పంతాల పేటముడి!
Published Wed, Feb 5 2014 2:59 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
ఒకరు కేంద్ర మంత్రి.. ఇంకొకరు రాష్ట్ర మంత్రి.. ఇద్దరిదీ ఒకటే పంతం.. తమ మాటే నెగ్గాలి.. తాము చెప్పిన వారికే టిక్కెట్ దక్కాలి. నరసన్నపేట కేంద్రంగా ఈ పీటముడి బిగుసుకుంటోంది. కోండ్రు ఒకరికి దన్నుగా నిలిస్తే.. కృపారాణి ఇంకొకరికి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. జిల్లాపై ఆధిపత్యమే లక్ష్యంగా అమాత్యులు వేస్తున్న ఈ ఎత్తులు పైఎత్తులు ఎన్నికల్లో పార్టీని ఎటూ తీసుకుపోతాయోనని కాంగ్రెస్ శ్రేణులు కంగారు పడుతున్నాయి. పంతాలు వీడకపోతే.. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టకపోతే ఎన్నికల్లో పార్టీ మట్టికొట్టుకుపోతుందని ఆందోళన చెందుతున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కేంద్ర, రాష్ట్ర మంత్రులు కృపారాణి, కోండ్రు మురళీల చెలగాటం జిల్లా కాంగ్రెస్‌కు ప్రాణసంకటంగా పరిణమిస్తోంది. పార్టీలో మిగిలిన కొద్దిమంది నేతలు వీరిద్దరి ఆధిపత్య పోరులో నలిగిపోతున్నారు. ఆధిపత్యం ఎవరిదో తెలీదు గానీ.. ఇద్దరూ పంతానికి పోతున్నారు. దీనికి నరసన్నపేట నియోజకవర్గ టిక్కెట్ వ్యవహారమే తాజా తార్కాణం. జిల్లా పార్టీపై పట్టు సాధించేందుకు దీన్నే సాధనంగా చేసుకున్నారు. ఇక్కడి టిక్కెట్ ఇప్పిస్తానని డోల జగన్‌కు మంత్రి కోండ్రు అభయహస్తం ఇవ్వగా.. ఆయనెవరు ఇవ్వడానికి.. మీదే ఆ టిక్కెట్టు అంటూ కేంద్ర మంత్రి కృపారాణి శిమ్మ కుటుంబానికి వెన్ను తడుతున్నారు. దాంతో వ్యవహారం తెగే వరకు సాగేలా ఉందని కాంగ్రెస్‌వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి.
కోండ్రు తహతహ
మంత్రి అయినప్పటికీ జిల్లాలో ఎక్కడా పట్టు లేకపోవడంతో మంత్రి కోండ్రు మురళీ కొంతకాలంగా అసహనంగా ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇతర నియోజకవర్గాల్లోకి చొచ్చుకుపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు డీసీసీబీ అధ్యక్షుడు డోల జగన్‌తో కలిసి ముందుగానే వ్యూహరచన చేశారు. నరసన్నపేట టిక్కెట్ ఇప్పిస్తానని చెప్పారు. ఆ నియోజకవర్గంలో సంప్రదాయంగా ఆధిపత్యం కొనసాగిస్తున్న సామాజికవర్గానికి వ్యతిరేకంగా డోలను తెరపైకి తెచ్చారు. సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స, కేంద్ర మంత్రి చిరంజీవిలతో కూడా మాట్లాడి మార్గం సుగమం చేశారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కృపారాణిని మాటమాత్రంగానైనా సంప్రదించ లేదు. డోల జగన్ పూర్తిగా తమ సన్నిహితుడిగానే ఉండాలన్నది మంత్రి మురళీ ఉద్దేశం. తద్వారా కృపారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కూడా తన వర్గాన్ని పెంచుకోవాలన్నది ఆయన లక్ష్యం. అంతా తాను అనుకున్నట్లే సాగుతోందని ఆయన ధీమాగా ఉన్న తరుణంలో కృపారాణి ప్రతిదాడికి దిగారు.
తెర పైకి శిమ్మ కుటుంబం
తన నియోజకవర్గ పరిధిలో కోండ్రు జోక్యాన్ని కేంద్ర మంత్రి కృపారాణి ఏమాత్రం సహించలేకపోయారు. తొలి దశలోనే ఆయన్ను అడ్డుకోవాలని నిర్ణయించారు. డోల జగన్ అవకాశాలకు గండి కొట్టేందుకు వ్యూహాత్మకంగా శిమ్మ కుటుంబాన్ని తెరపైకి తెచ్చారు. నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే శిమ్మ ప్రభాకర్‌రావు దంపతులను ఇటీవల సంప్రదించారు. నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గానికి కాకుండా ఇతరులకు అవకాశం ఇవ్వాలని మంత్రి మురళీ ప్రయత్నిస్తున్నారని వారితో చెప్పారు. అలా కాకుండా సంప్రదాయంగా ఆధిపత్యం సాగిస్తున్న సామాజికవర్గానికే టిక్కెట్టు ఇచ్చేలా పార్టీ అధిష్టానాన్ని ఒప్పిస్తానని చెప్పారు. శిమ్మ ప్రభాకర్‌రావు భార్య ఉషారాణిని అభ్యర్థిగా నిలుపుతామని కూడా హామీ ఇచ్చేశారు.
అలా అయితే తన లోక్‌సభ నియోజకవర్గంలో సామాజికవర్గ సమీకరణల సమతూకం సాధ్యమవుతుందని కూడా అధిష్టానానికి వివరిస్తానని చెప్పారు. ఈ ప్రతిపాదనపై శిమ్మ దంపతులు తమ తుది నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు. కానీ ఈ పరిణామాలు మాత్రం కోండ్రు, కిల్లిల మధ్య ఆధిపత్య పోరు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. కృపారాణి అనూహ్యంగా చేసిన ప్రతిదాడితో మంత్రి మురళీ ఆత్మరక్షణలో పడిపోయారు. జిల్లా పార్టీపై పట్టు సాధించాలన్న తన వ్యూహానికి కృపారాణి గండికొడతారని ఆయన ఊహించలేదు. నరసన్నపేట కేంద్రంగా మొదలైన ఆధిపత్య పోరు జిల్లా అంతటా వ్యాపించి పార్టీకి ఉన్న కొనఊపిరినీ కూడా తీసేసేలా ఉందని కాంగ్రెస్ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి.
Advertisement
Advertisement