కమిషనర్ వీరపాండియన్
విజయవాడ సెంట్రల్ : కృష్ణా పుష్కరాలకు నగరంలో రోడ్లు అభివృద్ధి, గ్రీన్‌అండ్ బ్లూ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసే విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. క్యాంప్ కార్యాలయంలో టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని చెప్పారు. బందరు, ఏలూరు, రైవస్ కాలువలతో పాటు భవానీపురంలోని కృష్ణా రివర్‌ఫ్రంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. రహదారుల అభివృద్ధిలో భాగంగా సెంట్రల్ డివైడర్లు, ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్ ఐలాండ్‌ల్లో పచ్చదనాన్ని పెంపొందించే విధంగా ప్రణాళికలు రూపొందించాల్సిందిగా సూచించారు.
రాజీవ్‌గాంధీ, కేఎల్ రావు, రాఘవయ్య, అంబేడ్కర్ పార్కులతో పాటు 35 ప్రాంతాల్లో 1,500 స్కేర్‌మీటర్ల విస్తీర్ణంలోని ఖాళీస్థలాలను పార్కులుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా చెప్పారు. ఇవి కాకుండా మరో 41 చిన్న పార్కులు కూడా అభివృద్ధి చేయాల్సిందిగా ఉద్యాన శాఖ అధికారులను కోరారు. చీఫ్ ఇంజినీర్ ఎంఏ షుకూర్, సిటీప్లానర్ ప్రదీప్‌కుమార్, ఈఈ ఎ.ఉదయ్‌కుమార్, ఉద్యాన శాఖ అధికారి జీపీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.