అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతుతో దీక్ష చేస్తున్న యువతి
పార్వతీపురం: ఆరేళ్లు ప్రేమించిన ప్రియుడితో తనకు పెళ్లి చేయాలని ఓ ప్రియురాలు స్థానిక బెలగాంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద దీక్షకు దిగింది. ఇటీవల పోలీసుల కౌన్సెలింగ్‌లో తనను కాదన్నాడనే ఆవేదనతో పోలీసు స్టేషన్‌లోని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆయువతి మంగళవారం అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన తనను కురుపాం మండలం గొల్లవలసకు చెందిన శెట్టి వరప్రసాద్ 2010 ఏప్రిల్ నుంచి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా సంబంధం పెట్టుకొని రెండుసార్లు గర్భవతిని చేసి ఇప్పుడు కాదంటున్నాడని వాపోయింది. ఈ విషయమై పెద్దలు చెప్పినా వినలేదని బావురుమంది. వరప్రసాద్ మనసును శెట్టి నాగేశ్వరరావు, శెట్టి చంద్రర్రావు, పొన్నాడ శివరాం, శెట్టి భాస్కరరావు, శెట్టి విజయమ్మ, శెట్టి వాసదేవరావు,నారాయణరావు తదితరులు వారి కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లక్షల ఆస్తి వస్తుందని మార్చారని ఆరోపించింది. ఈ సందర్భంగా ఆమె అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేసింది.
మద్దతు పలికిన ఐద్వా, సీపీఎం, బీజేపీ, రైతు కూలీసంఘాలు
ఆ యువతి దీక్షకు పలువురు నాయకులు, సంఘాలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా ఐద్వా నాయకురాలు రెడ్డి శ్రీదేవి అఖిలభారత రైతు కూలీసంఘం నాయకురాలు పి. రమణి, బీజేపీ నాయకులు కోరాడ సత్యనారాయణ, డొంకాడ సాయిపార్థసారథి, పట్లాసింగ్ రవికుమార్, రైతు కూలీసంఘం నాయకులు డి. వర్మ, పి. శ్రీనునాయుడు, బొత్స నర్సింగరావు, సీపీఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి, టీడీపీ మాజీ కౌన్సిలర్ మరియుదాసు తదితరులు మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఇటువంటి వ్యవహారాల్లో కూడా చేతులు పెట్టడం అన్యాయమని ఇది ఎంతవరకు వెళ్లినా తాము ఆయువతి వెనుక తాము ఉంటామని స్పష్టం చేశారు.