర్యాటక కేంద్రంగా కొల్లేరు!
సీఎం చంద్రబాబు ప్రకటన పక్షుల కేంద్రం పరపతి పెరిగేనా? నష్టపరిహారం కోసం ప్రజల ఎదురుచూపు కైకలూరు : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చిత్తడి నేలల ప్రాంత మైన కొల్లేరు సరస్సును జాతీయ స్థాయిలో గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడలో శనివారం జరిగిన జిల్లా కలెక్టర్ల రెండోరోజు సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఈ ప్రకటన పర్యాటక ప్రేమికులకు హర్షం కలిగిస్తోంది. మరోపక్క కొల్లేరు ప్రజలకు మాత్రం నిరాశనే మిగుల్చుతోంది. ఇటీవల కొల్లేటికోట గ్రామంలో జరిగిన బహిరంగ సభలో కాంటూరు కుదింపు, కొల్లేరు ఆపరేషన్‌లో అదనంగా ధ్వంసం చేసిన 7,500 ఎకరాల భూములు పంపిణీ చేయాలనే ప్రధాన డిమాండ్లను కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని కొల్లేటి ప్రజలు కేంద్ర మంత్రులు జవదేకర్, వెంకయ్యనాయుడుల ముందుంచారు. కాంటూరు కుదింపు కోసం రాష్ట్రం నుంచి తీర్మానం చేసి పంపించినా, కేంద్రం దీనిపై నిర్ణయం ప్రకటించకపోవటం కొల్లేరు ప్రజలను డోలాయమానంలో పడేసింది. పరిహారం లేకుండా పర్యాటకమా? పరిహారం లేకుండా పర్యాటకం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని 77 వేల 131 ఎకరాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. కొల్లేరు ఆపరేషన్ సమమంలో రెండు జిల్లాల్లో కలిపి 31 వేల 125.75 ఎకరాల్లో అక్రమ చెరువులను ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లాలో కైకలూరు మండలంలో 10,175 ఎకరాలు, మండవల్లి మండలంలో 7,274 ఎకరాలు వెరసి 17,449 ఎకరాల్లో చెరువులు ఈ ఆపరేషన్‌లో ధ్వంసమయ్యాయి. గత నెల 12న విజయవాడలో జరిగిన రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు (ఎస్బీడబ్ల్యూఎల్) సమావేశంలో కొల్లేరు అభయారణ్యాన్ని ఐదు నుంచి మూడుకు కుదిస్తే 43 వేల 777 ఎకరాల భూమి మిగులుతుందని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.కె.ఫరీడా లెక్కలు తేల్చారు. కాంటూరు కుదింపు అశం ఇప్పుడే తేలే అవకాశం కనిపించడం లేదు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో జిరాయితీ రైతుల భూములు ధ్వంసమయ్యాయి. ఇరు జిల్లాల్లో జిరాయితీ భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కింద రూ.625 కోట్లు కేటాయించాలని వైఎస్ ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా నష్టపరిహారాన్ని కొల్లేరు రైతులకు అందించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. పక్షుల కేంద్రం దశ తిరిగేనా? రాష్ట్రంలోనే పక్షి ప్రేమికుల స్వర్గధామంగా కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రం వినుతికెక్కింది. అరుదైన విదేశీ పెలికాన్ పక్షులు ఇక్కడ స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇక్కడ 300 ఎకరాల్లో యాత్రికులకు విహార చెరువు ఉంది. కత్తిపూడి - పామర్రు జాతీయ రహదారి సమీపంలో ఈ కేంద్రం ఉండటంతో పర్యాటకుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. వచ్చిన యాత్రికులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఇక్కడ రిసార్టులు, పక్షుల ఆవాసాలకు ఏర్పాట్లు చేస్తే పర్యాటక ఆదాయం పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
14 ఏళ్లుగా 8 గ్రామాలు దీపావళీ పండగకు దూరం!
పక్షులను ప్రేమించే ఎనిమిది గ్రామాలు ఎంతో సంతోషంగా జరుపుకునే దీపావళీ పండగకు దూరంగా ఉంటున్నారు. కేవలం పక్షుల రాక ఆగిపోతుందనే కారణంతో గత పద్నాలుగేళ్లుగా తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఎనిమిది గ్రామాలు దీపావళీ పండగ రోజున టపాసులను కాల్చకపోవడం గమనార్హం. ఈరోడ్ కు 15 కిలోమీటర్ల దూరంలోని వెల్లోడ్ పక్షలు సంరక్షణ కేంద్రానికి సమీపంలోని ఎనిమిది గ్రామాల్లోని సుమారు 750 గ్రామాల కుటుంబాలు దీపావళీ పండగకు దూరంగా ఉంటున్నాయి. అక్టోబర్-జనవరి మాసంలో వేలాది పక్షులు తమ గ్రామాలను సందర్శిస్తాయని మనిక్కం అనే స్థానికుడు వెల్లడించారు. దీపావళి సమయంలో టపాసులు కాల్చడం వలన పక్షులు బెదిరిపోతాయనే కారణంగా గత 14 ఏళ్లలో ఎనిమిది గ్రామాల్లో బాణసంచా, టపాసులు కాల్చడం లేదు అని తెలిపారు. అంతేకాకుండా మిగితా పండగ రోజుల్లో కూడా ప్రజలు బాణసంచా కాల్చడానికి దూరంగా ఉంటారని స్థానికులు తెలిపారు. దీపావళి పండగ రోజున కొత్త దుస్తులు ధరించి.. సంరక్షణ కేంద్రానికి వెళ్లి పక్షులకు, చేపలకు ధాన్యం వేస్తామని తెలిపారు. దీపావళి సందర్భంగా శనివారం రోజున సుమారు 2 వేల మంది సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు.