వైభవంగా శ్రీశైలేశునికి సహస్ర ఘటాభిషేకం
శ్రీశైలం: సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీశైల మల్లికార్జున స్వామికి శనివారం సహస్రఘటాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకు ముందు పాతాళగంగ నుంచి బిందెలతో పవిత్ర కృష్ణా నదీ జలాలను ఊరేగింపుగా తీసుకొచ్చి క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామికి, గ్రామ దేవత అంకాలమ్మకు, నంది మండపంలో కొలువుదీరిన నందీశ్వరుడికి అభిషేకించారు.
అనంతరం ఆలయ ప్రాంగణం చేరుకుని శ్రీవృద్ధమల్లికార్జున స్వామివార్ల ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన సహస్రకలశాలలో పవిత్ర పాతాళగంగ జలంతో పాటు మల్లికాగుండంలోని నీటిని మంత్రోచ్ఛరణలతో అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తపూజలతో అభిమంత్రించారు. ఏకాదశ రుద్ర కలశస్థాపన చేసిన తర్వాత 1,008 కలశాలలోని నీటిని స్వామివార్ల మూలవిరాట్‌కు సహస్రఘటాభిషేకాన్ని నిర్వహించారు. మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ పూజా వేళల్లో మార్పు చేశారు. అలాగే స్వామివార్ల సుప్రభాతసేవ, మహామంగళ హారతి, గర్భాలయంలో జరిగే అభిషేకాలను నిలుపుదల చేసినట్లు ఈఓ తెలిపారు.