సాక్షి, అమరావతి : గోదావరి బోటు ప్రమాదంపై విచారణ కొనసాగుతుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అలాగే బోటును బయటకు తీసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. బోటు ప్రమాదం జరిగిన సమయంలో పలువురు పర్యాటకులను కాపాడిన స్థానికులకు రూ. 25వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద రాయల్ వశిష్ట పున్నమి ప్రైవేట్ బోటు బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మంత్రి కన్నబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
300 అడుగుల లోతులో కూరుకుపోయిన బోటును వెలికి తీయడం పెద్ద టాస్క్‌గా మారిందని అన్నారు. బోటును వెలికితీసేందుకు నేవీ తీవ్రంగా ప్రయత్నించిన ఫలితం దక్కలేదన్నారు. గోదావరిలో ఇంకా వరద కొనసాగుతుందని తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఇంకా గాలింపు చేపడుతున్నాయని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్, ముంబై, కాకినాడ నుంచి నిపుణులను తీసుకొచ్చినా.. బోటును వెలికితీయలేకపోయామని చెప్పారు. లాంచీ వెలికితీతకు ప్రైవేటు వ్యక్తులు వస్తే అధికారులను సంప్రదించాలని సూచించారు. 2018లో ఇచ్చిన జీవోలో స్పష్టత లేదని.. అందులో బోటింగ్ నిర్వహణ ఎవరి పరిధిలోకి వస్తుందో చెప్పలేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment