మహారాణిపేట (విశాఖ దక్షిణ)/గాజువాక: కింగ్ జార్జి హాస్పిటల్ (కేజీహెచ్)లో రూ.50 లక్షలతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ ముందుకొచ్చింది. ఈ మేరకు మంగళవారం విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సమక్షంలో కేజీహెచ్‌లోని సీఎస్‌ఆర్ బ్లాక్ రూఫ్ టాప్‌లో సౌర విద్యుత్‌ను ఇన్‌స్టాలేషన్ చేయడానికి ఎంవోయూ జరిగింది.
ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ వైజాగ్ అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రవీంద్రనాథ్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ ఎంవోయూపై సంతకాలు చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కింద వైజాగ్ అసెట్‌కు చెందిన ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన ఈ సోలార్ పవర్ ఇన్‌స్టాలేషన్ ద్వారా కేజీహెచ్‌లో విద్యుత్ ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుందని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఏఎంఎన్‌ఎస్ ఇండియా లిమిటెడ్ హెడ్, హెచ్‌ఆర్ అడ్మిన్ డి.ఎస్.వర్మ తదితరులు పాల్గొన్నారు.
రూ.670 కోట్లతో 1,125 పీహెచ్‌సీల ఆధునికీకరణ
రాష్ట్రంలోని 1,125 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రూ.670 కోట్లతో ఆధునికీకరించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. రూ.1.75 కోట్లతో నిర్మించిన కణితి పీహెచ్‌సీ భవనాన్ని ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామస్థాయి నుంచి టీచింగ్ ఆస్పత్రి వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రులను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు.
రాష్ట్రంలో రూ.1,692 కోట్లతో 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లను నిర్మిస్తున్నామన్నారు. 121 సీహెచ్‌సీలు, 42 ఏరియా ఆస్పత్రుల ఆధునికీకరణ కోసం జగనన్న ప్రభుత్వం రూ.1,223 కోట్లను కేటాయించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలల నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రూ.8,500 కోట్లను ఖర్చు చేస్తున్నారన్నారు. టీచింగ్ ఆస్పత్రుల ఆధునికీకరణ కోసం రూ.3,820 కోట్లు కేటాయించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment