సాక్షి, కాకినాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు అమరావతి అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే.. అక్కడ తాత్కాలిక భవనాలు నిర్మించే వారు కాదని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఆయన ఎందుకు పారిపోయి వచ్చారని ప్రశ్నించారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అమరావతిలో ఉన్న రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుటుందని హామీ ఇచ్చారు. స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు అమరావతిని రాజధానిని చేశారని విమర్శించారు.
‘అమరావతిని నిజంగా అభివృద్ది చేసి ఉంటే టీడీపీ ఎందుకు ఓటమి పాలయ్యేది. నిజానికి రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయినపుడు... హైదరాబాద్‌లో 10 సంవత్సరాల వరకు ఉండే హక్కు ఉన్నా.. రాత్రికి రాత్రి అక్కడ నుండి పారిపోయి వచ్చారు. అమరావతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు.. వారి బంధువులు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం పైన శ్రద్ద చూపించారే తప్ప.. ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించలేదు. ఇప్పుడేమో కొంత మంది టీడీపీ నాయకులు.. వైజాగ్‌ను రాజధానిగా స్వాగతిస్తున్నామని చెబుతుండగా... మరికొందరు వ్యతిరేకిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. రాజధాని విషయంలో ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారు అని టీడీపీ నాయకుల తీరును విమర్శించారు. అదే విధంగా జనసేన, సీపీఐ, సీపీఎంలు చంద్రబాబు మాయలో పడ్డాయని పేర్కొన్నారు.
మూడు రాజధానులు అవసరం: ఎంపీ వంగా గీత
గత ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలనే ఆలోచన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేదని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమల అభివృధ్ది కోసమే మూడు రాజధానులని పేర్కొన్నారు. ఎవరు.. ఎంతగా.. రెచ్చగొట్టినా అభివృధ్ధిని కాంక్షించేవారు సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకించరన్నారు. అక్షర క్రమంలోనే కాదు.. అభివృధ్ధిలోనూ ఆంధ్రప్రదేశ్ ముందుండాలంటే మూడు రాజధానులు అవసరమని వంగా గీత వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment