puligadda
-
పోటెత్తిన కృష్ణ: పదేళ్ల తరవాత నీట మునిగిన పులిగడ్డ
సాక్షి, అమరావతి: కృష్ణానది మహోగ్రరూపం దాల్చుతోంది. దివిసీమను వరద ముంపు చుట్టుముట్టతోంది. భారీ వరదతో శనివారం ఉదయానికి పులిగడ్డ ఆక్విడెక్ట్ వద్ద 19 అడుగులకుపైగా వరద ప్రవహిస్తోంది. దీంతో పులిగడ్డ ఆక్విడెక్ట్ పూర్తిగా నీట మునిగి.. రెండు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. గడిచిన పదేళ్లలో పులిగడ్డ అక్విడెక్టు తొలిసారి వరదనీటిలో మునిగింది. మోపిదేవి వార్పు నుండి పులిగడ్డ హెడ్ రెగ్యులేటర్ వరకు కృష్ణా నది ఏకమై ప్రవహిస్తుంది. గడిచిన నాలుగు రోజులతో పోలిస్తే వరద ఉధృతి పెరగడంతో పలు గ్రామాలు నీట మునిగాయి. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వరద పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పులిగడ్డ పల్లెపాలెంలో చేరిన వరదనీటి ప్రవాహానికి ఆవాసప్రాంతాలు నీటమునిగాయి. 50 కుటుంబాల ప్రజలు వరదనీటితో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరదనీరు ఉధృతి విపరీతంగా పెరిగిపోవటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదలవుతున్న వరద ప్రవాహాన్ని పంటకాలువల్లోకి మళ్లిస్తున్నారు. బ్యారేజీలోకి 8 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉండటంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలు ముంపు బారిన పడకుండా రక్షించేందుకు కృష్ణా నదిపై జలవనరుల శాఖ డ్రోన్లను మోహరించింది. వరదను ఎప్పటికప్పుడు విశ్లేషించడానికి డ్రోన్లను వినియోగిస్తున్నారు. కృష్ణా మహోగ్రం: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హైఅలర్ట్ -
‘దివి’ గుండెచప్పుడు వైఎస్!
సాక్షి, అవనిగడ్డ: దివిసీమ ప్రజల గుండెలో మహానేత వైఎస్ సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. ఆధునికీకరణ పనుల ద్వారా సాగునీటి కష్టాలు తొలగించి, రైతులకు వందేళ్ల భరోసా ఇచ్చేందుకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. అడగకుండానే విజయవాడ – పులిగడ్డ డబుల్ లైన్ కరకట్టకు నిధులు మంజూరు చేశారు. దివిసీమలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేసి చెరగని ముద్ర వేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2006 నవంబర్ 2వ తేదీన ఓగ్ని తుఫాన్ ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి అవనిగడ్డ వచ్చారు. 60 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కుంభవృష్టి వర్షాలు పడ్డాయి. ఈ వర్షపాతం కంటే 25 శాతం అధికంగా వచ్చినా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డెల్టాను ఆధునికీకరిస్తానని వైఎస్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడే ఆయన డెల్టా ఆధునికీకరణకు రూ.4,576 కోట్లు మంజూరు చేశారు. 2008 జూన్ 6న అవనిగడ్డ మండలం పులిగడ్డ వార్పు వద్ద పనులకు శంకుస్థాపన చేశారు. 150 ఏళ్ల కృష్ణా డెల్టా చరిత్రలోనే అత్యధిక నిధులు కేటాయించిన ముఖ్యమంత్రిగా వైఎస్ చరిత్ర పుటల్లో నిలిచారు. చిత్తరువుని చూసి మురిసిన వైఎస్.. కృష్ణా జిల్లాలో రూ.2,180 కోట్లు, అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.547.93 కోట్లు డెల్టా ఆధునికీకరణ పనులు జరిగాయి. పులిగడ్డ వార్పు వద్ద ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫలకంపై వైఎస్ పలుగు పట్టుకుని గాతవేస్తున్న ప్లాస్టరాఫ్ ప్యారిస్ చిత్తరువు మహానేతను అచ్చుగుద్దినట్టు ఉంటుంది. శంకుస్థాపన మహోత్సవానికి వచ్చిన వైఎస్ తన చిత్తరువుని చూసి ఎంతో మురిసిపోయారు. అడగకుండానే దివిసీమకు వరాలు దివిసీమకు వైఎస్ అడగకుండానే ఎన్నో వరాలు అందించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.590 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. రాష్ట్రంలోనే తొలి ఫిషరీస్ కళాశాలను నాగాయలంక మండలంలోని భావదేవరపల్లిలో ఏర్పాటు చేశారు. రూ.35 కోట్లతో అవనిగడ్డలో 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు వైఎస్ హయాంలోనే జరిగింది. రూ.40 కోట్లతో నాగాయలంక మండలం గుల్లలమోద నుంచి కోడూరు మండలం సాలెంపాలెం వరకూ సముద్ర కరకట్టను అభివృద్ధి చేశారు. అశ్వరావుపాలెం – మందపాకల పంట కాల్వ ఏర్పాటుతో పాటు, జరిగిన కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు దివిసీమ ప్రజల గుండెల్లో వైఎస్‌కు చెరగని ముద్ర వేశాయి. ఉల్లిపాలెం వారధికి అప్పుడే అంకురార్పణ.. ఉల్లిపాలెం – భవానీపురం వారధికి వైఎస్ హయాంలోనే అంకురార్పణ జరిగింది. ఈ వారధి కోసం రూ.32 కోట్లకు ప్రతిపాదనలు ఆమోదించారు. ఈ వారధి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వైఎస్ సమాయత్తమవగా ఎన్నికల కోడ్ రావడంతో కార్యక్రమం నిలిచిపోయింది. ఆ తర్వాత పలు దఫాలుగా అంచనాలు పెంచి వారధిని నిర్మించారు. -
రాష్ట్రంలో 13 వేల శ్మశానవాటికల అభివృద్ధి
అవనిగడ్డ : రాష్ట్రంలోని 13 వేల శ్మశానవాటికలను (ఒక్కోదానికి రూ.10 లక్షల చొప్పున) అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. అవనిగడ్డ మండల పరిధిలోని పులిగడ్డలో రూ.1.10 కోట్లతో నిర్మించనున్న వంతెన, రహదారి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 2,500 పంచాయతీల్లో ఒక్కోదానికి రూ.15 లక్షలతో గ్రామ సచివాలయాలను నిర్మించనున్నట్టు చెప్పారు. భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు పంచాయతీలు 30 శాతం నిధులు సమకూర్చుకుంటే మిగిలిన 70 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 53 లక్షల గృహాలకు ఇంకా మరుగుదొడ్లు లేవని, 2019 నాటికి నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. స్వచ్ఛభారత్ నిర్వహించే గ్రామాలకు నిధుల మంజూరులో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 4,500 కిలోమీటర్ల మేర సీసీ రహదారుల నిర్మాణం పూర్తికాగా, మరో 2,600 కిలోమీటర్లలో నిర్మాణ దశలో ఉన్నాయని వెల్లడించారు. ఇంకో 2,400 కిలోమీటర్ల మేర సీసీ రహదారులను నిర్మించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. తొలుత రూ.27.5 లక్షల వ్యయంతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని మంత్రి చింతకాయల ప్రారంభించారు. కార్యక్రమంలో బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, స్వచ్ఛభారత్ మిషన్ రాష్ట్ర అంబాసిడర్ డాక్టర్ సీఎల్ రావ్ తదితరులు పాల్గొన్నారు.