పురస్కారం
మొదట్లో సుధాచంద్రన్‌కు పక్షులతో కాస్తో కూస్తో పరిచయం కూడా లేదు. అదృష్ట పల్లకి ఆమెను కేరళలోని తట్టెక్కాడ్ అభయారణ్యం వరకు తీసుకెళ్లింది. అది పక్షుల విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయంలో ఎన్నో పక్షులకు సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుంది. పక్షి ప్రేమికురాలుగా మారింది. ‘ఫారెస్ట్ గైడ్’గా పర్యావరణ పరిరక్షణకు తనవంతు కృషి చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం సామాన్య ప్రజలు చేస్తున్న కృషికి ఇచ్చే ‘పీవి థంపీ మెమోరియల్’ అవార్డ్ అందుకుంది...
అద్భుతమై సంగీతాన్ని వినడానికి సుధాచంద్రన్ ఏ సంగీత కచేరికి వెళ్లదు. ప్రతిరోజు ఉదయాన పక్షుల కిలకిలారావాలు వింటుంది. అందులో ఆమోఘమైన రాగాలెన్నో వింటుంది. ముఖ్యంగా రాకెట్–బెయిల్డ్ డ్రోంగ్ మేలుకొలుపు జింగిల్స్ వినడం అంటే సుధకు ఎంతో ఇష్టం.
మూడు దశాబ్దాలకు పైగా తట్టెక్కాడ్ పక్షుల అభయారణ్యంతో అనుబంధం ఉన్న సుధ 300కి పైగా పక్షి జాతులను గుర్తించగలదు. వాటి పిలుపులు, బ్రీడింగ్ సీజన్, ఫీడింగ్ సీజన్, అలవాట్లు మరియు ఆవాసాలు, వలసలపై ఆమెకు పూర్తి అవగాహన ఉంది. ‘ఈ అడవి నా కుటుంబం లాంటిది’ అంటున్న సుధ నవ వధువుగా 1971 లో తట్టెక్కాడులోకి అడుగు పెట్టింది.
‘ఆ కాలంలో ఇది దట్టమైన అడవి. ఇందులోకి అడుగు పెట్టినప్పుడు మొదట భయం వేసింది. అడవి నుంచి వచ్చే శబ్దాలు నన్ను భయపెట్టేవి’ అంటుంది సుధ. ఆమె భర్తకు తట్టెక్కాడ్‌లో టీ షాప్ ఉండేది. భర్త అకాల మరణం తరువాత సుధ అనేక సవాళ్లను, కష్టాలనూ ఎదుర్కొంటూనే ఇద్దరు పిల్లల్ని చదివించింది, ఒకవైపు టీ దుకాణం నడుపుతూనే డ్రైవింగ్, పడవ నడపడం నేర్చుకుంది. ఫొటోగ్రాఫీలో మెలకువలు తెలుసుకుంది.
సుధ టీ షాప్‌కు పక్షుల ప్రేమికులు, పక్షి శాస్త్రవేత్తలు వచ్చేవాళ్లు. వారితో సంభాషించడం వల్ల తనకు కూడా పక్షుల ప్రపంచంపై ఆసక్తి మొదలైంది. ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ శిష్యుడు ఆర్.సుగతన్ నిర్వహించే సమావేశాలకు హాజరయ్యేది. ‘నేను క్లాసు బయట నిల్చోవడం చూసి సుగతన్ సర్ లోపలికి వచ్చి క్లాసు వినాల్సిందిగా కోరేవారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది సుధ.
పక్షి ప్రేమికులు, పక్షి శాస్త్రవేత్తలతో కలిసి అడవిలో పక్షులను చూడడానికి వెళ్లేది. ‘నేను ఎంతోమంది వ్యక్తుల నుంచి ఎన్నో నేర్చుకున్నాను. నేర్చుకుంటున్నాను. నాకు తెలిసిన విషయాలను ఇతరులకు చెబుతుంటాను’ అంటుంది సుధ.
ఇంగ్లీష్ బాగా మాట్లాడడం నేర్చుకున్న సుధ ఎన్నో భారతీయ భాషలను అర్థం చేసుకోగలదు.
ఇష్టమైన పక్షులను చూడడంలో అదృష్టం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నమ్ముతుంది సుధ.
‘ఒకసారి ఈ అభయారణ్యానికి వచ్చిన ఒక పక్షి శాస్త్రవేత్త మలబార్ ట్రోగాన్‌ను చూడాలనుకున్నారు. అయితే ఆయన ఆ పక్షిని గుర్తించలేకపోయాడు. నిరాశతో ఆయన వెనక్కి వెళ్లిపోదామనుకుంటున్నప్పుడు నేను ఆ పక్షిని చూపిస్తాను అని చె΄్పాను. అదృష్టవశాత్తు ఆ పక్షి మాకు కనిపించింది. అప్పుడు మాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు’ అని గతాన్ని గుర్తు చేసుకుంది సుధ.
లైసెన్స్ పొందిన మొదటి మహిళా ఫారెస్ట్ గైడ్‌లలో ఒకరైన సుధాచంద్రన్ శాంక్చరి వైల్డ్‌లైఫ్ సర్వీస్ అవార్డ్(2023)తో సహా ఎన్నో అవార్డులు అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment