Machilipatnam parliament constituency
-
మచిలీపట్నం జనసేన లోక్‌సభ అభ్యర్థి ప్రకటన
కృష్ణా, సాక్షి: పెండింగ్ ఎంపీ సీటుకు జనసేన అభ్యర్థిని ప్రకటించింది. ముందు నుంచి ఊహించినట్లే జనసేన తరఫు నుంచి మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి తంగెనళ్ల ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తారని పవన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి పొత్తులో భాగంగా.. జనసేన 21 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ సీట్లు తీసుకుంది. ఇప్పటికే ఒక లోక్‌సభ, 18 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించగా.. పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల కసరత్తును ముమ్మరం చేసింది. తాజాగా బాలశౌరిని మచిలీపట్నం పార్లమెంట్ స్థానపు అభ్యర్థిగా ప్రకటించింది. వైఎస్సార్సీపీ తరఫున 2019లో ఎంపీగా నెగ్గిన వల్లభనేని బాలశౌరి.. ఈ ఏడాది జనవరి 14న పార్టీని వీడారు. ఫిబ్రవరి 4వ తేదీన జనసేనలో చేరారు. అప్పటి నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే.. పెండింగ్‌లో ఉన్న మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థుల కోసం పవన్ మల్లగుల్లాలు పడుతున్నారు. విశాఖ సౌత్ సీటును వంశీ యాదవ్‌కు కేటాయిస్తారని తొలి నుంచి ప్రచారం జరుతోంది. అయితే వంశీకి సీటు ఇవ్వొద్దంటూ అక్కడి జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయినా ఆ వలస నేతకే ఇవ్వాలని పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు పెండింగ్‌లో ఉన్న అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లకు ధనబలం ఉన్న నేతలను ఎంపిక చేయాలని పవన్ భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయా స్థానాల్లో ఇప్పటికే పవన్ వాయిస్‌తో ఐవీఆర్ఎస్ సర్వేలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థుల్ని ప్రకటించే చాన్స్ ఉంది. -
బందరు YSRCP ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్
సాక్షి, కృష్ణా: మచిలీపట్నం(బందరు) లోక్‌సభ అభ్యర్థి విషయంలో వైఎస్సార్సీపీ వ్యూహం మార్చింది. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ Simhadri Chandrasekhar పేరును తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయమై మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని సీఎం జగన్ ఆయన్ని( సింహాద్రి చంద్రశేఖర్) కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. అందుకే సింహాద్రి చంద్రశేఖర్ పేరును ప్రకటిస్తున్నాం. చంద్రశేఖర్ ఈ ప్రాంతానికి బాగా సుపరిచితులు. ఆయన తండ్రి కూడా మూడుసార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా కూడా పని చేశారు. ఇప్పుడు చంద్రశేఖర్ మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తారు. ఆయన ఇక్కడికి రావడం వల్ల.. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి జరుగుతుంది అని పేర్ని నాని ఆకాంక్షించారు. నన్ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల సంతోషంగా ఉంది. ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఇప్పటిదాకా లేను. ఇప్పుడు ప్రజలకు సేవ చేయడానికే వచ్చాను అని డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇదిలా ఉంటే వైఎస్సార్సీపీ తరఫున గత ఎన్నికల్లో నెగ్గిన బాలశౌరికి మరోసారి టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా లేదు. దీంతో జనసేనలో చేరారాయన. దీంతో ఇక్కడి ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది వైఎస్సార్సీపీ. దేశంలోనే ప్రముఖ కేన్సర్ వైద్యుడిగా చంద్రశేఖర్‌కు పేరుంది. దివంగత సింహాద్రి సత్యనారాయణరావు కుమారుడే చంద్రశేఖర్. ఆయన తండ్రి సింహాద్రి సత్యనారాయణరావు 1985 నుంచి 1999 మధ్య మూడు పర్యాయాలు వరుసగా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి గెలుపొంది దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా పనిచేసింది తెలిసిందే. అయితే గత రెండు ఎన్నికల్లో చంద్రశేఖర్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రముఖ పార్టీలు ప్రయత్నించినప్పటికీ సుముఖత చూపలేదు. రాజకీయాల్లో నీతి, నిజాయితీగా పనిచేసిన మంత్రిగా సింహాద్రి సత్యనారాయణరావుకి ఎంతో పేరుంది. ఆయన రాజకీయ వారసత్వంగా సింహాద్రి చంద్రశేఖర్ రాజకీయాల్లోకి రావడం పట్ల దివిసీమ ప్రజలు ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తొలుత సింహాద్రి చంద్రశేఖర్ Simhadri Chandrasekhar Raoను అవనిగడ్డ నిజయోకవర్గ ఇంఛార్జిగా, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ను మచిలీపట్నం లోక్‌సభ స్థానం ఇంఛార్జిగా ప్రకటించారు. అయితే అవనిగడ్డ ఇన్‌ఛార్జి బాధ్యతలను తన తనయుడు రామ్‌చరణ్‌కు ఇవ్వాలంటూ సీఎం జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారాయన. దీంతో ఇక ఇప్పుడు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్‌కు సీఎం జగన్ అవకాశం కల్పించారు. -
నామినేషన్లు రద్దు చేసుకోండి.. లేదంటే చంపేస్తాం
సాక్షి, కోనేరు సెంటర్(మచిలీపట్నం) : ‘నామినేషన్లు రద్దుచేసుకోమని మీ ఇంట్లో మగాళ్లకు చెప్పండి.. లేదంటే ప్రాణాలు తీస్తాం’.. అంటూ తెలుగుదేశం మాజీమంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు బెదిరింపులకు తెగబడ్డారు. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించడంటూ సోమవారం కృష్ణాజిల్లా బందరు రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాలివీ.. బందరు మండలం పొట్లపాలెం గ్రామానికి చెందిన గాజుల నాగరాజు (మాజీ సర్పంచ్) ఈ నెల 7న వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. ఈ పంచాయతీ ఏకగ్రీవం అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కానీ, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కొల్లు రవీంద్రతోపాటు ఆ పార్టీ నేతలు కుంచే దుర్గాప్రసాద్ (నాని), వాలిశెట్టి విమినేష్లు పొట్లపాలెం టీడీపీ అభ్యర్థిని నిలబెట్టేందుకు మూడ్రోజులుగా యతి్నస్తున్నారు. కానీ, ఎవరూ ముందుకు రావటంలేదు. సోమవారం వారు మరోసారి గ్రామంలోకి వెళ్లి చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో కొల్లు రవీంద్ర ప్రోద్బలంతో అతని అనుచరులు నాగరాజు ఇంటి ముందు నిలబడి దుర్భాలాషలాడటం మొదలుపెట్టారు. దుర్గాప్రసాద్, విమినేష్లు నాగరాజు ఇంట్లోకి చొరబడి దౌర్జన్యానికి దిగారు. ఒంటరిగా ఉన్న నాగరాజు భార్యతో దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడారు. నామినేషన్ ఉపసంహరించుకోకుంటే అతనితో పాటు కుటుంబసభ్యులను చంపుతామంటూ బెదిరించారు. నాగరాజు భార్య భయంతో కేకలు పెట్టటంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఇదిచూసి కొల్లు రవీంద్ర అతని అనుచరులు అక్కడి నుంచి కారుల్లో వెళ్లిపోయారు. కాగా, నాగరాజు ఫిర్యాదు మేరకు కొల్లు రవీంద్ర, దుర్గాప్రసాద్, విమినేష్లపై 448, 506, 188, 171 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మూర్తి తెలిపారు. చదవండి: చంపేస్తామంటూ.. విత్‌డ్రా చేయిస్తున్న టీడీపీ నేతలు పంచాయతీ ఎన్నికలు: మీ ఓటు ఇలా వేయండి -
బందరు బాద్షా ఎవరో?
సాక్షి,మచిలీపట్నం : మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలో స్థూలంగా వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. అవనిగడ్డ, మచిలీపట్నం ప్రాంతాల్లో మత్స్యకారుల జనాభా అధికం. 1952 నుంచి 16 సార్లు ఎన్నికలు జరగ్గా, తొమ్మిది సార్లు కాంగ్రెస్, ఐదు సార్లు టీడీపీ గెలిచాయి. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కోసారి ప్రాతినిధ్యం వహించారు. మచిలీపట్నం లోకసభకు తొలిసారిగా 1952లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి సనక బుచ్చికోటయ్య ఎంపీగా ఎన్నికయ్యారు. 1957లో కాంగ్రెస్ అభ్యర్థి మండలి వెంకట కృష్ణారావు, 1962లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మండల వెంకటస్వామి విజయం సాధించారు. ఈ నియోజకవర్గ పరిధిలో గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు గెలుపొందారు. మరోసారి ఆయననే టీడీపీ బరిలోకి దించింది. మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి వైఎస్సార్సీపీ నుంచి బరిలో ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితి.. పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెచ్చుమీరిన అంతర్గత విభేదాల వల్ల టీడీపీ బలహీనపడింది. దీంతో ఈసారి ఎంపీగా గెలవడం కష్టమని భావించిన కొనకళ్ల నారాయణ పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చివరి వరకూ ప్రయత్నించినా కుదర్లేదు. పైగా పార్లమెంటు పరిధిలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీపై సొంత సామాజికవర్గంలోని వ్యతిరేకత ఏర్పడింది. బలమైన కేడర్ ఉన్న దాసరి జైరమేష్, బాలవర్ధన్‌రావు వైఎస్సార్సీపీలో చేరడం టీడీపీకి భారీ దెబ్బ. గుడివాడ అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ను టీడీపీ బరిలోకి దించింది. స్థానికేతరుడైన అవినాష్‌ను ఈ నియోజకవర్గ ఓటర్లు ఆదరించే పరిస్థితి లేదు. బలమైన నాయకుడైన వైఎస్సార్సీపీ అభ్యర్థి కొడాలినాని ముందు అవినాష్ తేలిపోయారు. ఇక పెడనలో మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్ టీడీపీ టికెట్ కోసం బాగా ప్రయత్నించారు. చివరకు కాగిత కృష్ణప్రసాద్‌కు అక్కడ టీడీపీ టికెట్ ఇవ్వడంతో వేదవ్యాస్ వర్గం ఎన్నికల్లో సహకరించే పరిస్థితి లేదు. ఇక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థి జోగిరమేష్ దూసుకుపోతున్నారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి కొల్లురవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐదేళ్లపాటు మంత్రిగా కొనసాగినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిందేమీ లేదనే విమర్శలున్నాయి. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య(నాని) నిత్యం ప్రజల్లో ఉంటూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అవనిగడ్డలో టీడీపీ నేత అంబటి శ్రీహరి ప్రసాద్ వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు కుమారుడి అవినీతి అక్రమాలతో బాగా చెడ్డపేరు వచ్చింది. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బరిలో ఉన్నారు. పామర్రు(ఎస్సీ)లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనను టీడీపీ బరిలోకి దించింది. దీంతో ఓ సామాజిక వర్గం అలకబూనింది. అవినీతి అక్రమాలకు పాల్పడటంతో ఆమె పట్ల ప్రజల్లోనూ వ్యతిరేకత ఏర్పడింది. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి కైలే అనిల్‌కుమార్ పోటీగా బరిలోకి దిగారు. పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ బరిలో మరోసారి టీడీపీ అభ్యర్థిగా బోడెప్రసాద్ బరిలో ఉన్నారు. కాల్‌మనీ వ్యవహారం, దౌర్జన్యాలు నియోజకవర్గ పరిధిలో మితిమీరిపోయాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రిగా ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. రాజన్న మాట.. అభివృద్ధి బాట దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులకు బీజం వేశారు. కృష్ణా డెల్టా ఆధునీకీకరణ పనుల్లో భాగంగా బందరు కాలువ డ్రయినేజీ పనులు చేపట్టారు. నూజివీడులో 2008లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేశారు. గన్నవరం మండలంలోని కేసరపల్లిలో ఏపీఐఐసీ, ఎల్అండ్టీ సంయుక్త సౌజన్యంతో నిర్మించిన ఐటీపార్కు మొదటి టవర్‌లో 14 కంపెనీలు పూర్తిస్థాయిలో కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం 1,500 మంది ఐటీ విద్యార్థులకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఆ ప్రాంత ప్రజల దశాబ్ధాల కల అయిన బందరు పోర్టు ఏర్పాటుకు 2008 ఏప్రిల్ 23న రూ. 1,500 కోట్లతో ఆయన శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ మరణించడంతో మళ్లీ బందరు పోర్టు వ్యవహారం మరుగునపడింది. తర్వాత సీఎంగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు బందరు పోర్టును నిర్మిస్తామని గొప్పగా ప్రకటించారు. అయితే పోర్టు పేరుతో 1.05 లక్షల ఎకరాల రైతుల భూములు తీసుకొని కార్పొరేట్, విదేశీ కంపెనీలకు ధారదత్తం చేయడానికి ఎత్తుగడ వేశారు. – ఎం. రామ్మోహన్ సాక్షి, అమరావతి బ్యూరో వల్లభనేని బాలశౌరి (వైఎస్సార్సీపీ) 2004లో కాంగ్రెస్ నుంచి తెనాలి లోక్‌సభ(2009 ప్రాదేశిక పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పుడు లేదు) ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. ఈయన వ్యాపారవేత్త. ఆయన ఎన్నో కళాశాలలను నెలకొల్పారు. రక్షణ, వాణిజ్య విభాగం పార్లమెంటరీ కమిటీ సభ్యులుగా సేవలు అందించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కొనకళ్ల నారాయణరావు(టీడీపీ) ఈయన ఎంపీగా ఉన్న సమయంలోనే రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చింది. ఆ సమయంలో ఆయన సరిగా వాదన వినిపించలేదని అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఏనాడు బందరు పోర్టు పనుల గురించి మాట్లాడకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలున్నాయి. మొత్తం ఓటర్లు 14,29,861 పురుషులు 7,01,396 మహిళలు 7,28,355 ఇతరులు 110 -
'మచిలీపట్నం నుంచే మళ్లీ పోటీ చేస్తా'
మచిలీపట్నం లోక్‌సభ స్థానం తిరిగి తనకే కేటాయిస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనకు భరోసా ఇచ్చారని ఎంపీ కొనకళ్ల నారాయణ వెల్లడించారు. శనివారం విజయవాడలో కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ... నవ్యాంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని జోస్యం చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని నిర్మాణంతోపాటు ఆ ప్రాంత అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. అయితే తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీల నేతలు జంపింగ్ చేస్తుండటంతో ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు తమకు మళ్లీ టికెట్ వస్తుందో రాదో అని సందేహంలో ఉన్నారు. నరసరావు పేట లోక్‌సభ స్థానాన్ని మరోకరికి కేటాయిస్తున్నట్లు ఇప్పటికే స్థానిక ఎంపీ మోదుగులకు చంద్రబాబు వెల్లడించారు. దాంతో ఆ పార్టీకి చెందిన పలువురు ప్రస్తుత ఎంపీలు తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చుట్టు ప్రదక్షణలు చేస్తూ, భజన చేస్తున్న సంగతి తెలిసిందే. అదికాక కొనకళ్ల నారాయణ విభజనపై పార్లమెంట్ లో ఆందోళన చేస్తూ తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైయ్యారు. ఆ విషయం అన్ని మీడియాలలో ప్రముఖంగా వచ్చింది. నారాయణకు ప్రజల సానుభూతి ఉందని స్థానిక నేతలతోపాటు చంద్రబాబు భావిస్తున్నారు. విభజనకు అనుకూలంగా రెండు సార్లు లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీపై స్థానికంగా ఉన్న వ్యతిరేకత కొనకళ్లపై వచ్చిన సానుభూతితో క్యాష్ చేసుకోవచ్చని సదరు నాయకులు ఆలోచించినట్లు సమాచారం. అందుకే కొనకళ్లకు మళ్లీ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు ఉత్సాహాం చూపిస్తున్నట్లు తెలిసిందే. రాష్ట్ర విభజన సందర్బంగా పార్లమెంట్లో చేపట్టిన ఆందోళనలో భాగంగా ఎంపీ కొనకళ్ల తీవ్ర అనారోగానికి గురైయ్యారు. దాంతో ఆయన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయన్ని ముంబై తరలించారు. అక్కడ కొనకళ్ల గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.