మో‘డల్’ పాఠశాలలు
మార్కాపురం టౌన్, న్యూస్‌లైన్: విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఆదర్శ పాఠశాలల(మోడల్ స్కూళ్లు)ను గతేడాది ప్రవేశపెట్టింది. విద్యా సంవత్సరం ఆరంభం నాటికి పాఠశాలల భవనాల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. అయినా ఈ భవనాల్లోనే తరగతులు ప్రారంభించారు. పాఠశాలకు ప్రిన్సిపాల్, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల నియమించాలి. కాని పూర్తిస్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. దీంతో ఉన్న కొద్ది మంది టీచర్లే మిగలిన సబ్జెక్టులు బోధిస్తున్నారు. మరి కొన్ని సబ్జెక్టులకు విద్యార్థుల తల్లిదండ్రులే టీచర్లను నియమించి జీతాలు చెల్లిస్తున్నారు. అయినా విద్యాశాఖాధికారులు మాత్రం సౌకర్యాల కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
చాలీచాలని తరగతి గదులు
మార్కాపురం మండలంలోని మిట్టమీదపల్లెలో ఈ ఏడాది మోడల్ స్కూల్‌ను ప్రారంభించారు. పాఠశాల్లో 6, 7, 8, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు చేరారు. ఒక్కొక్క తరగతికి 80 మంది విద్యార్థులను తీసుకుని రెండు సెక్షన్లుగా విభజించాలి. 6, 7, 8 తరగతుల్లో 240 మందికిగానూ 225 మంది, ఇంటర్ మొదటి సంవత్సరంలో 80 మందికిగానూ 53 మంది చేరారు. ఒక్కో సెక్షన్‌కు 40 మంది విద్యార్థులను కేటాయించాల్సి ఉంది. కానీ టీచర్ల కొరతతో 75 మంది విద్యార్థులను ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టి విద్యనందిస్తున్నారు. విద్యార్థులకు సరిపడా ఫర్నీచర్ లేకపోవడంతో కొందరు కిందే కూర్చొంటున్నారు.
సిబ్బంది కొరత
మోడల్ పాఠశాలకు ప్రిన్సిపాల్, 14 మంది పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు, ఆరుగురు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లను నియమించాలి. కానీ ఇప్పటి వరకు ప్రిన్సిపాల్, ఆరుగురు పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లను మాత్రమే తీసుకున్నారు. దీంతో పాఠశాల్లోని పీడీ, ఇతర టీచర్లే మిగిలిన సబ్జెక్టులు బోధిస్తున్నారు.
తల్లిదండ్రుల ఆర్థికసాయంతో టీచర్లకు జీతాలు
ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథ్స్, జువాలజీ, సివిక్స్ సబ్జెక్టులకు టీచర్లు లేరు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు టీచర్లతో తమ పిల్లలకు పాఠాలు చెప్పించుకుంటున్నారు. ఈ టీచర్లకు తల్లిదండ్రులే జీతాలు అందిస్తున్నారు. దీంతోపాటు ప్రిన్సిపాల్ కూడా బోధన చేస్తున్నారు.
సౌకర్యాలు నిల్
విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాల్సి ఉంది. కానీ భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్‌లో ఉండి చదువు కొనసాగిస్తున్నారు. కొందరు ఇంటి వద్ద నుంచే పాఠశాలకు హాజరవుతున్నారు. పాఠశాలలో మంచినీటి వసతి లేదు. దీంతో విద్యార్థులు ఫ్లోరైడ్ నీటినే తాగుతున్నారు. మరి కొందరు ఇంటి వద్ద నుంచి బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు పాఠశాలకు ల్యాబ్ సామగ్రి రాలేదు. దీంతో ప్రయోగశాలలు నిరుపయోగంగా మారాయి.
త్వరలోనే భర్తీ చేస్తాం: వెంకటేశ్వరరెడ్డి,
మోడల్ స్కూల్స్ ఇన్ చార్జి
మోడల్ స్కూల్లో టీచర్ల కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మిట్టమీదపల్లెలో ఏర్పాటు చేసిన మోడల్ స్కూల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విద్యాశాఖా మంత్రి నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పీజీటీ, టీజీటీ పోస్టులను భర్తీ చేస్తాం.