పవన్ రూటే సెప‘రేటు’
జనసేన తరఫున వలస నేతలకే సీట్లు
మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి
ఇప్పటికే తిరుపతిలో ఆరణి శ్రీనివాసులుకు సీటు
ఇప్పుడు బాలశౌరికి ఎంపీ సీటు
విశాఖ సౌత్‌లో వంశీ యాదవ్ వైపే మొగ్గు
ముగ్గురూ వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చినవాళ్లే
పెండింగ్ మూడు సీట్లు కూడా ధనబలం ఉన్నవాళ్లకే?
మొదటి నుంచి ఉన్న నేతలకు మొండి చేయి
వద్దని నిరసనలు, ఆందోళనలు చేస్తున్నా జనసేన అభ్యంతరాల్ని పట్టించుకోని పవన్
కృష్ణా, సాక్షి: పెండింగ్ ఎంపీ సీటుకు జనసేన అభ్యర్థిని ప్రకటించింది. ముందు నుంచి ఊహించినట్లే జనసేన తరఫు నుంచి మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి తంగెనళ్ల ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తారని పవన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
కూటమి పొత్తులో భాగంగా.. జనసేన 21 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ సీట్లు తీసుకుంది. ఇప్పటికే ఒక లోక్‌సభ, 18 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించగా.. పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల కసరత్తును ముమ్మరం చేసింది. తాజాగా బాలశౌరిని మచిలీపట్నం పార్లమెంట్ స్థానపు అభ్యర్థిగా ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ తరఫున 2019లో ఎంపీగా నెగ్గిన వల్లభనేని బాలశౌరి.. ఈ ఏడాది జనవరి 14న పార్టీని వీడారు. ఫిబ్రవరి 4వ తేదీన జనసేనలో చేరారు. అప్పటి నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రచారంలో ఉంది.
ఇదిలా ఉంటే.. పెండింగ్‌లో ఉన్న మూడు అసెంబ్లీ సెగ్మెంట్‌లకు అభ్యర్థుల కోసం పవన్ మల్లగుల్లాలు పడుతున్నారు. విశాఖ సౌత్ సీటును వంశీ యాదవ్‌కు కేటాయిస్తారని తొలి నుంచి ప్రచారం జరుతోంది. అయితే వంశీకి సీటు ఇవ్వొద్దంటూ అక్కడి జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయినా ఆ వలస నేతకే ఇవ్వాలని పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మరోవైపు పెండింగ్‌లో ఉన్న అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లకు ధనబలం ఉన్న నేతలను ఎంపిక చేయాలని పవన్ భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయా స్థానాల్లో ఇప్పటికే పవన్ వాయిస్‌తో ఐవీఆర్‌ఎస్ సర్వేలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థుల్ని ప్రకటించే చాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment