సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై పక్కా పథకం ప్రకారమే హత్యాయత్నం జరిగిందని విశాఖపట్నం పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై దాడికి నిందితుడు శ్రీనివాస్ రెండుసార్లు కుట్ర పన్నాడని వెల్లడించారు.
‘నిందితుడు 2017 డిసెంబర్ నుండే వైఎస్ జగన్ హత్యపై కార్యాచరణ ప్రారంభించాడు. అక్టోబర్ 18నే దాడికి పథక రచన చేశాడు. అక్టోబర్ 17నే వైఎస్ జగన్ విశాఖ నుంచి వెళ్లిపోవడంతో అతడి పథకం ఫలించలేదు. శ్రీనివాస్ గతంలో వెల్డర్, కేక్ మాస్టర్, కుక్‌గా పనిచేశాడు. జనవరి 2018 కర్ణాటకలో తనతో పనిచేసిన వెంకటపతి అనే వ్యక్తి ద్వారా ఫ్యూజన్ ఫుడ్స్ లో చేరాడు. 164 సీఆర్ పీసీ కింద ఇప్పటి వరకు 92 మంది సాక్షులను విచారించి, స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేసాం. దాడికి ఉపయోగించిన కోడిపందేల కత్తికి నిందితుడు రెండుసార్లు పదును పెట్టాడు. (అది హత్యాయత్నమే)
ముందుగానే ఓ లేఖను విజయదుర్గతో రాయించాడు. ఈ లేఖను ఆమె జిరాక్స్ కూడా తీయించింది. హేమలత, షేక్ అమ్మాజీ అనే మహిళలకు శ్రీనివాస్ ముందురోజు ఫోన్ చేసి రేపు నా పేరు టీవీలో చూస్తారంటూ చెప్పాడు. అక్టోబర్ 25న ఉదయం 4.55 గంటలకు ఎయిర్‌పోర్టుకు బయలు దేరాడు. ఎయిర్‌పోర్టు క్యాంటీన్‌లో ఉదయం 9 గంటలకు కత్తికి మరోసారి పదును పెట్టాడు. దాడికి పక్కా పథకం ప్రకారం సిద్ధమయ్యాడు. వీఐపీ లాంజ్‌లో వేచివున్న వైఎస్ జగన్ వద్దకు హేమలతను తీసుకెళ్లాడు. కరణం ధర్మశ్రీతో జగన్ మాట్లాడుతుండగా శ్రీనివాస్ దాడికి తెగబడ్డాడు.
రాష్ట్రంలో ఎక్కడ ఘటన జరిగిన రాష్ట్ర పోలీసులే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించాలి లేదా కేంద్రం కోరాలి. స్థానిక పోలీసులకు అధికారం లేదు. నిందితుడి దగ్గర దొరికిన లేఖలో ముగ్గురి చేతి రాతలు ఉన్నట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చింది. కేసులో ఇప్పటివరకు శ్రీనివాస్ మాత్రమే నిందితుడు. దాదాపుగా విచారణ పూర్తి అయింది. ఛార్జి షీట్ దాఖలుకు హైకోర్ట్ అనుమతి రావాల్సి ఉంద’ని లడ్డా వివరించారు.
అనుమానాలెన్నో..?
పోలీసు కమిషనర్ హడావుడిగా విలేకరుల సమావేశం పెట్టి కేసు వివరాలు వెల్లడించడంపై వైఎస్సార్ సీపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు చెప్పిందే మళ్లీ చెప్పారని, కొత్తగా ఏం చెప్పలేదని పేర్కొన్నారు. సూత్రధారులను తప్పించేందుకే రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు. కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించేందుకు చంద్రబాబు సర్కారు ఎందుకు భయపడుతోందని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment