పెద్దాస్పత్రికి గుండెకోత | Kyathalyab failure of the treatments | Sakshi
Sakshi News home page

పెద్దాస్పత్రికి గుండెకోత

Published Fri, Feb 20 2015 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

Kyathalyab failure of the treatments

పనిచేయని క్యాథల్యాబ్.. నిలిచిన చికిత్సలు
ఫిజిస్ట్ లేక రేడియోథె రపీ బంద్
మూతపడిన థొరాసిక్ సర్జరీ విభాగం
రోజువారీ చికిత్సలకు అంతరాయం
ఆరోగ్యశ్రీ చికిత్సకు అవరోధం

 
విశాఖ మెడికల్: కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్)లో మూడు కీలక చికిత్సలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేన్సర్ రోగులకు ఇచ్చే బహిర్గత  రేడియేషన్(కోబాల్ట్) థెరపీ 15 రోజులుగా రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్(ఫిజీసిస్ట్) లేక నిలిచిపోయింది.  హుద్ హుద్ సమయంలో క్యాథ్‌ల్యాబ్‌లోని విలువైన కేబుల్స్ కాలిపోవడంతో పలు హృద్రోగ చికిత్సా ప్రక్రియలకు అవరోధం ఏర్పడింది. మరో పక్క ఐదు నెలలుగా విభాగధిపతి బదిలీ కావడంతో కీలక విభాగమైన గుండె శస్త్ర చికిత్స (కార్డియో థోరసిక్ సర్జరీ)విభాగం మూతపడింది. పెద్దాసుపత్రిలో పేదరోగులకు నాలుగు నెలలుగా గుండె చికిత్సలు.. శస్త్ర చికిత్సలు నిలిచిపోయినా..కేన్సర్ రేడియేషన్ థెరపీకి అంతరాయం వాటిల్లినా..  హుద్ హుద్ అనంతరం మూడు సార్లు కేజీహెచ్‌ను సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని,మంత్రి గంటా, స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లిలకు పట్టలేదనే విమర్శ వినిపిస్తోంది.  కేన్సర్, గుండె సంబంధిత చికిత్సలు అందక పేద రోగులు అప్పులు చేసి ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ మూడు రకాల చికిత్సలు నిలిచిపోవడంతో ఆరోగ్యశ్రీ నిధులను రాబట్టుకోలేకపోతోంది.

కేన్సర్ రేడియోథెరపీకి అంతరాయం..

కేన్సర్ రేడియోథెరపీ విభాగానికి రోజుకి వంద మంది వరకు వస్తుంటారు. వీరిలో 50 మందికి పైగా రేడియేషన్(కోబాల్ట్)థెరపీ అవసరం పడుతోంది.గర్భాశయ ముఖద్వారం, రొమ్ము, గొంతు, అంగుటి, జీర్ణాశయ, ఉదరకోశ కేన్సర్‌కు సంబంధించి ఎక్కువ మంది వస్తున్నారు. ఒరిస్సా, చత్తీస్‌ఘడ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది అంగుటి కేన్సర్ రోగులు ఇక్కడకు వస్తుంటారు. కేన్సర్ కణాల ఉనికిని నాశనం చేసేందుకు రేడియేషన్ థెరపీ ఇస్తారు. దీనిని ఇచ్చేందుకు యంత్ర పరికరాలు, టెక్నిషియన్లు అందుబాటులో ఉన్నా వ్యాధి తీవ్రతను బట్టి రేడియేషన్ మోతాదును నిర్ణయించే రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ కమ్ ఫిజిస్ట్ రెండువారాలుగా అందుబాటులో లేరు. వేతనం చాల్లేదన్న నెపంతో ఉద్యోగానికి స్వస్తి పలికినట్లు తెలిసింది. పాత కేన్సర్ రోగులకు గతంలో నిర్ణయించిన మోతాదులతో చికిత్స కొనసాగిస్తున్నప్పటికీ కొత్త రోగులకు రేడియేషన్ థెరపీ ఇచ్చే పరిస్థితి లేదు . దీంతో కేన్సర్ రేడియేషన్ థెరపీకి అవరోధం ఏర్పడింది.
 
నిలిచిన క్యాథ్‌ల్యాబ్ ప్రక్రియలు..

హుద్ హుద్ ధాటికి షార్ట్ సర్క్యూట్ కారణంగా కార్డియాలజీ  క్యాథ్‌ల్యాబ్ కేబుల్స్ దగ్ధమయ్యాయి. విదేశీ కంపెనీకి చెందిన ఖరీదైన ఈ కేబుల్స్ విలువ రూ.48 లక్షలు కావడం, నిధుల కొరత కారణంతో ఆస్పత్రి వీటిని నాలుగు నెలలు దాటినా ఇంతవరకు సమకూర్చుకోలేకపోయింది. ఫలితంగా కేజీహెచ్ కార్డియాలజీ విభాగంలో క్యాథ్‌ల్యాబ్ ద్వారా నిర్వహించే కీలకమైన యాంజియోగ్రామ్, యాంజియో ప్లాస్టీ, ఫేస్ మేకర్, స్టంట్లు వేసే గుండె చికిత్సా ప్రకియలు నిలిచిపోయాయి. దీనివల్ల అత్యవసర గుండె చికిత్సలకు అవరోధం ఏర్పడింది. సాధారణ చికిత్సలు మాత్రమే కొనసాగుతున్నాయి. షార్ట్‌సర్క్యూట్ వల్ల క్యాథ్‌ల్యాబ్ పనితీరు నిలిచిపోవడంతో కేజీహెచ్‌కు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడినట్టయ్యింది. పేద రోగులు గత్యంతరం లేక కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. కార్పొరేట్ ఆస్పత్రుల్లో గుండె చికిత్సా ప్రక్రియలకు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కింద హృద్రోగ చికిత్సలు చేయడానికి వెనుకాడుతుండడంతో పేద రోగుల ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి.
 
కేర్‌కు సిటీ సర్జరీ అప్పగింత..

విభాగధిపతి బదిలీతో మూతపడ్డ కార్డియో థొరసిక్ సర్జరీ విభాగాన్ని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)కింద నగరంలోని కేర్ ఆస్పత్రి యాజమాన్యానికి అప్పగించేందుకు ఆస్పత్రి వర్గాలు నిర్ణయించాయి. ఈ మేరకు పరస్పరం అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకునేందుకు గురువారం చర్చలు ప్రారంభమయ్యాయి. చర్చలు ఫలప్రదం కావడంతో ఇక మీదట ఆరోగ్యశ్రీ పథకం కింద కేజీహెచ్‌లో గుండె శస్త్ర చికిత్సలను నగరంలోని కేర్ ఆస్పత్రి యాజమాన్యం చేపట్టనుంది. కేజీహెచ్‌లో ఆరు నెలలుగా నిలిచిపోయిన గుండె శస్త్ర చికిత్సలకు మహార్థశ పట్టనుంది.
 
వారం పదిరోజుల్లో క్యాథ్‌ల్యాబ్ రెడీ..

క్యాథల్యాబ్‌లో కాలిపోయిన కేబుల్స్ కొనుగోలుకు కలెక్టర్ ఆమోదంతో ఆస్పత్రి అభివృద్ధి నిధుల నుంచి రూ.48 లక్షలు విడుదల చేశాం. కొత్త కేబుల్స్‌ను విదేశాల నుంచి రప్పించాం. క్యాథ్‌ల్యాబ్ మరమ్మతు పనులు సాగుతున్నాయి. వారం పది రోజుల్లో  క్యాథ్‌ల్యాబ్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. మూతపడ్డ కార్డియో థొరసిక్ విభాగాన్ని పీపీపీ కింద కేర్ ఆస్పత్రి యాజమాన్యంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. త్వరలోనే గుండె శస్త్ర చికిత్సలు కూడా ప్రారంభం కానున్నాయి. ఫిజిస్ట్ లేని కారణంగా రేడియేషన్ థెరపీ సేవలకు అంతరాయం వాటిల్లిన విషయం వాస్తవమే. కొత్త ఫిజిస్ట్‌ను నియమించేందుకు కలెక్టర్ అనుమతిని కోరాం.
 -డాక్టర్‌ఎం.మధుసూధనబాబు,  పరింటెండెంట్, కేజీహెచ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement