The development of roads
-
కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక ప్రణాళిక
కమిషనర్ వీరపాండియన్ విజయవాడ సెంట్రల్ : కృష్ణా పుష్కరాలకు నగరంలో రోడ్లు అభివృద్ధి, గ్రీన్అండ్ బ్లూ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసే విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. క్యాంప్ కార్యాలయంలో టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని చెప్పారు. బందరు, ఏలూరు, రైవస్ కాలువలతో పాటు భవానీపురంలోని కృష్ణా రివర్‌ఫ్రంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. రహదారుల అభివృద్ధిలో భాగంగా సెంట్రల్ డివైడర్లు, ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్ ఐలాండ్‌ల్లో పచ్చదనాన్ని పెంపొందించే విధంగా ప్రణాళికలు రూపొందించాల్సిందిగా సూచించారు. రాజీవ్‌గాంధీ, కేఎల్ రావు, రాఘవయ్య, అంబేడ్కర్ పార్కులతో పాటు 35 ప్రాంతాల్లో 1,500 స్కేర్‌మీటర్ల విస్తీర్ణంలోని ఖాళీస్థలాలను పార్కులుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా చెప్పారు. ఇవి కాకుండా మరో 41 చిన్న పార్కులు కూడా అభివృద్ధి చేయాల్సిందిగా ఉద్యాన శాఖ అధికారులను కోరారు. చీఫ్ ఇంజినీర్ ఎంఏ షుకూర్, సిటీప్లానర్ ప్రదీప్‌కుమార్, ఈఈ ఎ.ఉదయ్‌కుమార్, ఉద్యాన శాఖ అధికారి జీపీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి పల్లెకూ బస్సు
- రూ.150 కోట్లతో బస్సుల కొనుగోలు - 14 తర్వాత టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు - రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు బస్సులు వెళ్లని గ్రామాలు 1300 వరకు ఉన్నాయని, ఇకపై ప్రతి పల్లెకూ బస్సు నడుపుతామని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చెప్పారు. అన్ని గ్రామాలకు బస్సులు నడిపేలా రోడ్లు అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 30 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి వద్ద రూ. 63 లక్షలతో నిర్మించిన రవాణాశాఖ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బస్సుల కొనుగోలుకు ఆర్టీసీకి సీఎం కేసీఆర్ రూ.150 కోట్లు కేటాయించారని, ఆ నిధులతో 400 పల్లెవెలుగు, 100 ఏసీ బస్సులు కొనుగోలు చేస్తామని వివరించారు. రాష్ట్రంలో 49 రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయని, అందులో 11 మాత్రమే సొంత భవనాలున్నాయని, మిగతా 38 ఆఫీసుల భవన నిర్మాణానికి చర్య లు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రమాదాల నివారణకు రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 14 తరువాత తెలంగాణ రవాణా సంస్థ ఏర్పాటవుతుందని తెలిపారు. జిల్లాలో ఆరు బస్‌డిపోల ద్వారా 600 బస్సులు నడుస్తున్నాయని, రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ కోరిక మేరకు కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు రెండు ఏసీ బస్సులు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. విప్ గంప గోవర్థన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని గ్రామాలకు రోడ్డు వసతులు మెరుగు పడినందున, రవాణా సౌకార్యాలను అభివృద్ధి చేయూల్సిన అవసరం ఉందని అన్నారు. కామారెడ్డి డిపోకు కొత్తగా నాలుగు డీలక్స్ బస్సులు కేటాయించాలని మంత్రిని కోరారు. నియోజక వర్గం లో మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన బస్టాండ్లు దుర్భర స్థితిలో ఉన్నాయని, వాటి మరమ్మతులకు నిధులు కేటాయించాలని అన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ కమిషనర్ రాజారత్నం, ఆర్టీసీ ఈడీ పురుషోత్తం, ఆర్ఎం రమాకాంత్, కామారెడ్డి ఎంవీఐ పాపారావ్, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దిన్, ఆర్డీవో నగేశ్, డీఎస్పీ భాస్కర్, ఎంపీపీ లద్దూరి మంగమ్మ లక్ష్మిపతి, జడ్పీటీసీ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
నాణ్యత లోపిస్తే సహించేది లేదు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో చేపట్టే పంచాయతీ రాజ్ రోడ్ల పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పీఆర్ ఇంజినీర్లను ఆదేశించారు. జిల్లాలో చేపట్టనున్న పీఆర్ రోడ్ల నిర్మాణ పనులపై శనివారం సచివాలయంలో రవాణా శాఖా మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రూ.220 కోట్లతో 1,303 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని, బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లకు పనులు అప్పగించకూడదని అధికారులను హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌కు గేట్‌వే లాంటిదని, ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో కొత్తగా పీఆర్, ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణంపై ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రెండు శాఖలను కలుపుతూ రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్పొరేషన్ ద్వారా నిధులు సమకూర్చేందుకు గాను ప్రత్యేకంగా బాండ్లను జారీ చేస్తామన్నారు. 2009 క్రితం నిర్మించిన బీటీ రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు ఇప్పటికే టెండర్లను పిలవడం పూర్తయిందన్నారు. సంబంధిత పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో శిథిలావస్థలో ఉన్న వంతెనల వివరాలు అందిస్తే వాటి మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. మండల కేంద్రాల నుంచి ఆర్ అండ్ బీ రోడ్డు వరకు రెండు లేన్ల రోడ్డు ఉండేలా చూడాలన్నారు. తాండూరు, పరిగితోపాటు ఇతర నియోజకవర్గాల్లో రోడ్డు సౌకర్యం లేని గిరిజన తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో గతంలో ఎప్పుడూ లేనంతగా పీఆర్ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.220 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని వివరించారు. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో మొత్తం 540 రోడ్డు పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రోడ్ల నిర్మాణ పనులతో గ్రామీణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పల్లె టు పట్నం
నిజామాబాద్ సిటీ: జిల్లాలో రహదారులకు మహర్దశ పట్టనుంది. ప్రతి జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన మేరకు జిల్లాలోని రోడ్ల రూపురేఖలు మారిపోతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్‌శాఖ పరిధిలోని రోడ్లు అభివృద్ధి చెందుతాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ రోడ్లు వాహనాల రద్దీతో ఇరుకుగా మారి ప్రయాణానికి ఇబ్బం దిగా మారాయి. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రెండులైన్ల రహదారులు నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గ్రామీణులు ఆనందపడుతున్నారు. ప్రస్తుతం సింగల్ లైన్ రోడ్డు ఉండటంతో గ్రామీణులు జిల్లా కేం ద్రానికి చేరుకోవాలంటే ఎంతో ప్రయాస పడా ల్సి వస్తోంది. రెండులైన్ల రోడ్లు నిర్మిస్తే ప్రమాదాలు తగ్గడమే కాకుండా ప్రయాణ భారం కూడా తగ్గిపోతుంది. జాతీయ రహదారుల విస్తరణ, రాష్ట్ర రహదారులను మెరుగుపరిచిన నేపథ్యంలో జిల్లాలోని భిక్కనూర్, కామారెడ్డి, సదాశివనగర్, డిచ్పల్లి, జక్రాన్‌పల్లి, ఆర్మూర్, బా ల్కొండ మండలాల కేంద్రాల రోడ్లు బాగుపడ్డాయి. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న మండల కేంద్రాలకే ఈ అవకాశం దక్కినట్లయ్యింది. కాగా జాతీయ, రాష్ట్ర రహ దారులకు దూరంగా ఉన్న మండలాలలో రోడ్లు అభివృద్ధికి నోచుకోకుండా పోయాయి. దీంతో అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రెండు లైన్ల రోడ్లు నిర్మిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెరిగిన ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని సింగిల్ లైన్ రోడ్డును డబుల్ లైన్ రోడ్డుగా, డబుల్‌లైన్ ఉన్న రోడ్డును నాలుగు లైన్ల రోడ్డు గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఆర్అండ్బీ అధికారులు హైదరాబాద్‌లోని ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యా ల యానికి ప్రతిపాదనలు పం పారు. నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు రూపొందించారు. రోడ్లతో పాటు కొత్తగా వంతెనల నిర్మాణాలు చేపట్టనున్నారు. నాగిరెడ్డిపేట్, తాడ్వాయి, దోమకొండ, మాచారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుంద, నిజాంసాగర్, పిట్లం, బీర్కూర్, మద్నూర్, బాన్సువాడ, వర్ని, కోటగిరి, బోధన్, రెంజల్, నవీపేట్, నం దిపేట్, మాక్లూర్ మండలాలు జాతీయ రోడ్లకు దూరంగా ఉండటంతో ఇక్కడి రోడ్లు అభివృద్ధికి నోచుకోకుండా పోయాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మారుమూల రోడ్లు సైతం బాగుపడనున్నాయి. జిల్లాలో రోడ్లు అభివృద్ధి చేస్తే వాటిపై కొత్తగా 32 బ్రిడ్జి లు నిర్మించవలసి ఉంటుందని అధికారులు ప్రతిపాదించారు. -
ఇక రోడ్ల విస్తరణ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి ఉన్న రహదారులను డబుల్ లైన్ రోడ్లుగా విస్తరించాలని నిర్ణయించింది. అదేవిధంగా జిల్లా కేంద్రం నుంచి రాజధానికి వెళ్లే ప్రధాన రోడ్డు మార్గాలను నాలుగులైన్లుగా వెడల్పు చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు పంపాలని ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ నుంచి జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ ఆదేశాలు అందాయి. ఈ నెల 12 మెమో నం.120614 జారీ అయింది. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉండే జిల్లా పరిషత్ రోడ్లను కూడా ఆర్అండ్బీ పరిధిలోకి తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది. ఒక్కో నియోజకవర్గానికి 200 కిలోమీటర్ల చొప్పున జెడ్పీ రోడ్లను ఆర్అండ్బీ పరిధిలోకి తీసుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మేజర్ గ్రామపంచాయతీలను కలుపుతూ ఉండే రోడ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే వాహనాల రాకపోకలు అధికంగా ఉన్న రహదారులు, పర్యాటక, యాత్ర స్థలాలను కలుపు ఉన్న రోడ్లను ఆర్అండ్బీ పరిధిలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఈ నిర్ణయంపై ఆయా జిల్లా పరిషత్‌ల తీర్మానం తప్పనిసరి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు రహదారుల విస్తరణకు సంబంధించి వచ్చిన ఆదేశాల మేరకు ఆర్అండ్బీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్ల విస్తరణకు సంబంధించి పనుల అంచనాలను రూపొందించారు. ఇలా ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ రోడ్ల విస్తరణకు రూ.355 కోట్ల నిధులు అవసరముంటుందని ప్రాథమికంగా అంచనా కొచ్చారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి రూ.261 కోట్ల నిధులు అవసరమని గుర్తించారు. రెండింతలు కానున్న ఆర్అండ్బీ రోడ్ల పొడవు జిల్లా పరిషత్ రోడ్లను ఆర్అండ్బీ పరిధిలోకి తీసుకునే అంశంపై కూడా ఆర్అండ్బీ అధికారులు కసరత్తు పూర్తి చేస్తున్నారు. దీంతో ఆర్అండ్బీ రోడ్ల సంఖ్య, పొడవు రెండింతలయ్యే అవకాశాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లానే పరిశీలిస్తే.. ప్రస్తుతం జిల్లాలో అర్అండ్బీ పరిధిలో 2,9037 కిలోమీటర్ల పొడువున రోడ్లు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గానికి 200 కిలోమీటర్ల చొప్పున జిల్లా పరిషత్ రోడ్లను ఆర్‌అండ్‌బీలోకి తీసుకుంటే అదనంగా 2వేల కిలో మీటర్లు ఆర్అండ్బీ రోడ్ల పొడవు పెరిగే అవకాశాలున్నాయి. ఈ నిర్ణయం అమలులోకి వస్తే పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉండే రోడ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. కొన్ని డివిజన్లలో అసలు పీఆర్ రోడ్లే ఉండే అవకాశాలుండవని పంచాయతీరాజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. నియోజకవర్గానికి 200 కిలో మీటర్ల చొప్పున కాకపోయినా కొన్ని ప్రధాన రహదారులను మాత్రమే ప్రభుత్వం ఆర్అండ్బీ పరిధిలోకి తీసుకుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రం నిధులపై ప్రభావం జిల్లా పరిషత్ రోడ్లన్నీ ఆర్అండ్బీ పరిధిలోకి వెళితే కేంద్రం నుంచి వచ్చే నిధులపై ప్రభావం పడుతుందని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. పంచాయతీరాజ్ రోడ్ల నిర్వహణకు ఏటా కేంద్రం పీఎంజీఎస్‌వై, నాబార్డు వంటి పథకాల కింద నిధులు మంజూరు చేస్తుంది. జెడ్పీ రోడ్లన్నీ ఆర్అండ్బీ పరిధిలోకి వెళితే ఇలా కేంద్రం నుంచి వచ్చే నిధులు తగ్గే అవకాశాలున్నాయని పంచాయతీరాజ్ శాఖ అధికారులు అభిప్రాయ పడుతున్నారు.