సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి ఉన్న రహదారులను డబుల్ లైన్ రోడ్లుగా విస్తరించాలని నిర్ణయించింది. అదేవిధంగా జిల్లా కేంద్రం నుంచి రాజధానికి వెళ్లే ప్రధాన రోడ్డు మార్గాలను నాలుగులైన్లుగా వెడల్పు చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు పంపాలని ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ నుంచి జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ ఆదేశాలు అందాయి. ఈ నెల 12 మెమో నం.120614 జారీ అయింది.
అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉండే జిల్లా పరిషత్ రోడ్లను కూడా ఆర్‌అండ్‌బీ పరిధిలోకి తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది. ఒక్కో నియోజకవర్గానికి 200 కిలోమీటర్ల చొప్పున జెడ్పీ రోడ్లను ఆర్‌అండ్‌బీ పరిధిలోకి తీసుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మేజర్ గ్రామపంచాయతీలను కలుపుతూ ఉండే రోడ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే వాహనాల రాకపోకలు అధికంగా ఉన్న రహదారులు, పర్యాటక, యాత్ర స్థలాలను కలుపు ఉన్న రోడ్లను ఆర్‌అండ్‌బీ పరిధిలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఈ నిర్ణయంపై ఆయా జిల్లా పరిషత్‌ల తీర్మానం తప్పనిసరి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు
రహదారుల విస్తరణకు సంబంధించి వచ్చిన ఆదేశాల మేరకు ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్ల విస్తరణకు సంబంధించి పనుల అంచనాలను రూపొందించారు. ఇలా ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ రోడ్ల విస్తరణకు రూ.355 కోట్ల నిధులు అవసరముంటుందని ప్రాథమికంగా అంచనా కొచ్చారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి రూ.261 కోట్ల నిధులు అవసరమని గుర్తించారు.
రెండింతలు కానున్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పొడవు
జిల్లా పరిషత్ రోడ్లను ఆర్‌అండ్‌బీ పరిధిలోకి తీసుకునే అంశంపై కూడా ఆర్‌అండ్‌బీ అధికారులు కసరత్తు పూర్తి చేస్తున్నారు. దీంతో ఆర్‌అండ్‌బీ రోడ్ల సంఖ్య, పొడవు రెండింతలయ్యే అవకాశాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లానే పరిశీలిస్తే.. ప్రస్తుతం జిల్లాలో అర్‌అండ్‌బీ పరిధిలో 2,9037 కిలోమీటర్ల పొడువున రోడ్లు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గానికి 200 కిలోమీటర్ల చొప్పున జిల్లా పరిషత్ రోడ్లను ఆర్‌అండ్‌బీలోకి తీసుకుంటే అదనంగా 2వేల కిలో మీటర్లు ఆర్‌అండ్‌బీ రోడ్ల పొడవు పెరిగే అవకాశాలున్నాయి.
ఈ నిర్ణయం అమలులోకి వస్తే పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉండే రోడ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. కొన్ని డివిజన్లలో అసలు పీఆర్ రోడ్లే ఉండే అవకాశాలుండవని పంచాయతీరాజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. నియోజకవర్గానికి 200 కిలో మీటర్ల చొప్పున కాకపోయినా కొన్ని ప్రధాన రహదారులను మాత్రమే ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ పరిధిలోకి తీసుకుంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
కేంద్రం నిధులపై ప్రభావం
జిల్లా పరిషత్ రోడ్లన్నీ ఆర్‌అండ్‌బీ పరిధిలోకి వెళితే కేంద్రం నుంచి వచ్చే నిధులపై ప్రభావం పడుతుందని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. పంచాయతీరాజ్ రోడ్ల నిర్వహణకు ఏటా కేంద్రం పీఎంజీఎస్‌వై, నాబార్డు వంటి పథకాల కింద నిధులు మంజూరు చేస్తుంది. జెడ్పీ రోడ్లన్నీ ఆర్‌అండ్‌బీ పరిధిలోకి వెళితే ఇలా కేంద్రం నుంచి వచ్చే నిధులు తగ్గే అవకాశాలున్నాయని పంచాయతీరాజ్ శాఖ అధికారులు అభిప్రాయ పడుతున్నారు.
ఇక రోడ్ల విస్తరణ
Published Tue, Jul 8 2014 12:05 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement