రేగిడిలో కోండ్రు వ్యవహారశైలికి నిరసగా సమావేశమైన టీడీపీ నేతలు (ఫైల్)
కోండ్రు మురళీమోహన్... నిన్నటివరకూ కాంగ్రెస్‌లో ఎదిగి ఓ వెలుగు వెలిగిన నాయకుడు! ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆయనకు రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించింది. అప్పటివరకూ రాజాంలో చక్రం తిప్పిన సీనియర్ నాయకులు కిమిడి కళావెంకటరావు, కావలి ప్రతిభా భారతి అయిష్టంగానే అంగీకరించక తప్పలేదు. వారితో సర్దుకుపోతానన్న కోండ్రు కూడా ఇప్పుడు ఇన్‌చార్జిగా కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రధానంగా రాజాంలో తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకునే పనిలో ఉన్నారు. ఒకవేళ ఎన్నికల సమయంలో ఏవైనా వ్యతిరేక పవనాలు వీస్తే అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో దిగేలా సన్నాహాలు చేసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తన వ్యూహాలకు అనుగుణంగా తన సన్నిహితుల ద్వారా కార్యచరణనూ ప్రారంభించారు. ఇది గ్రహించిన కిమిడి, కావలి అనుచర గణాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి.
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం:రాజాంలో టీడీపీ ఇన్‌చార్జిగా కోండ్రు మురళీమోహన్ మూడు నెలల క్రితమే నియమితులయ్యారు. సక్రమంగా రెండు వారాలే గడిచాయి. తరువాత నుంచి నియోజకవర్గంలో వర్గవిభేదాలు ప్రారంభమయ్యాయి. కోండ్రు చాపకింద నీరులా ప్రతీ మండలంలోనూ టీడీపీలో రెండో వర్గాన్ని తయారుచేసి తటస్థుల ముసుగులో వారిని వెనుక తిప్పుకోవడం దీనికి కారణమైంది. వీరి కనుసన్నల్లోనే ఆయా మండలాల్లో టీడీపీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వీరంతా టీడీపీ ప్రధాన నేతల వ్యతిరేక వర్గీయులు కావడం విశేషం. రాజాం నగర పంచాయతీలో టీడీపీకి చెందిన మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి వ్యతిరేక వర్గీయులను కోండ్రు ప్రోత్సహిస్తున్నారు. వారికి కాంట్రాక్ట్ వర్క్‌లు అప్పగిస్తూ తన పెత్తనాన్ని సాగిస్తున్నారు. దీంతో ఇక్కడ ప్రతిభాభారతి వర్గం ఇబ్బందులు పడుతోంది. మరోవైపు వంగరలో సంక్షేమ పథకాలు మంజూరు బాధ్యతను తన వర్గానికి చెందిన వారికి అప్పగించి అక్కడ కూడా అసలు వర్గాన్ని పక్కనపెట్టారు. అంతేకాకుండా వారిలో కొంతమందికి కొత్త హామీలు గుప్పించి పూర్తి్తగా కోండ్రు వర్గంగా మార్చుకుంటున్నారు. సంతకవిటిలో టీడీపీ నేత కొల్ల అప్పలనాయుడును ఏడాది క్రితం ఆ మండలంలో జరిగిన ట్రేడింగ్ స్కాంను అడ్డుపెట్టుకుని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా మొదటినుంచి టీడీపీలో ఉన్న కొంతమందిని పక్కనపెట్టారు.
కిమిడి కుటుంబమే టార్గె్గట్...
కోండ్రు మురళీమోహన్ ఆది నుంచి సొంత పెత్తనాన్ని కొనసాగిస్తూ వచ్చారు. గతంలో రాజాం నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతో ఎమ్మెల్యేగా గెలుపొందిన కోండ్రు... ఆయన మరణాంతరం మంత్రి పదవి కూడా పొందిన సంగతి తెలిసిందే. కానీ తర్వాత కాలంలో వైఎస్సార్‌పై బురదజల్లే ప్రయత్నం చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. అదేసమయంలో ఇటు ధర్మాన ప్రసాదరావు, విజయనగరం జిల్లాలో ఎంపీ బొత్స ఝాన్సీతోనూ విభేదాలు పెంచుకున్నారు. ఆ ధీమాతోనే 2014 ఎన్నికల్లో బరిలోకి దిగిన కోండ్రుకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇప్పుడు టీడీపీలో ఉన్నా కోండ్రు మళ్లీ ఆ పథకాన్నే అమలు చేయడానికి రంగం సిద్ధం చేసుకోవడం గమనార్హం. రాజాం నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కైన రాష్ట్ర మంత్రి కిమిడి కళా వెంకటరావు కుటుంబాన్ని పక్కనపెట్టే పనిలో పడ్డారు. దీంతో రేగిడి మండలంలో టీడీపీ మండల అ«ధ్యక్షుడు కిమిడి వినయ్‌కుమార్‌తో పాటు వైస్ ఎంపీపీ కిమిడి రామకృష్ణంనాయుడు వర్గీయులను పూర్తిగా పక్కకు నెట్టి అక్కడ కిమిడి వ్యతిరేక వర్గీయులుకు ప్రోత్సహించడం ప్రారంభించారు. చివరకు రెండు రోజులు క్రితం ఈ మండలంలోని టీడీపీ నేతలు కోండ్రు వైఖరికి నిరసనగా సమావేశాలు పెట్టుకున్నారు. కోండ్రు వ్యవహారశైలిపై పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం.
తనపై వ్యతిరేకతను టీడీపీ నేతలపైకి నెట్టుతూ..
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కోండ్రు మురళీమోహన్ రాజాం నియోజకవర్గంలోని మండలాల్లో తనకంటూ తయారు చేసుకున్నారు. అయితే 2014 సాధారణ ఎన్నికల్లో తనకు అనుకూలంగా వారంతా ఉండకపోవడంతో వారిని స్థానికసంస్థల ఎన్నికల్లో ఓడించేందుకు కష్టపడ్డారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. అయినా చాలా పంచాయతీల్లో ఈ పాచిక పారలేదు. అంతేకాకుండా ఆ వ్యవహారశైలి కారణంగానే నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నేతలంతా కోండ్రును తమ పార్టీలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో చేసేదిలేక టీడీపీలో చేరిన కోండ్రు... పార్టీ ఇన్‌చార్జ్ బాధ్యతలు వచ్చిన కొద్ది రోజులైనా గడవకముందే వర్గాలను ప్రోత్సహించడం ప్రారంభించారు. దీంతో పాటు ప్రజల్లో ఆయనపై గతంలో ఉన్న వ్యతిరేకత కారణంగా గ్రామదర్శిని కార్యక్రమాలకు, జన్మభూమి మా ఊరు కార్యక్రమాలకు ప్రజలు ముఖం చాటేశారు. ఈ వ్యతిరేకతను టీడీపీపై, గతంలో ఉన్న నాయకులపై ఉన్న వ్యతిరేకతగా కోండ్రు ప్రచారం చేయడం ప్రారంభించారు. వీటిని సహించలేక టీడీపీకి అనుకూలంగా ఉన్నవారంతా కోండ్రు వ్యవహారశైలిపై మండిపడుతున్నారు.
చివరిలో స్వతంత్ర అభ్యర్థిగా...
రాజాం నియోజకవర్గంలో టీడీపీకి ప్రధాన పట్టు కిమిడి కుటుంబమే. గతంలో ఈ వర్గం మద్దతుతో టీడీపీ గెలిచిన సందర్భాలు అధికంగా ఉన్నాయి. అటువంటి కిమిడి కుటుంబానికి వ్యతిరేకంగా కోండ్రు వ్యవహరించడంతో పాటు తన పాత స్నేహితులను, టీడీపీ ప్రధాన నేతల వ్యతిరేక వర్గీయులను ఈయన ప్రోత్సహించడంపై సర్వత్రా అలజడి నెలకొంది. ఇదే తరుణంలో కోండ్రు సన్నిహితులు కూడా ప్రస్తుతం రాజాంలో టీడీపీ గెలిచే పరిస్థితి లేదని చెప్పడంతో సొంతంగా క్యాడర్ తయారు చేసుకునే పనిలో కోండ్రు పడ్డారు. చివరి నిమిషంలో స్వతంత్ర అభ్యర్థి పేరుతో బరిలో దిగి గెలిచిన తరువాత గెలుపొందిన పార్టీలోకి చేరిపోదామనే సంకేతాన్ని కూడా తన అనుచరుల్లోకి పంపుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో టీడీపీకి కోండ్రు కిరికిరి పెద్ద తలనొప్పిగా మారే పరిస్థితి కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment