సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పాడైన రోడ్లకు అతిత్వరలో మరమ్మతులు చేపట్టనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకుగాను జిల్లాకు రూ.40 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మంగళవారం మంత్రి తన చాంబర్లో పంచాయతీరాజ్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన రూ.40 కోట్లను ప్రాధాన్యత క్రమంలో మండలాల వారీగా విభజించాలన్నారు.
వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో భాగంగా జిల్లాకు విడుదలైన రూ.57కోట్లతో చేపట్టే 11 రోడ్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియ త్వరితంగా పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా ఆర్‌డీఎఫ్ కింద చేపట్టే 76 పనుల పురోగతిని వేగిరం చేయాలన్నారు. జిల్లాలో 942 పాఠశాలల్లో వంట గదుల పనులు వీలైనంత వేగంగా పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఇంజనీరు మిల్టన్, జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
58 చెరువులకు మరమ్మతులు..
భారీ వర్షాల కారణంగా జిల్లాలో 58 చెరువుల దెబ్బతిన్నాయని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. వీటి మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు ట్రిపుల్‌ఆర్ ఫేజ్-2లో భాగంగా 31.21 కోట్లతో 80 పనులు చేపట్టగా.. ఇందులో 16 పనులు మాత్రమే పూర్తయ్యాయని, మిగతా పనులను త్వరితంగా పూర్తిచేయాలన్నారు.
పనులు సకాలంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. భూసేకరణ సమస్యతో పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయని, ఈ అంశంపై దృష్టిసారించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. మన ఊరు- మన ప్రణాళికలో భాగంగా చెరువులు ఆధునికీకరణ కోసం రూ.70 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్‌ఈ అనిల్, ఈఈలు తదితరులు పాల్గొన్నారు.
రోడ్ల మరమ్మతులకు రూ.40 కోట్లు
Published Tue, Sep 16 2014 11:51 PM | Last Updated on Thu, Aug 30 2018 3:51 PM
Advertisement
Advertisement