సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలను తొలుత సువిధ వెబ్‌సైట్( suvidha. eci. gov. in)లో నమోదు చేసిన తర్వాతనే రిటర్నింగ్ అధికారులు ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎలాంటి గందరగోళం లేకుండా ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలన్న అంశంపై ఎన్నికల సంఘం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) డైరెక్టర్ కుశాల్ పాఠక్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. ప్రజలందరూ రౌండ్ల వారీగా ఫలితాలను తెలుసుకోవాడానికి results. eci. gov. in అనే వెబ్‌సైట్ అందుబాటులో ఉంటుందని, అలాగే అభ్యర్థుల కోసం సువిధ యాప్ ఉంటుందన్నారు. రౌండ్ల వారీగా డేటాను ‘సువిధ’లో ఆర్వోలు, ఏఆర్వోలు మాత్రమే చాలా జాగ్రత్తగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఒకసారి పొరపాటున నమోదు చేసినా వెంటనే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతీ ఐదు నిమిషాలకు ఒకసారి డేటాను అప్‌డేట్ చేయాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల బయట ఫలితాల వెల్లడికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఫలితాల కోసం వినియోగించే కంప్యూటర్లు లైసెన్స్‌డ్ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌తో ఉండాలని, 8 ఎంబీపీఎస్ తక్కువ స్పీడు కాకుండా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 8 గంటల పవర్ జనరేటర్‌ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.
21వ తేదీన రిహార్సల్స్..
ఈ నెల 9 నుంచి 15 తేదీ వరకు నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య, స్త్రీ, పురుషులు, ఇతరులు, మొత్తం ఓటర్ల వివరాలు, పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ఒకసారి పరిశీలించుకోవాలని అధికారులకు కుశాల్ పాఠక్ సూచించారు. ఓటర్ల సంఖ్యలో మార్పులు ఉంటే ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని మాత్రమే మార్చాలన్నారు. మే 23న ఓట్ల లెక్కంపు జరుగనున్నందున, 21వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య రిహార్సల్ చేసుకోవాలని చెప్పారు. ఓట్ల లెక్కింపునకు ముందే ఎన్ని రౌండ్లు లెక్కించాలో నిర్ధారించుకోవాలని తెలిపారు. ఈవీఎం ఓట్లను రౌండ్ల వారీగా వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని, ప్రతి రౌండుకు ఒక ప్రింట్ అవుట్ తీసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్లు, తిరస్కరించిన ఓట్ల వివరాలు కూడా నమోదు చేసుకోవాలని చెప్పారు. ఒక నియోజకవర్గంలో మొత్తం ఓట్లు, పోలైన వాటిలో అర్హత కలిగిన ఓట్లు, నోటా, తిరస్కరించిన, టెండర్డ్ ఓట్ల వివరాలు, పోటీ చేసిన అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలు ఉన్న ఫామ్ 21ఇ పైన ఆర్వో తప్పనిసరిగా సంతకం చేయాలని కుశాల్ పాఠక్ స్పష్టం చేశారు. ఎన్నికల సిబ్బంది వ్యక్తం చేసిన పలు అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర అదనపు సీఈఓ సుజాత శర్మ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తొలుత సువిధలోనే ఫలితాలు
Published Sat, May 11 2019 3:52 AM | Last Updated on Sat, May 11 2019 10:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment