సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్‌సీసీఎల్)కి కార్మికశాఖ షాక్ ఇచ్చింది. భవన నిర్మాణం ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ సెస్ చట్టం 1996 ప్రకారం సెస్ చెల్లించాలంటూ సింగరేణికి నోటీసులు జారీ చేసింది. నిర్మాణ వ్యయంలో 2 శాతానికి మించకుండా ఒక శాతానికి తక్కువ కాకుండా సెస్సు చెల్లించాలి. సింగరేణి చేపడుతున్న మైనింగ్‌తోపాటు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మిస్తున్న విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం నేపథ్యంలో కార్మికశాఖ ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. అయితే తాము ఈ చట్టం కిందకు రామని సింగరేణి వాదిస్తోంది. తమకు కేవలం మైనింగ్ చట్టం మాత్రమే వర్తిస్తుందని అంటోంది. ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీరాంపూర్ వద్ద నిర్మిస్తున్న విద్యుత్ ప్లాంటుకు కూడా ఈ చట్టం వర్తించదని ఫ్యాక్టరీల చట్టం వర్తిస్తుందని సింగరేణి పేర్కొంటోంది.
మరోవైపు సెస్సు చెల్లించాల్సిందేనని కార్మికశాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సెస్ రూపంలో కోట్ల రూపాయల మొత్తాన్ని సింగరేణి చెల్లించాల్సిరానుందని సమాచారం. ఇదే జరిగితే కొద్దిగా లాభాల్లో ఉన్న సింగరేణికి భారీ షాక్ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెస్ మొత్తాన్ని బొగ్గు ధరలు పెంచడం ద్వారా భర్తీ చేసుకోవాల్సి ఉంటుందని సింగరేణి వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే అంతిమంగా బొగ్గు ధరలు పెరిగి ఆ భారం విద్యుత్ చార్జీల రూపంలో ప్రజలపైనే పడనుంది!
సింగరేణికి కార్మికశాఖ షాక్!
Published Mon, Aug 19 2013 4:44 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement