ఉప్పలపాడు పక్షి కేంద్రం వేలాది వలస పక్షులకు స్వర్గధామం. మూడు దశాబ్దాలుగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆవాసానికి ఇప్పుడు అట్టర్‌ల (నీటికుక్కలు) రూపంలో పెద్ద చిక్కొచ్చి పడింది. మాంసాహార క్షీరదాలైన ఈ అట్టర్‌లు వలస పక్షులను కబళిస్తున్నాయి. ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా సైట్‌గా బోంబే నేచురల్ సొసైటీ గుర్తింపు పొందిన ఈ పక్షి కేంద్రం భవితవ్యంపై ఇప్పుడు నీలినీడలు అలుముకున్నాయి. అట్టర్‌లు.. వాటి కథాకమామీషు ఏంటంటే..
తెనాలి : సహజసిద్ధంగా ఏర్పడే పక్షుల ఆవాసాలకు భిన్నమైంది గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు పక్షి కేంద్రం. మాగాణి భూముల్లోని చెరువులో పక్షి ప్రేమికుల ప్రోత్సాహం, గ్రామస్తుల సహకారం, ప్రభుత్వ తోడ్పాటుతో మూడు దశాబ్దాలుగా ప్రత్యేకత సంతరించుకున్న ఈ పక్షి కేంద్రం.. ఇటీవల అరుదైన క్షీరద జాతికి ఆవాసమైంది. ఐక్యరాజ్య సమితి తరఫున ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్ (ఐయూసీఎన్) సంస్థ రెడ్‌లిస్ట్‌లో చేర్చిన ఈ అట్టర్‌లు ఇక్కడ విహరిస్తున్నాయి.
స్థానికులు నీటికుక్కలుగా పిలుచుకుంటున్న ఈ ఆట్టర్‌లు పక్షి కేంద్రం చెరువులో స్వేచ్ఛగా సంచరిస్తుండం తెలిసిన పర్యావరణ ప్రేమికులు, ఆరోగ్యకర ఆవరణకు స్పష్టమైన సూచికలుగా సంతోషిస్తున్నారు. ఇది నాణేనికి ఓ వైపు. మరోవైపు.. వలస పక్షులకు స్వర్గధామంలాంటి ఈ పక్షి కేంద్రంలోకి అట్టర్‌ల ప్రవేశం, దీని మనుగడకు ప్రమాదకరమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వలస పక్షులపై అట్టర్‌ల దాడి ఇందుకు ఆస్కారమిస్తోంది.
ఏటా 20వేల పక్షుల రాక
తెనాలి–గుంటూరు వయా నందివెలుగు రహదారి మార్గంలో గల ఉప్పలపాడులోని 8–9 ఎకరాల చెరువులోని చెట్లపై కిక్కిరిసినట్టుండే పక్షి కేంద్రానికి సీజన్ల వారీగా రమారమి 20 వేల పక్షులు వస్తుంటాయి. ఇతర చోట్లకు భిన్నంగా ఇక్కడ ఏడాది పొడవుగా ఇవి ఇక్కడే ఉండటం మరో ప్రత్యేకత. వర్షాకాలం ఆరంభంలో నత్తగొట్టు కొంగలు (ఓపెన్ బిల్డ్ స్టార్క్), తెల్ల కొంకణాలు (వైట్ ఐబీస్) రాకతో సీజను మొదలు.. గూడబాతు (స్పాట్‌బిల్డ్ పెలికాన్), కలికి పిట్ట (డార్టర్), ఎర్రకాళ్ల కొంగ (పెయింటెడ్ స్టార్క్), శాంతి కొంగ (కాటిల్ ఇగ్రెంట్), చిన్న తెల్లకొంగ (లిటిల్ ఇగ్రెంట్), చింత వొక్కు (నైట్ హెరాన్), తట కంకణం (గ్లోజీ ఐబిస్) వంటి పక్షులు సహా 25 రకాలు వస్తుంటాయి. తెల్ల పెలికాన్ పక్షులు, శీతాకాలంలో కొన్ని విదేశీ వలస పక్షులూ వస్తుంటాయి. అటవీశాఖ వీటికోసం కృత్రిమ గూళ్లను కూడా నిర్మించింది. సందర్శకులకూ తగిన ఏర్పాట్లు సైతం చేసింది.
అట్టర్‌లు మాంసాహార క్షీరదాలు
పక్షి కేంద్రం చెరువులో స్మూత్ కోటెడ్ అట్టర్ (నీటి కుక్క)ల విహారాన్ని గత జనవరిలో గ్రామస్తులు గమనించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ వీటి కదలికలను రికార్డు చేసింది. అట్టర్ అనేది మాంసాహార క్షీరదం. ప్రపంచంలో 13 జాతుల అట్టర్లు ఉంటే, మనదేశంలో మూడు జాతులున్నాయి. ఉప్పలపాడు చెరువులో కనిపించిన స్మూత్ కోటెడ్ ఆట్టర్ వీటిలో ఒకటి. శరీరం చేపలా మృదువుగా ఉంటుంది. హిమాలయాల దక్షిణ భాగం నుంచి దేశంలోకి విస్తరించినట్టు చెబుతారు. శాస్త్రీయ నామం లూట్రజేల్ పెర్సిపిసిల్లేట్. ఒక మగ అట్టర్, నాలుగైదు ఆడ అట్టర్‌లు పిల్లలతో సహా కుటుంబంగా జీవిస్తుంటాయి.
పెలికాన్‌లను కబళిస్తున్న అట్టర్‌లు
ఇలాంటి అరుదైన అట్టర్‌లు, జనావాసంలోని ఉప్పలపాడు వంటి పక్షి కేంద్రంలోకి రావటం విశేషమైతే, వీటివల్ల అక్కడ ఆవాసంగా జీవిస్తున్న వలస పక్షుల మనుగడకు ప్రమాదమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొన్నిరకాలు చేపలు, గూళ్లలోంచి జారిన పక్షి పిల్లలు, ఇతర జీవులను ఆహారంగా తీసుకునే అట్టర్‌లు, పక్షి కేంద్రంలోని భారీ పెలికాన్‌ను కబళిస్తున్న దృశ్యాలను పలువురు సందర్శకులు ప్రత్యక్షంగా చూశారు. అట్టర్‌ల సంచారం జీవవైవిధ్యానికి తోడ్పడేది వాస్తవమే. అయితే.. పక్షులను తినేయటం కొనసాగితే, ప్రశాంతంగా గడుపుతున్న వలస పక్షులు ఎగిరిపోయే ప్రమాదముంది. అలాగే, ఐబీఏ సైట్ (ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా సైట్)గా బోంబే నేచురల్ సొసైటీ గుర్తింపు పొందిన ఈ పక్షి కేంద్రం భవితవ్యంపై నీలినీడలు పరుచుకుంటాయని, దీని మనుగడకే ప్రమాదకరం కాగలదన్న భయాందోళనలను పక్షి ప్రేమికులు వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment