
'బాబు, కిరణ్ బూడిద మిగిల్చారు'
* వైఎస్ ఉంటే రాష్ట్ర విభజన జోలికి ఎవరూ వచ్చేవారు కాదు
* ఒక్క డ్వాక్రా మహిళకు రుణ మాఫీ జరిగిందని నిరూపించినా రాజీనామా చేస్తా
* ప్రభుత్వానికి ఎమ్మెల్యే కొడాలి నాని సవాల్
సాక్షి, హైదరాబాద్: ‘ఢిల్లీలో చక్రం తిప్పుతున్నామంటున్నారు. చివరకు రాష్ట్రాన్ని విభజిస్తూంటే చేతులు ముడుచుకు కూర్చున్నారు’ అని సీఎం చంద్రబాబునుద్దేశించి వైసీపీ శాసనసభ్యుడు కొడాలి నాని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే ఎవరూ ఈ రాష్ట్రం జోలికి వచ్చే ధైర్యం చేసేవారు కాదన్నారు. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ కలిసి చివరకూ రాష్ట్రాన్ని విభజించారని దుయ్యబట్టారు. ఇప్పటివరకూ ఒక్క డ్వాక్రా మహిళకూ రుణమాఫీ జరగలేదని, అలా ఎక్కడైనా జరిగుంటే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని నాని సవాల్ విసిరారు. తాజాగా కొయ్యలగూడెంలో మహిళలతో కిరీటాలు పెట్టించుకుని చంద్రబాబు సన్మానం చేయించుకున్నారని.. ఒక్క మహిళకు కూడా రుణమాఫీ చెయ్యకుండానే ఎలా సన్మానం చేయించుకున్నారో ఆయనకే తెలియని ఎద్దేవా చేశారు.
బుధవారం ఆయన శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల ధాన్యాన్ని కొనే దిక్కులేదన్నారు. ప్రభుత్వం కొంటున్నా నెలల తరబడి చెక్కులు రావడం లేదని, వచ్చిన చెక్కులనూ రుణమాఫీలో మినహాయించుకుని ఇచ్చే పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో వైఎస్ ఐదేళ్లలో 45 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారని, టీడీపీ అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయినా రాష్ట్రంలో ఒక్క ఇంటికీ నిధులివ్వలేదన్నారు. వైఎస్ మృతిచెందిన రోజే పోలవరం ప్రాజెక్టు చచ్చిపోయిందని, నాడు ప్రాజెక్టుకు కాల్వలు తవ్విస్తే ఎద్దేవా చేశారని, నేడు పట్టిసీమ ప్రాజెక్టు పేరు చెప్పి డబ్బు కట్టలు ప్రవహింపజేస్తున్నారన్నారు.