‘యానిమల్స్ వారియర్స్’ అధ్యక్షుడికి రూ. 10 లక్షల చెక్కును అందజేస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో పక్షుల అభయారణ్యాన్ని ఏర్పాటుచేయాలనే యోచనలో ఉన్నట్టు పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. విదేశాల నుంచి భారీ సంఖ్యలో వలస పక్షులు రావటంతో పాటు, రాష్ట్రంలో పక్షుల రకాల సంఖ్య కూడా మెరుగ్గా ఉన్న నేపథ్యంలో వలస పక్షులకు కేంద్రంగా ఉన్న మంచి జలాశయమున్న ప్రాం తాన్ని పక్షుల అభయారణ్యంగా మార్చనున్నట్టు వెల్లడించారు. ఇందుకు కావాల్సిన సూచనలు చేయాల్సిందిగా నగరం కేంద్రంగా పనిచేస్తున్న యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీని కోరారు. బుధవారం ఆ సొసైటీ సభ్యులతో మంత్రి సమావేశమయ్యారు.
ప్రభుత్వంతో కలసి పనిచేయండి..
ప్రమాదంలో ఉన్న జంతువులను సాహసం చేసి మరీ రక్షించటం, జలాశయాలను శుభ్రపరచటం ప్రధాన వ్యాపకంగా చేసుకుని కొంతమంది యువత యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ పేరుతో చేస్తున్న సేవలను వివరిస్తూ గత నవంబర్ తొలివారంలో ‘మూగ నేస్తాలు’ శీర్షికతో ‘సాక్షి’ మొదటి పేజీలో కథనాన్ని ప్రచురించింది. దీనికి అదే రోజు స్పందించిన మంత్రి కేటీఆర్, ఆ సభ్యుల కృషిని సాక్షి వెలుగులోకి తేవడాన్ని అభినందిస్తూ, ఆ సొసైటీ సభ్యులతో భేటీ కావాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఆయన.. బుధవారం ఆ సొసైటీ ప్రతినిధులను భేటీకి ఆహ్వానించారు. వారితో దాదాపు అరగంట పాటు చర్చించి, వారి సేవలను ప్రస్తుతిస్తూ, వారికి ప్రభుత్వ పరంగా కావాల్సిన ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వంతో కలసి పని చేయాల్సిందిగా స్వాగతించారు. ఈ సందర్భంగా పక్షుల అభయారణ్యం ఏర్పాటు అంశాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో ఏ ప్రాంతం అందుకు అనువుగా ఉంటుందో గుర్తించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న జంతు సంరక్షణ కేంద్రాలను నిర్వహించే విషయంలో కూడా వారి సలహాలు అవసరమన్నారు. రాష్ట్రంలో కుక్కలు, కోతులు, పందుల సమస్య అధికంగా ఉన్నందున, వాటికి సంతాన నిరోధక చర్యలు తీసుకునే విషయంలోనూ ఆ సొసైటీ సహకారాన్ని కోరారు. ప్రమాదంలో ఉన్న జంతువులను రక్షించే విషయంలో కావాల్సిన పరికరాల జాబితా అందిస్తే సమకూర్చనున్నట్టు హామీ ఇచ్చారు.
రూ.10 లక్షల ఆర్థిక సాయం..
మూగజీవాలను రక్షించే విషయంలో ప్రతినెలా తమ జేబు నుంచి ఖర్చు చేస్తున్న సొసైటీ సభ్యులను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. వారి సంపాదనలో సింహభాగం ఇందుకే ఖర్చు చేస్తున్న తీరును కొనియాడారు. గొప్ప సేవ చేస్తున్నందుకు తన వంతుగా రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు పేర్కొన్న ఆయన.. వెంటనే అంతమేరకు చెక్కును అందించారు. ప్రభుత్వంతో కలసి మరింత ఉన్నతంగా పనిచేయాలని సూచించారు.
మా బాధ్యతను మరింత పెంచింది..
‘ప్రమాదంలో ఉన్న జంతువులను రక్షించడంతో పాటు చెరువులను శుభ్రపరిచే తమ సేవలను ప్రస్తుతిస్తూ చాలా ఉదారంగా వ్యవహరించిన మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు.. ఆయన సొంత డబ్బు రూ.10 లక్షలు సాయం చేయటమే కాకుండా, జంతువులను రక్షించే విషయంలో కావాల్సిన పరికరాలను ప్రభుత్వ పరంగా సమకూర్చనున్నట్టు వెల్లడించటం చాలా ఆనందంగా ఉంది. ఇది మా బాధ్యతను మరింత పెంచింది. మరింత మందితో సొసైటీని విస్తరించి సేవలను కూడా పెంచుతాం. మంత్రితో పాటు అక్కడే ఉన్న చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా సాయం చేయటానికి ముందుకొచ్చారు. ఆయన త్వరలో కలుస్తానని హామీ ఇచ్చారు. ‘సాక్షి’మా కృషిని వెలుగులోకి తేవటంతో పాటు ప్రముఖంగా ప్రచురించటం వల్లనే కేటీఆర్ స్పందించారు. ఇందుకు ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు. కేటీఆర్ చేసిన సూచనల మేరకు త్వరలో సమగ్ర వివరాలతో నివేదిక రూపొందించి అందిస్తాం. రాష్ట్రంలో పక్షి అభయారణ్యం ఏర్పడితే గొప్ప పరా>్యటక కేంద్రం అవటమే కాకుండా, పక్షులకు ఎంతో మేలు చేసినట్టవుతుంది..’ – ప్రదీప్‌నాయర్, యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment