అడిగింది కొండంత.. ఇచ్చింది గోరంత | Krishna Pushkarni Rs .231 crore funds relese | Sakshi
Sakshi News home page

అడిగింది కొండంత.. ఇచ్చింది గోరంత

Published Sun, Apr 10 2016 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

Krishna Pushkarni Rs .231 crore funds relese

కృష్ణా పుష్కరాలకు విదిల్చింది కేవలం రూ.231 కోట్లే
ఈ నిధులతో కొత్త ఘాట్ల నిర్మాణం అనుమానమే

 
సాక్షి, విజయవాడ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న కృష్ణా పుష్కరాలల్లో నీటిపారుదలశాఖ పనులకు ప్రభుత్వం రూ.231 కోట్లు కేటాయించింది. ఈ రూ.231 కోట్లు ఒక్క కృష్ణా జిల్లాకే అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇందులో కృష్ణా జిల్లాకు కేవలం రూ.142 కోట్లు (ఇందులో రూ.66 కోట్లు వీఎంసీ ఖాతాకు), గుంటూరు జిల్లాకు రూ.65 కోట్లు, కర్నూలుకు రూ.24 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


 అడిగింది కొండంత..
పుష్కరాల కోసం కృష్ణాజిల్లాలోని 118 పుష్కర ఘాట్లను అభివృద్ధి చేసేందుకు రూ.393.60 కోట్లు, అలాగే గుంటూరు జిల్లాలోని 95 ఘాట్ల మరమ్మతులకు రూ.59.56 కోట్లు కావాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. కాగా కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని మొత్తం 222 ఘాట్ల పునరుద్ధరణకు రూ.468.87 కోట్లు కావాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ప్రభుత్వం అన్ని జిల్లాలకు కలిపి కేవలం రూ.231 కోట్లు విదిల్చింది. ఈ మొత్తంతోనే 222 పుష్కర ఘాట్లను అభివృద్ధి చేయాల్సి ఉంది. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు తప్ప మొత్తం అన్ని ఘాట్లను ఎప్పుడూ ఉపయోగించరు. మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో కూడా ముఖ్యమైన కొన్ని ఘాట్లే వినియోగిస్తారు.

అందువల్ల చాలా ఘాట్లలో సిమెంట్ ఫ్లోరింగ్, మెట్లు దెబ్బతిన్నాయి. వీటికి మరమ్మతులు చేయాల్సి ఉంది. అలాగే దివిసీమలో కొత్తగా ఘాట్లు ఏర్పాటు చేయాలనిడిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.231 కోట్లతో పనులు అరకొరగానే జరిగే అవకాశం కనపడుతోంది.

 చైనా టెక్నాలజీ వినియోగం..
హెడ్ వాటర్‌వర్క్ నుంచి ఫెర్రీ వరకు సుమారు 12 కి.మీ పొడవునా చైనా నిపుణుల సహకారంతో కొత్త ఘాట్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.  వీటి విషయం అటుంచితే ముందుగా ప్రకాశం బ్యారేజ్‌నుంచి దిగువన ఉన్న ఘాట్లకు మరమ్మతులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. వీటికి సంబంధించి టెండర్లు త్వరలోనే ఖరారు చేసి పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement