నేటి నుంచి కర్నూలు మార్కెట్ బంద్ | kurnool market bandh from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కర్నూలు మార్కెట్ బంద్

Published Mon, Nov 25 2013 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM

kurnool market bandh from today

 కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్ :  కోతహమాలీలు - కమీషన్ ఏజెంట్ల మధ్య నెలకొన్న కూలిరేట్ల వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఫలితంగా కర్నూలు వ్యవసాయమార్కెట్ సోమవారం నుంచి బంద్‌కానుంది. ఫలితంగా ఆరుగాలం కష్టించి పండించిన పంటలను అమ్ముకునే అవకాశం లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కొన్ని నెలలుగా కర్నూలు మార్కెట్ యార్డులో పాలన గాడి తప్పింది. మార్కెట్‌యార్డు రెగ్యులర్ సెక్రటరీ పోస్టు ఖాళీగా ఉండడం.. ఇన్‌చార్జి సెక్రటరీలను తరచూ మారుస్తూ ఉండడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు.

ఇటీవల నందికొట్కూరు మార్కెట్ కమిటీ సెక్రటరీ(గ్రేడ్-1)గా పనిచేస్తున్న జయలక్ష్మిని కర్నూలు యార్డు ఇన్‌చార్జిగా నియమించారు. ఆమె కూడా కొద్ది రోజులుగా సెలవుల్లో ఉన్నారు. ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తుల సీజన్ కావడంతో రోజూ వేలాది క్వింటాళ్ల దిగుబడులు యార్డుకు తరలివస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమీషన్ ఏజెంట్లు, కోత హమాలీల మధ్య కూలి రేట్ల విషయంలో వివాదం తలెత్తింది. ఇరు సంఘాల నేతలూ కూర్చొని చర్చించుకుంటే ఈ సమస్య పరిష్కారమవుతుంది.

 అయితే ఆ మేరకు చర్యలు తీసుకునేవారు కరువయ్యారు. దీంతో సోమవారం నుంచి మార్కెట్‌యార్డు బంద్ కానుంది. మళ్లీ ప్రకటించే వరకు వ్యవసాయ ఉత్పత్తులు యార్డుకు తీసుకుని రావద్దని మార్కెట్‌శాఖ అధికారులు ప్రకటించారు. ఏది ఏమైనా కమీషన్ ఏజెంట్లు, కోత హమాలీల పంతాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే దిగుబడులు రాక అల్లాడుతున్న వారు.. వచ్చిన కొద్దిపాటి పంటలు కూడా అమ్ముకునేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. సమస్య పరిష్కారానికి మార్కెట్ కమిటీ చైర్మన్ డి.వెంకటేశ్వరరెడ్డి దృష్టి సారించాల్సి ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement