
సాక్షి, అమరావతి: కృష్ణానది మహోగ్రరూపం దాల్చుతోంది. దివిసీమను వరద ముంపు చుట్టుముట్టతోంది. భారీ వరదతో శనివారం ఉదయానికి పులిగడ్డ ఆక్విడెక్ట్ వద్ద 19 అడుగులకుపైగా వరద ప్రవహిస్తోంది. దీంతో పులిగడ్డ ఆక్విడెక్ట్ పూర్తిగా నీట మునిగి.. రెండు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. గడిచిన పదేళ్లలో పులిగడ్డ అక్విడెక్టు తొలిసారి వరదనీటిలో మునిగింది. మోపిదేవి వార్పు నుండి పులిగడ్డ హెడ్ రెగ్యులేటర్ వరకు కృష్ణా నది ఏకమై ప్రవహిస్తుంది. గడిచిన నాలుగు రోజులతో పోలిస్తే వరద ఉధృతి పెరగడంతో పలు గ్రామాలు నీట మునిగాయి. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వరద పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
పులిగడ్డ పల్లెపాలెంలో చేరిన వరదనీటి ప్రవాహానికి ఆవాసప్రాంతాలు నీటమునిగాయి. 50 కుటుంబాల ప్రజలు వరదనీటితో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరదనీరు ఉధృతి విపరీతంగా పెరిగిపోవటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదలవుతున్న వరద ప్రవాహాన్ని పంటకాలువల్లోకి మళ్లిస్తున్నారు. బ్యారేజీలోకి 8 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉండటంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలు ముంపు బారిన పడకుండా రక్షించేందుకు కృష్ణా నదిపై జలవనరుల శాఖ డ్రోన్‌లను మోహరించింది. వరదను ఎప్పటికప్పుడు విశ్లేషించడానికి డ్రోన్‌లను వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment