ఫలించిన కల
టీటీడీ చైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తి
16 మంది సభ్యులతో నూతన ధర్మకర్తల మండలి
పవన్ కోటాలో పసుపులేటి హరిప్రసాద్‌కు చాన్స్
వెంకయ్యనాయుడి అండదండలున్నా భానుప్రకాష్‌రెడ్డికి మిస్
తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి పది నెలల తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. చైర్మన్‌గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నియమితులయ్యారు. సభ్యులుగా బోత్ ఆస్పత్రి అధినేత డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్(పవన్ కల్యాణ్ సన్నిహితుడు) నియమితులయ్యారు. మొత్తం 16 మందితో కొత్త ధర్మకర్తల మండలిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి అండదండలతో సభ్యుడవుతారని ప్రచారం జరిగిన తిరుపతి బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డికి అవకాశం దక్కలేదు. ప్రత్యామ్నాయంగా ఆయన్ను తుడా చైర్మన్‌గా నియమించే అవకాశం ఉందని ప్రచారం.
తిరుమల: అంతర్జాతీయ ప్రఖ్యాతి గడించిన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ఎట్టకేలకు చదలవాడ కృష్ణమూర్తి నియమితులయ్యారు. త్వరలోనే బోర్డు పగ్గాలు చేపట్టనున్నారు. 2014లో తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సీటు చదలవాడకు ఖాయం చేశారు. అయితే చంద్రబాబు రాజకీయ వ్యూహాల్లో భాగంగా చదలవాడకు మొండిచేయి దక్కింది. దీంతో చంద్రబాబుపై చదలవాడ కృష్ణమూర్తి బహిరంగంగా విమర్శలకు దిగారు. దీంతో చదలవాడ విమర్శలు పదునైతే తెలుగుదేశం పార్టీకే నష్టమని అప్పట్లో చంద్రబాబు భావించారు. ఆయనే స్వయంగా రంగంలోకి దిగి చదలవాడ కృష్ణమూర్తితో చర్చించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే టీటీడీ చైర్మన్ పోస్టు కట్టబెడతామని హామీ ఇచ్చారు. అంతటితో ఆగకుండా పార్టీ కార్యాలయం నుంచి ఏకంగా లేఖ కూడా ఇచ్చాడు. అప్పటి రాజకీయ సమీకరణలతోపాటు ఎప్పుడూ హామీ ఇవ్వని చంద్రబాబు స్వయంగా లేఖ పంపడంతో చదలవాడ కృష్ణమూర్తి కొంత మెత్తబడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.
దీంతో తన కల కూడా నెరవేరుతుందని చదలవాడ భావించారు. టీటీడీపై పట్టుసాధించేందుకు అడుగులు వేశారు. అయితే చంద్రబాబు మాత్రం కొత్తబోర్డుకు పచ్చజెండా ఊపలేదు. ఆశావహులు చాలా మంది ఉన్నారంటూ బోర్డు పదవీ కాలపరిమితిని ఏడాదికి కుదించారు. ఒకవైపు పదవి నియామకంపై జాప్యం చేయటం, పదవీ కాలాన్ని ఏడాదికి కుదించడం చదలవాడ కృష్ణమూర్తికి రుచించలేదు. దీంతోపాటు తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(తుడా ) చైర్మన్‌ను కూడా టీటీడీ బోర్డులో ఎక్స్- అఫిషియో సభ్యుడిగా తొలగిస్తూ నిర్ణయించారు. బోర్డు సభ్యులను 18 మందికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో కొత్త బోర్డు దాదాపుగా ఖరారైపోతుందని తెలుగుతమ్ముళ్లు రోజులు, వారాలు, నెలలుగా నిరీక్షించారు. పలుమార్లు హైదబాద్‌లో చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేష్‌ను కూడా చదలవాడ కలసి పరిస్థితిని వివరించే ప్రయత్నాలు చేశారు. చివరకు టీటీడీకి కొత్తబోర్డు నియామకంపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పది నెలల నిరీక్షణ తర్వాత చదలవాడ కృష్ణమూర్తి బోర్డు పగ్గాలు చేపట్టబోతున్నారు.
పవన్ కోటాలో ‘పసుపులేటి’కి ఛాన్స్
తిరుపతి బోత్ ఆస్పత్రి అధినేత డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్‌కు చిరంజీవి కుటుంబంతో తొలి నుంచి మంచి సంబంధాలున్నాయి. 2008లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంలో ఈయన కీలకపాత్ర పోషించారు. పవన్‌కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర వేసుకున్నారు. గతంలో తిరుపతి సీటును ఆశించారు. వికృతమాలలో తన ఇష్టదైవమైన సంతాన సంపద వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి, తద్వారా సమాజ, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం అధికారంలోకి రావడంలో సినీనటుడు పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఆయన అండదండలతో పసుపులేటి హరిప్రసాద్ టీటీడీ బోర్డు పదవి కోసం తన ప్రయత్నాలు సాగించారు. సహజంగా సిఫారసు విషయంలో ఆచితూచి వ్యహరించే పవన్ కల్యాణ్ తొలిసారిగా పసుపులేటి పేరును సిఫారసు చేయడంతో టీటీడీ బోర్డులో నియమితులయ్యారు.
బాధ్యత పెరిగింది
‘టీటీడీ బోర్డు అంటేనే ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది. అందులో స్థానం లభించడంంతో బాధ్యత పెరిగినట్టైంది. మంచివారికి దేవుడు సాయం చేస్తాడు. ఆ దేవుడే పవన్‌కల్యాణ్‌గారి రూపంలో వచ్చినట్టైంది. ఆయన నమ్మకాన్ని నిలబెడతాను. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తాను’ - డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
కొత్త బోర్డు ఇదే
1.చదలవాడ కృష్ణమూర్తి (చైర్మన్), 2.కోళ్ల లలితకుమారి (ఎమ్మెల్యే, శృంగవరపుకోట- విజయనగరం),3. పిల్లి అనంత లక్ష్మి(ఎమ్మెల్యే,కాకినాడ-తూ.గో), 4.డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి (ఎమ్మెల్యే, కొండెపి- ప్రకాశం జిల్లా ), 5. పుట్టా సుధాకర్ యాదవ్(మైదుకూరు, వైఎస్‌ఆర్ కడప జిల్లా),6. సండ్ర వెంకట వీరయ్య(ఎమ్మెల్యే, సత్తుపల్లి- తెలంగాణ), 7.జి.సాయన్న (ఎమ్మెల్యే, కంటోన్మెంట్- తెలంగాణ), 8.ఏవీ రమణ,9. వి.కృష్ణమూర్తి (రిటైర్డ్ ఉద్యోగి, తమిళనాడు), 10. జె.శేఖర్( తమిళనాడు), 11. డీపీ అనంత (గుజరాత్), 12. సుచిత్ర యల్లా, 13.కె.రాఘవేంద్రరావు(సినీ దర్శకుడు), 14.సంపత్ రవి నారాయణన్(పారిశ్రామిక వేత్త, బెంగళూరు), 15.పి.హరిప్రసాద్(వైద్యరంగం), ఎక్స్-అఫిషియో సభ్యులుగా ముగ్గురిలో ఎండోమెంట్ ముఖ్య కార్యదర్శి, ఎండోమెంట్ కమిషనర్, టీటీడీ ఈవో ఉన్నారు.