otter
-
వైరల్ వీడియో: పూల్ క్లీనర్‌కు సహాయం చేస్తున్న చిన్న సముద్రపు ఒట్టర్
-
కెమెరాలకు చిక్కిన అరుదైన ఏటి కుక్కలు.. ఎప్పుడైనా చూశారా?
సాక్షి, విశాఖపట్నం: ఏటి కుక్కలను ఎప్పుడైనా చూశారా? వాటి పేరైనా విన్నారా? ఏ కొద్దిమందికో తప్ప వీటి గురించి అసలు తెలియనే తెలియదు. ఎందుకంటే ఇవి అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయి. అలాంటి అత్యంత అరుదైన ఏటి కుక్కలు మన ఉమ్మడి విశాఖ జిల్లా (ప్రస్తుత అనకాపల్లి జిల్లా)లోని అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవలో ఉన్నట్టు వెలుగులోకి వచ్చాయి. అక్కడే అవి ఆవాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కృష్ణా రివర్ బేసిన్‌లోను, తూర్పు గోదావరి జిల్లా కోరింగ మడ అడవుల ప్రాంతంలోనూ ఇవి ఉనికిలో ఉన్నాయి. తాజాగా కొండకర్ల ఆవలోనూ ఇవి మనుగడలో ఉన్నట్టు ఈస్ట్ కోస్ట్ కన్జర్వేషన్ టీమ్ (ఈసీసీటీ), గ్రీన్ పా సంస్థలు గుర్తించాయి. చదవండి: ఇద్దరి పిల్లల తల్లి.. ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. చివరకు.. కెమెరాతో బంధించి.. ఏటి కుక్కలు పగటి పూట మనుషులకు కనిపించే పరిస్థితి లేకపోవడంతో కొండకర్ల ఆవలో వాటి జాడ తెలుసుకోవడానికి మూడు చోట్ల ఈసీసీటీ సభ్యులు ప్రత్యేక డిజిటల్ కెమెరాలను అమర్చారు. కొన్ని రోజులకు అవి ఈ కెమెరాలకు చిక్కాయి. దీంతో వాటిని అంతరించిపోతున్న ఏటి కుక్కలు (స్మూత్ కోటెడ్ ఆటర్స్)గా నిర్ధారణకు వచ్చారు. ఇందుకోసం నలుగురు ఈసీసీటీ, గ్రీన్ పా సభ్యులు దాదాపు నాలుగు నెలల పాటు అధ్యయనం చేశారు. ఇక్కడ అరుదైన ఏటి కుక్కల జాడ గురించి ఇటీవల ఐయూసీఎన్/ఎస్ఎస్సీ ఆటర్ స్పెషలిస్టు గ్రూప్ బులెటిన్ (జర్నల్)లోనూ ప్రచురించారు. ఏమిటీ ఏటి కుక్కలు? ఏటి కుక్కలు ముంగిసను పోలిన ఆకారంలో వాటికంటే పెద్దగా, ఊరకుక్కలకంటే చిన్నవిగా ఉంటాయి. నీటిలోనే ఎక్కువగా మనుగడ సాగిస్తాయి. ఈదుకుంటూ తిరుగుతుంటాయి. నదులు, సరస్సులుండే ప్రాంతాల్లో ఇవి నివశిస్తాయి. 37–43 సెం.మీల తోక, 59–64 సెం.మీల పొడవుతో, 7–11 కిలోల బరువును కలిగి ఉంటాయి. పగటి పూట మనుషులకు కనిపించకుండా మడ అడవులు, జమ్ము గడ్డి వంటి దట్టంగా ఉండే ప్రాంతాల్లోను, గట్లకు చిన్నపాటి గోతులు చేసుకుని వాటిలో ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. రాత్రి వేళ నదులు/సరస్సుల్లోని చేపలను ఎక్కువగా తింటాయి. అప్పుడప్పుడు పాములు, పక్షులను కూడా ఆహారంగా చేసుకుంటాయి. సంతతి పెరుగుతోంది.. కొండకర్ల ఆవలో ఏటి కుక్కల జాడ వెలుగు చూడడం ఒక విశేషమైతే వాటి సంతతి పెరుగుతుండడం మరో విశేషం. ఇక్కడ ఆరేడేళ్ల క్రితంకంటే ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయని ఆవలో చేపలవేట సాగించే మత్స్యకారులు చెబుతున్నారు. అయితే ఇవి మనుషులకు ఎలాంటి హాని చేయనందువల్ల వీటిని చూసి వీరు భయపడం లేదు. కానీ వలలో పడిన చేపలను తినడానికి వలలను పాడు చేస్తుండడంతో వీరికి నష్టాన్ని చేకూరుస్తున్నాయి. అవి అరుదైన ఏటి కుక్కలే.. కొండకర్ల ఆవలో వెలుగులోకి వచ్చిన ఏటి కుక్కలు అంతరించి పోతున్న జాతులకు చెందినవే. ఇవి ఇప్పటివరకు రాష్ట్రంలో కోరింగ మడ అడవులు, కృష్ణా రివర్ బేసిన్ తదితర ప్రాంతాల్లోనూ ఉంటున్నట్టు గుర్తించారు. ఏటి కుక్కలు ఈ ఆవలో మనుగడ సాగించడానికి అనువైన ప్రాంతం. మనుషుల నుంచి వీటికి హాని జరగకుండా సంరక్షించాల్సిన అవసరం ఉంది. – అనంత శంకర్, డీఎఫ్ఓ, విశాఖపట్నం -
నాణేనికి మరోవైపు.. ‘అట్టర్’లతో అసలుకే ఎసరు!
ఉప్పలపాడు పక్షి కేంద్రం వేలాది వలస పక్షులకు స్వర్గధామం. మూడు దశాబ్దాలుగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆవాసానికి ఇప్పుడు అట్టర్‌ల (నీటికుక్కలు) రూపంలో పెద్ద చిక్కొచ్చి పడింది. మాంసాహార క్షీరదాలైన ఈ అట్టర్లు వలస పక్షులను కబళిస్తున్నాయి. ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా సైట్‌గా బోంబే నేచురల్ సొసైటీ గుర్తింపు పొందిన ఈ పక్షి కేంద్రం భవితవ్యంపై ఇప్పుడు నీలినీడలు అలుముకున్నాయి. అట్టర్లు.. వాటి కథాకమామీషు ఏంటంటే.. తెనాలి : సహజసిద్ధంగా ఏర్పడే పక్షుల ఆవాసాలకు భిన్నమైంది గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు పక్షి కేంద్రం. మాగాణి భూముల్లోని చెరువులో పక్షి ప్రేమికుల ప్రోత్సాహం, గ్రామస్తుల సహకారం, ప్రభుత్వ తోడ్పాటుతో మూడు దశాబ్దాలుగా ప్రత్యేకత సంతరించుకున్న ఈ పక్షి కేంద్రం.. ఇటీవల అరుదైన క్షీరద జాతికి ఆవాసమైంది. ఐక్యరాజ్య సమితి తరఫున ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్ (ఐయూసీఎన్) సంస్థ రెడ్‌లిస్ట్‌లో చేర్చిన ఈ అట్టర్లు ఇక్కడ విహరిస్తున్నాయి. స్థానికులు నీటికుక్కలుగా పిలుచుకుంటున్న ఈ ఆట్టర్‌లు పక్షి కేంద్రం చెరువులో స్వేచ్ఛగా సంచరిస్తుండం తెలిసిన పర్యావరణ ప్రేమికులు, ఆరోగ్యకర ఆవరణకు స్పష్టమైన సూచికలుగా సంతోషిస్తున్నారు. ఇది నాణేనికి ఓ వైపు. మరోవైపు.. వలస పక్షులకు స్వర్గధామంలాంటి ఈ పక్షి కేంద్రంలోకి అట్టర్‌ల ప్రవేశం, దీని మనుగడకు ప్రమాదకరమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వలస పక్షులపై అట్టర్‌ల దాడి ఇందుకు ఆస్కారమిస్తోంది. ఏటా 20వేల పక్షుల రాక తెనాలి–గుంటూరు వయా నందివెలుగు రహదారి మార్గంలో గల ఉప్పలపాడులోని 8–9 ఎకరాల చెరువులోని చెట్లపై కిక్కిరిసినట్టుండే పక్షి కేంద్రానికి సీజన్ల వారీగా రమారమి 20 వేల పక్షులు వస్తుంటాయి. ఇతర చోట్లకు భిన్నంగా ఇక్కడ ఏడాది పొడవుగా ఇవి ఇక్కడే ఉండటం మరో ప్రత్యేకత. వర్షాకాలం ఆరంభంలో నత్తగొట్టు కొంగలు (ఓపెన్ బిల్డ్ స్టార్క్), తెల్ల కొంకణాలు (వైట్ ఐబీస్) రాకతో సీజను మొదలు.. గూడబాతు (స్పాట్‌బిల్డ్ పెలికాన్), కలికి పిట్ట (డార్టర్), ఎర్రకాళ్ల కొంగ (పెయింటెడ్ స్టార్క్), శాంతి కొంగ (కాటిల్ ఇగ్రెంట్), చిన్న తెల్లకొంగ (లిటిల్ ఇగ్రెంట్), చింత వొక్కు (నైట్ హెరాన్), తట కంకణం (గ్లోజీ ఐబిస్) వంటి పక్షులు సహా 25 రకాలు వస్తుంటాయి. తెల్ల పెలికాన్ పక్షులు, శీతాకాలంలో కొన్ని విదేశీ వలస పక్షులూ వస్తుంటాయి. అటవీశాఖ వీటికోసం కృత్రిమ గూళ్లను కూడా నిర్మించింది. సందర్శకులకూ తగిన ఏర్పాట్లు సైతం చేసింది. అట్టర్లు మాంసాహార క్షీరదాలు పక్షి కేంద్రం చెరువులో స్మూత్ కోటెడ్ అట్టర్ (నీటి కుక్క)ల విహారాన్ని గత జనవరిలో గ్రామస్తులు గమనించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ వీటి కదలికలను రికార్డు చేసింది. అట్టర్ అనేది మాంసాహార క్షీరదం. ప్రపంచంలో 13 జాతుల అట్టర్లు ఉంటే, మనదేశంలో మూడు జాతులున్నాయి. ఉప్పలపాడు చెరువులో కనిపించిన స్మూత్ కోటెడ్ ఆట్టర్ వీటిలో ఒకటి. శరీరం చేపలా మృదువుగా ఉంటుంది. హిమాలయాల దక్షిణ భాగం నుంచి దేశంలోకి విస్తరించినట్టు చెబుతారు. శాస్త్రీయ నామం లూట్రజేల్ పెర్సిపిసిల్లేట్. ఒక మగ అట్టర్, నాలుగైదు ఆడ అట్టర్లు పిల్లలతో సహా కుటుంబంగా జీవిస్తుంటాయి. పెలికాన్‌లను కబళిస్తున్న అట్టర్లు ఇలాంటి అరుదైన అట్టర్లు, జనావాసంలోని ఉప్పలపాడు వంటి పక్షి కేంద్రంలోకి రావటం విశేషమైతే, వీటివల్ల అక్కడ ఆవాసంగా జీవిస్తున్న వలస పక్షుల మనుగడకు ప్రమాదమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొన్నిరకాలు చేపలు, గూళ్లలోంచి జారిన పక్షి పిల్లలు, ఇతర జీవులను ఆహారంగా తీసుకునే అట్టర్లు, పక్షి కేంద్రంలోని భారీ పెలికాన్‌ను కబళిస్తున్న దృశ్యాలను పలువురు సందర్శకులు ప్రత్యక్షంగా చూశారు. అట్టర్‌ల సంచారం జీవవైవిధ్యానికి తోడ్పడేది వాస్తవమే. అయితే.. పక్షులను తినేయటం కొనసాగితే, ప్రశాంతంగా గడుపుతున్న వలస పక్షులు ఎగిరిపోయే ప్రమాదముంది. అలాగే, ఐబీఏ సైట్ (ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా సైట్)గా బోంబే నేచురల్ సొసైటీ గుర్తింపు పొందిన ఈ పక్షి కేంద్రం భవితవ్యంపై నీలినీడలు పరుచుకుంటాయని, దీని మనుగడకే ప్రమాదకరం కాగలదన్న భయాందోళనలను పక్షి ప్రేమికులు వ్యక్తంచేస్తున్నారు. -
పక్షి ప్రేమికుల ప్రోత్సాహం, నీటి కుక్కల విహారం
తెనాలి: సహజ సిద్ధంగా ఏర్పడే పక్షుల ఆవాసాలకు భిన్నమైనది ఉప్పలపాడు పక్షి కేంద్రం. ఇది ఇప్పుడో అరుదైన క్షీరద జాతికి ఆవాసమైంది. గుంటూరు జిల్లాలోని తెనాలి–గుంటూరు వయా నందివెలుగు రహదారి మార్గంలోని ఈ పక్షి కేంద్రంలో ఆట్టర్ (నీటి కుక్క)లు ఇప్పుడు విహరిస్తున్నాయి. పక్షి ప్రేమికుల ప్రోత్సాహం, గ్రామస్తుల సహకారం, ప్రభుత్వ తోడ్పాటుతో ఇక్కడి చెరువులో మూడు దశాబ్దాలుగా అభివృద్ధి చెందిన పక్షి కేంద్రమిది. ఇందులో నల్లతుమ్మ, ఇంగ్లిష్ తుమ్మ చెట్లు అరుదైన పక్షులకు ఆవాసం. కిక్కిరిసినట్టుండే ఈ పక్షి కేంద్రానికి సీజన్ల వారీగా 15–20 వేల పక్షులు వస్తుంటాయి. ఇతర చోట్లకు భిన్నంగా ఇక్కడ ఏడాది పొడవునా ఇవి కొనసాగుతుండటం మరో ప్రత్యేకత. వర్షాకాలం ఆరంభంలో నత్తగొట్టు కొంగలు (ఓపెన్ బిల్డ్ స్టార్క్), తెల్ల కొంకణాలు (వైట్ ఐబీస్) రాకతో సీజను మొదలు, గూడబాతు (స్పాట్ బిల్డ్ పెలికాన్), కలికి పిట్ట (డార్టర్), ఎర్రకాళ్ల కొంగ (పెయింటెడ్ స్టార్క్), శాంతి కొంగ (కాటిల్ ఇగ్రెంట్), చిన్న తెల్లకొంగ (లిటిల్ ఇగ్రెంట్), చింత వొక్కు (నైట్ హెరాన్), తట కంకణం (గ్లోజీ ఐబిస్) వంటి పక్షులు సహా 25 రకాలు వస్తుంటాయి. తెల్ల పెలికాన్ పక్షులు, శీతాకాలంలో కొన్ని విదేశీ వలస పక్షులూ వస్తుంటాయి. అటవీ శాఖ వీటికోసం కృత్రిమ గూళ్లను నిరి్మంచింది. సందర్శకులకూ తగిన ఏర్పాట్లుచేసింది. ఈ పక్షి కేంద్రాన్ని ఐబీఏ సైట్ (ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా సైట్)గా బాంబే నేచురల్ సొసైటీ గుర్తించింది. కాగా, ఈ ఆట్టర్ల విహారం తమ దృష్టికి రావడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీటిని రికార్డు చేసినట్లు జిల్లా అటవీ అధికారి శివప్రసాద్ ‘సాక్షి’తో చెప్పారు. దేశంలో మూడు జాతులు ఆట్టర్ అనేది మాంసాహార క్షీరదం. ప్రపంచంలో 13 జాతుల ఆట్టర్‌లు ఉంటే, మనదేశంలో మూడు జాతులున్నాయి. ఉప్పలపాడు చెరువులో కనిపించిన స్మూత్ కోటెడ్ ఆట్టర్ వీటిలో ఒకటి. శరీరం మృదువుగా ఉంటుంది. హిమాలయాల దక్షిణ భాగం నుంచి దేశంలోకి విస్తరించినట్లు చెబుతారు. దీని శాస్త్రీయ నామం లూట్రజేల్ పెర్సిపిసిల్లేట్. ఒక మగ ఆట్టర్, నాలుగైదు ఆడ ఆట్టర్‌లు, వాటి పిల్లలతో సహా కుటుంబంగా జీవిస్తుంటాయి. పొలుసు చేపల (చేపల్ని తినే చేపలు)ను ఇవి ఎక్కువగా తింటాయి. పక్షి గూళ్లలోంచి పడిపోయిన పిల్ల పక్షులు, మరికొన్ని జీవులు వీటి ఆహారం. ఆట్టర్‌లు చెరువును ప్రక్షాళన చేస్తాయని వైల్డ్‌లైఫ్, జీవవైవిధ్య పరిశోధనలో పలు జాతీయ అవార్డులు అందుకున్న డాక్టర్ తులసీరావ్ చెప్పారు. అటవీ భూములు తగ్గిపోవటం, కాలుష్యం, వేటగాళ్ల కారణంగా అంతరించిపోతున్న జంతు జాతుల్లో ఆట్టర్ కూడా ఒకటి. ఐక్యరాజ్య సమితి తరఫున ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ (ఐయూసీఎన్) సంస్థ ప్రకటించిన రెడ్‌లిస్ట్‌లో దీనిని చేర్చారు. -
ఓ మంచి దేవుడా.. తినడానికి నాకో చేపనివ్వు!
దేవుడా.. ఓ మంచి దేవుడా.. నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు. బంగాళాదుంప ఫ్రై ఇచ్చావు. చారు కూడా ఇచ్చావు... ఇలాగే ప్రపంచంలోని వారందరికీ ఇవ్వాలంటూ ఓ సినిమాలో హీరో వేడుకుంటాడు. ఆ హీరోకి ఏం తీసిపోను అంటోంది ఈ నీరుపిల్లి (ఆట్టర్). హాలెండ్ ఎమ్మెన్లోని వైల్డ్ ల్యాండ్ అడ్వెంచర్ పార్కులో ఇది నివసిస్తుంది. దీనికి రోజుకు ఐదు చేపలు కావాల్సిందే. కేవలం చేపలు తిని బతికే ఈ నీరుపిల్లి.. కడుపులో ఎలుకలు పరిగెత్తినట్టు కాగానే.. ఇదిగో ఇలా అచ్చం మనిషిలాగే రెండు చేతులు జోడించి.. అర్థిస్తుంది. దాని ఆకలి గుర్తించిన పార్కు సిబ్బంది వెంటనే దానికి చేపల్ని ఆహారంగా అందిస్తారు. ఆ చేపల్ని కడుపు రాసుకుంటూ బుద్ధిగా ఆరగించిన తర్వాత.. ఇదిగో ఇలా చెయ్యి ఊపి థాంక్స్ కూడా చెప్తుంది. ఆహారం కోసం ఈ నీరుపిల్లి చేసే చేష్టలు.. అచ్చం మనిషి ప్రార్థనలాగే ఉండటంతో ఓ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించారు. ఆ ఫొటోలు ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి.