వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు
కాకినాడ సిటీ: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదం మానవ తప్పిదమని, ప్రభుత్వ వైఫల్యం కాదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. అయితే ఈ బోటు ప్రమాదంపై టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గురువారం రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియం వద్ద మంత్రి విలేకరులతో మాట్లాడారు. టీడీపీ హయాంలో ఎన్నో బోటు ప్రమాదాలు జరిగాయని, అప్పుడే నిబంధనలు కఠినతరం చేసి ఉంటే ఇప్పుడీ ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. నిమ్మకు నీరెత్తినట్లు పరిపాలన చేసిన చంద్రబాబు.. ఇప్పుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతికి కారణమైన చంద్రబాబు కనీసం ఆ కుటుంబాలకు సంతాపం తెలపలేదని, చుక్క కన్నీరు కార్చలేదన్నారు. పుష్కరాల్లో తొక్కిసలాటకు కారకులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
అలాంటివారు ఇప్పుడు విమర్శలు చేయడం శోచనీయమన్నారు.ప్రమాదంలో నీట మునిగిన బోటును వెలికి తీయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. బోటును వెలికితీయడానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియో రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షలు, ప్రమాదం నుంచి బయటపడిన వారికి రూ.లక్ష చొప్పున సంబంధిత కలెక్టర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇంకా ఆచూకీ లభించని వారికి ఎక్స్‌గ్రేషియో చెల్లింపుతోపాటు మరణ ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆదేశించామన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి బీమా చెల్లింపుకోసం ప్రత్యేక జీవో కూడా ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment