
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు.
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. కాపు ఉద్యమానికి సంబంధించిన పలు కేసులు ఎత్తివేయడంపై సంతోషం వ్యక్తం చేసిన ముద్రగడ.. సీఎం జగన్‌కు శుక్రవారం లేఖ రాశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చేయని నేరానికి తమను ముద్దాయిలను చేస్తూ.. గతంలో పెట్టిన కేసులు చాలా అన్యాయమని, ఇప్పుడు వాటిని ఎత్తివేయడం సంతోషం కల్గించిందని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ.
కాపుజాతి తనను ఉద్యమం నుంచి తప్పించినా.. భగవంతుడు సీఎం వైఎస్ జగన్ ద్వారా ఆ కేసులకు మోక్షం కలిగించారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా కలవలేకపోతున్నానని పేర్కొన్నారు. కలిస్తే తమ జాతిని అడ్డుపెట్టుకొని ‘కోట్లు సంపాదించుకోవడానికి, పదవులు పొందడానికి వెళ్లాన’ని అనిపించుకోవడం ఇష్టంలేక కలువలేకపోతున్నానని ముద్రగడ తన లేఖలో పేర్కోన్నారు.