- రూ.150 కోట్లతో బస్సుల కొనుగోలు
- 14 తర్వాత టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు
- రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు బస్సులు వెళ్లని గ్రామాలు 1300 వరకు ఉన్నాయని, ఇకపై ప్రతి పల్లెకూ బస్సు నడుపుతామని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చెప్పారు. అన్ని గ్రామాలకు బస్సులు నడిపేలా రోడ్లు అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 30 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి వద్ద రూ. 63 లక్షలతో నిర్మించిన రవాణాశాఖ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బస్సుల కొనుగోలుకు ఆర్టీసీకి సీఎం కేసీఆర్ రూ.150 కోట్లు కేటాయించారని, ఆ నిధులతో 400 పల్లెవెలుగు, 100 ఏసీ బస్సులు కొనుగోలు చేస్తామని వివరించారు.
రాష్ట్రంలో 49 రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయని, అందులో 11 మాత్రమే సొంత భవనాలున్నాయని, మిగతా 38 ఆఫీసుల భవన నిర్మాణానికి చర్య లు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రమాదాల నివారణకు రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 14 తరువాత తెలంగాణ రవాణా సంస్థ ఏర్పాటవుతుందని తెలిపారు. జిల్లాలో ఆరు బస్‌డిపోల ద్వారా 600 బస్సులు నడుస్తున్నాయని, రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ కోరిక మేరకు కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు రెండు ఏసీ బస్సులు మంజూరు చేయనున్నట్టు తెలిపారు.
విప్ గంప గోవర్థన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని గ్రామాలకు రోడ్డు వసతులు మెరుగు పడినందున, రవాణా సౌకార్యాలను అభివృద్ధి చేయూల్సిన అవసరం ఉందని అన్నారు. కామారెడ్డి డిపోకు కొత్తగా నాలుగు డీలక్స్ బస్సులు కేటాయించాలని మంత్రిని కోరారు. నియోజక వర్గం లో మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన బస్టాండ్‌లు దుర్భర స్థితిలో ఉన్నాయని, వాటి మరమ్మతులకు నిధులు కేటాయించాలని అన్నారు.
కార్యక్రమంలో రవాణా శాఖ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ కమిషనర్ రాజారత్నం, ఆర్టీసీ ఈడీ పురుషోత్తం, ఆర్‌ఎం రమాకాంత్, కామారెడ్డి ఎంవీఐ పాపారావ్, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దిన్, ఆర్డీవో నగేశ్, డీఎస్పీ భాస్కర్, ఎంపీపీ లద్దూరి మంగమ్మ లక్ష్మిపతి, జడ్పీటీసీ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రతి పల్లెకూ బస్సు
Published Fri, May 8 2015 3:23 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM
Advertisement
Advertisement