బ్రిడ్జి.. డ్యామేజీ | Kovvuru Rajamundry Bridge in Danger Stage West Godavari | Sakshi
Sakshi News home page

బ్రిడ్జి.. డ్యామేజీ

Published Fri, Aug 3 2018 10:14 AM | Last Updated on Fri, Aug 3 2018 10:14 AM

Kovvuru Rajamundry Bridge in Danger Stage West Godavari - Sakshi

కొవ్వూరు–రాజమండ్రి రోడ్డు కం రైలు వంతెన

కొవ్వూరు : కొవ్వూరు–రాజమండ్రి రోడ్డు కం రైలు వంతెన పటిష్టత ప్రశ్నార్థకంగా మారుతోంది. వంతెన భద్రతను దృష్టిలో ఉంచుకుని భారీ వాహనాల రాకపోకలపై నిషేధాజ్ఞలు విధించినా ఎక్కడా అమలు కావడం లేదు. దీంతో వంతెన పటుత్వం పట్టు తప్పుతోంది. ఎక్కడికక్కడే గోతులు పడడంతో పాటు జాయింట్ల వద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. రెయిలింగ్‌లు దెబ్బతిన్నాయి. ఫుట్‌పాత్‌లు పాడయ్యాయి. లైట్లు వెలగడం లేదు. వంతెనపై దుమ్ము, చెత్త పేరుకుపోవడంతో వర్షపునీరు దిగువకు వెళ్లకుండా నిలుస్తోంది. వంతెనపై కనీస నిర్వహణ కొరవడింది. ఈ వారధి నిర్వహణ ఇలానే వదిలేస్తే దాని ఉనికి దెబ్బతినే ప్రమాదంఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నలభై మూడేళ్లుగా ఈ వంతెన సేవలందిస్తోంది. రెండేళ్ల క్రితం నిడదవోలు వైపు నుంచి కొవ్వూరు వస్తున్న సీఐ ఎం.బాలకృష్ణ జీపునకు మీటరు దూరంలో రోడ్డు కం రైలు వంతెనపై పెచ్చులూడి పడ్డాయి. అప్పట్లో ప్రమాదం తృటిలో తప్పింది. రాజమండ్రి వైపు శ్లాబు పెచ్చులూడడంతో  రంధ్రం పడింది. అయినప్పటికీ శాశ్వత మరమ్మతుల పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. తాత్కాలిక మరమ్మతులతో కాలక్షేపం చేస్తోంది. వంతెన భద్రతను ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. ప్రస్తుతం వారధి దెబ్బతినడంతో రాకపోకలకు జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోదావరి పుష్కరాల సమయంలోనైనా ఈ వంతెన రూపు మారుతుందని అంతా ఆశపడ్డారు. ప్రభుత్వం కేవలం తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టింది.

తాత్కాలిక మర్మమతులతో కాలక్షేపం
ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండో రోడ్డు కం రైలు వంతెనగా ఇది పేరుగాంచింది. ఈ వంతెనకు 1994, 2005, 2010 సంవత్సరాలలో తాత్కాలిక మరమ్మతులు చేశారు. పుష్కరాల అనంతరం రూ.10 కోట్లతో శాశ్వత మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు పుష్కరాల సమయంలో ప్రభుత్వ పెద్దలు, అధికారులు ప్రకటించారు. అప్పట్లో సీఎం చంద్రబాబు, ఎంపీ మాగంటి మురళీమోహన్‌లు సైతం శాశ్వత మరమ్మతులు చేయిస్తామని ప్రకటించారు. మూడేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఆ ఊసేలేదు. 1994 సంవత్సరంలో తొలిసారి మరమ్మతులు చేపట్టారు. 2005 సంవత్సరంలో రూ.3 కోట్ల వ్యయంతో రిపేర్లు చేశారు. పనుల్లో ప్రమాణాలు పాటించకపోవడంతో కొద్ది రోజులకే వంతెనపై రోడ్డు పూర్తిగా పాడైపోయింది. 2010లో జాయింట్ల వద్ద రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో 6,7,8 స్పాన్‌ల మధ్య రూ.10 లక్షల వ్యయంతో 34 జాయింట్ల వద్ద ప్రయోగాత్మకంగా మరమ్మతులు చేశారు. రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు నిధులు సమకూర్చడంతో ఒకటి నుంచి ఐదు స్పాన్‌ల మధ్య, మరో 32 జాయింట్లకు మైక్రో కాంక్రీటు విధానంలో మరమ్మతులు చేశారు. అప్పట్లో ఏకంగా 52 రెండు రోజుల పాటు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ఈ ప్రక్రియ విజయవంతం అయితే అన్ని జాయింట్ల వద్ద ఈ విధానం ద్వారా మరమ్మతులు చేపడతామని చెప్పారు. గోదావరి పుష్కరాల సమయంలో 2015లో రూ.3 కోట్లతో మళ్లీ తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టారు. వంతెనపై తారుతో పలుచటి లేయర్‌ వేసి (బిడ్‌మినస్‌ కాంక్రీటు), రంగులు వేసి, విద్యుత్‌ లైట్లు అమర్చి ముస్తాబు చేశారు. ఈ పనులు నాసిరకంగా చేయడంతో నెల తిరగకుండానే రోడ్డుపై కంకర లేచిపోయి దెబ్బతింది.

మూడునాళ్ల ముచ్చటగా వెలుగులు
సుమారు రెండు దశాబ్దాల నుంచి రోడ్‌ కం రైలు వంతెనపై ఉన్న విద్యుత్‌ లైట్లు వెలగడం లేదు. పుష్కరాల నేపథ్యంలో విద్యుత్‌ లైట్లను పునరుద్ధరించి విద్యుత్‌ కాంతులతో నింపనున్నామని ప్రభుత్వం గొప్పగా చెప్పింది. రూ.70 లక్షల వ్యయంతో విద్యుత్‌ లైను మరమ్మతులు చేపట్టారు. వంతెనపై ఉన్న 400 విద్యుత్‌ స్తంభాలకు ఫిలమెంట్‌ బల్బుల స్థానంలో ఇండక్షన్‌ బల్బులు ఏర్పాటు చేశారు. ఈ లైట్లు మూడునాళ్ల ముచ్చటగా తయారయ్యాయి. వంతెన లైట్లు సైతం ప్రస్తుతం ఇప్పుడు మూడో వంతుకు పైగా వెలగడం లేదు.

భద్రతను గాలికి వదిలేసిన ప్రభుత్వం
ఈ వంతెనపై 10.20 టన్నులు సామర్థ్యం మించిన వాహనాలు, 3 ఆక్సిల్స్‌ ఆపైబడి ఉన్న వాహనాలు వెళ్లకూడదనే నిబంధన ఉంది. అప్పట్లో ఆర్‌అండ్‌బీ అధికారులు వంతెనకు ఇరువైపులా నిషేధిత బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. 2009లో ఇరువైపులా పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి భారీ వాహనాల నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. అయితే దొంగచాటుగా భారీ వాహనాలను అనుమతించి డబ్బులు గుంజుతున్నారన్న ఆరోపణలపై రాజమండ్రికి చెందిన 11 మంది ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు, ఒక ఏఎస్‌ఐను అధికారులు సస్పెండ్‌ చేశారు. దీంతో కొద్ది రోజులు భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సిబ్బంది కొరత, మామూళ్ల ఆరోపణల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు చెక్‌పోస్టులను ఎత్తివేశారు. అనంతరం ఆర్‌అండ్‌బీ, పోలీసు, రవాణాశాఖ అధికారులు భారీ వాహనాల నియంత్రణ పట్ల దృష్టి సారించకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. రెండేళ్ల క్రితం రోడ్డు కం రైలు వంతెన జంక్షన్‌ వద్ద పోలీసు అవుట్‌ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ అవీ పనిచేయకపోవడంతో మళ్లీ భారీ వాహనాలు యథేచ్ఛగా వెళుతున్నాయి.

ముఖ్యంగా కొవ్వూరు, తాళ్లపూడి, పోలవరం మండలాల పరిధిలో ఉన్న ఇసుక ర్యాంపుల నుంచి భారీ వాహనాలు రాజమండ్రి వెళ్లాలంటే ఈ వంతెనపై నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. నాలుగో రోడ్డు వంతెనపై నుంచి వెళ్లాలంటే టోల్‌ ఫీజు చెల్లించాల్సి రావడంతో సాయంత్రం, తెల్లవారు జామున గుట్టుచప్పుడు కాకుండా రాకపోకలు సాగిస్తున్నాయి. కంకర, ఇసుక లోడుతో సుమారు 16, 17 టన్నుల బరువుతో వచ్చే వాహనాలు సైతం వారధిపై నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. వంతెన మరమ్మతులపై ప్రభుత్వం ఇప్పటికీ దృష్టి సారించక పోవడం విమర్శలకు తావిస్తోంది. కనీసం భారీ వాహనాల రాకపోకలను నియంత్రించకపోతే వంతెన ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. 2010లో దేవరపల్లి, నల్లజర్ల, కొయ్యలగూడెంలలో పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి భారీ వాహనాలను నియంత్రించి దారి మళ్లించే వారు. కొంత కాలానికి చెక్‌ పోస్టులు కలెక్షన్‌ పాయింట్లుగా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు వీటిని తొలగించారు. కనీసం పోలీసు అధికారులు రాత్రి గస్తీ సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేసి భారీ వాహనాలపై కేసులు నమోదు చేస్తే కొంత మేరకు అయినా ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం వంతెనపై రోడ్డు దెబ్బతినడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.

గోతులు పూడ్పించే చర్యలు తీసుకుంటాం
రోడ్డు కం రైలు వంతెనపై ఏర్పడిన గోతులు పూడ్పించేందుకు చర్యలు తీసుకుంటాం. వర్షాల కారణంగా పనులు చేపట్టడానికి వీలు కాలేదు. వారధిపై పేరుకుపోయిన చెత్త తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. శాశ్వత పనులు చేపట్టేందుకు ఏవిధమైన ప్రతిపాదనలు చేయలేదు.– ఈజీఆర్‌ నాయుడు, డీఈఈ, రోడ్డు కం రైలు వంతెన

శాశ్వత మరమ్మతులు చేయాలి
రోడ్డు కం రైలు వంతెనకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలి. కనీస నిర్వహణను ప్రభుత్వం విస్మరించింది. ఆసియా ఖండంలోనే పేరుగాంచిన ఈ వారధి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోంది. ఫుట్‌పాత్‌లు దెబ్బతిన్నాయి. అడుగడుగునా గోతులు ఏర్పడ్డాయి. వంతెనపై చెత్త, మట్టి పేరుకుపోయాయి. తక్షణమే చర్యలు తీసుకోవాలి.         – కంఠమణి రమేష్‌బాబు, కొవ్వూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement