సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో చేపట్టే పంచాయతీ రాజ్ రోడ్ల పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పీఆర్ ఇంజినీర్లను ఆదేశించారు. జిల్లాలో చేపట్టనున్న పీఆర్ రోడ్ల నిర్మాణ పనులపై శనివారం సచివాలయంలో రవాణా శాఖా మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రూ.220 కోట్లతో 1,303 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని, బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లకు పనులు అప్పగించకూడదని అధికారులను హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌కు గేట్‌వే లాంటిదని, ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో కొత్తగా పీఆర్, ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణంపై ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రెండు శాఖలను కలుపుతూ రూరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్పొరేషన్ ద్వారా నిధులు సమకూర్చేందుకు గాను ప్రత్యేకంగా బాండ్లను జారీ చేస్తామన్నారు. 2009 క్రితం నిర్మించిన బీటీ రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు ఇప్పటికే టెండర్లను పిలవడం పూర్తయిందన్నారు. సంబంధిత పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో శిథిలావస్థలో ఉన్న వంతెనల వివరాలు అందిస్తే వాటి మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. మండల కేంద్రాల నుంచి ఆర్ అండ్ బీ రోడ్డు వరకు రెండు లేన్ల రోడ్డు ఉండేలా చూడాలన్నారు.
తాండూరు, పరిగితోపాటు ఇతర నియోజకవర్గాల్లో రోడ్డు సౌకర్యం లేని గిరిజన తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో గతంలో ఎప్పుడూ లేనంతగా పీఆర్ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.220 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని వివరించారు. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో మొత్తం 540 రోడ్డు పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రోడ్ల నిర్మాణ పనులతో గ్రామీణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నాణ్యత లోపిస్తే సహించేది లేదు
Published Sun, Nov 23 2014 12:03 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement