మంగళవారం జూరాల గేట్లు తెరవడంతో శ్రీశైలం వైపు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ
సాక్షి, అమరావతి, నిడదవోలు, ధవళేశ్వరం: పశ్చిమ కనుమల్లో వర్షాలు కొనసాగుతుండటం, నిండుకుండల్లా మారిన ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకి చేరిన వరదను చేరినట్టుగా దిగువకు విడుదల చేస్తుండటంతో కృష్ణా నది పరవళ్లతో పోటెత్తుతోంది. ఆల్మట్టిలోకి 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో అంతే నీటిని నారాయణపూర్‌కు వదులుతున్నారు. నారాయణపూర్ కూడా నిండటంతో 20 గేట్లు ఎత్తివేసి 1.90 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన జూరాలకు వదులుతున్నారు. జూరాలలో జలవిద్యుదు త్పత్తి చేస్తూ 29 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా వరద ప్రవాహం బుధవారం ఉదయానికి శ్రీశైలం చేరనుంది. ప్రస్తుతం శ్రీశైలంలో 885 అడుగులకుగానూ 804 అడుగుల్లో నీటి నిల్వ ఉంది. కృష్ణా ఉప నదులైన తుంగభద్ర, బీమాలో వరద తగ్గుముఖం పట్టింది. తుంగభద్ర జలాశయంలోకి 15,281 క్యూసెక్కులు చేరుతుండగా బీమా నుంచి ఉజ్జయినిలోకి 55,439 క్యూసెక్కులు చేరుతున్నాయి.
కాఫర్ డ్యామ్ మీదుగా గోదావరి వరద భారీ వర్షాలు, ఉప నదులు శబరి, ఇంద్రావతి ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 4.22 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరింది. కాఫర్ డ్యామ్ మీదుగా గోదావరి వరద ప్రవహిస్తోంది. కొత్తూరు కాజ్‌వేను వరద ముంచెత్తడంతో 29 గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,22,117 క్యూసెక్కుల వరద వస్తుండగా 4,22,812 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. డెల్టా కాలువలకు 5,700 క్యూసెక్కులు వదులుతున్నారు. మరో రెండు రోజుల పాటు గోదావరిలో వరద ఉధృతి కొనసాగే అవకాశాలు ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పోలవరం స్పిల్‌వే నుంచి నీరు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రాజెక్టు ఈఈ డి.శ్రీనివాసరావు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం సోమవారం 23.09 అడుగులు ఉండగా మంగళవారం 26.07 అడుగులకు పెరిగింది. ఒడిశాలో వర్షాలతో వంశధారలో వరద మరింత పెరిగింది. గొట్టా బ్యారేజీలోకి సోమవారం రాత్రి ఏడు గంటలకు 11,722 క్యూసెక్కులు చేరుతుండగా 6,971 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment