'మచిలీపట్నం నుంచే మళ్లీ పోటీ చేస్తా'
మచిలీపట్నం లోక్సభ స్థానం తిరిగి తనకే కేటాయిస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనకు భరోసా ఇచ్చారని ఎంపీ కొనకళ్ల నారాయణ వెల్లడించారు. శనివారం విజయవాడలో కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ... నవ్యాంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని జోస్యం చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని నిర్మాణంతోపాటు ఆ ప్రాంత అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు.
అయితే తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీల నేతలు జంపింగ్ చేస్తుండటంతో ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు తమకు మళ్లీ టికెట్ వస్తుందో రాదో అని సందేహంలో ఉన్నారు. నరసరావు పేట లోక్సభ స్థానాన్ని మరోకరికి కేటాయిస్తున్నట్లు ఇప్పటికే స్థానిక ఎంపీ మోదుగులకు చంద్రబాబు వెల్లడించారు. దాంతో ఆ పార్టీకి చెందిన పలువురు ప్రస్తుత ఎంపీలు తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చుట్టు ప్రదక్షణలు చేస్తూ, భజన చేస్తున్న సంగతి తెలిసిందే.
అదికాక కొనకళ్ల నారాయణ విభజనపై పార్లమెంట్ లో ఆందోళన చేస్తూ తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైయ్యారు. ఆ విషయం అన్ని మీడియాలలో ప్రముఖంగా వచ్చింది. నారాయణకు ప్రజల సానుభూతి ఉందని స్థానిక నేతలతోపాటు చంద్రబాబు భావిస్తున్నారు. విభజనకు అనుకూలంగా రెండు సార్లు లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీపై స్థానికంగా ఉన్న వ్యతిరేకత కొనకళ్లపై వచ్చిన సానుభూతితో క్యాష్ చేసుకోవచ్చని సదరు నాయకులు ఆలోచించినట్లు సమాచారం. అందుకే కొనకళ్లకు మళ్లీ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు ఉత్సాహాం చూపిస్తున్నట్లు తెలిసిందే.
రాష్ట్ర విభజన సందర్బంగా పార్లమెంట్లో చేపట్టిన ఆందోళనలో భాగంగా ఎంపీ కొనకళ్ల తీవ్ర అనారోగానికి గురైయ్యారు. దాంతో ఆయన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయన్ని ముంబై తరలించారు. అక్కడ కొనకళ్ల గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.