కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్: మీడియా ప్రతినిధులను అసభ్యపదజాలంతో దూషించిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెంటనే క్షమాపణ చెప్పాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట వారు లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర కమిటీ సభ్యుడు పి.రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు రాసే కథనాలు గాని, ప్రశ్నలు గాని నచ్చకపోతే ఇతర మార్గాల ద్వారా ఖండించే అవకాశముందన్నారు. కానీ ఎంపీ స్థానంలో ఉన్న ఓ వ్యక్తి వీధిరౌడీలా మారి మీడియా ప్రతినిధులపై దూషణలకు దిగడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తే ఎలాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారో జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగించినప్పుడు కూడా అలాంటి కేసులే నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి రమణయ్య మాట్లాడుతూ ‘ఆడ లేక మద్దెల ఓడు’ అన్నట్లు లగడపాటి రాజగోపాల్ తాను ఏమీ చేయలేక మీడియాపై అక్కసు ప్రదర్శిస్తున్నారన్నారు. ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న ఎంపీనే ఇలా దిగజారి వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికి విలువేముందని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టీవీ కరస్పాండెంట్ లక్ష్మినాథ్‌రెడ్డి, సాక్షి టీవీ కరస్పాండెంట్ శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ సుబ్బారెడ్డి, బ్యూరో ఇన్‌చార్జి బాలకృష్ణారెడ్డి, జెమిని టీవీ కరస్పాండెంట్ ఆర్‌ఎస్ రెడ్డి, రామాంజనేయరెడ్డి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రొద్దుటూరులో ఎంపీ లగడపాటి రాజగోపాల్‌రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ విలేకరులు తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
లగడపాటి రాజగోపాల్ మీడియా ప్రతినిధులపై దురుసుగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు జమ్మలమడుగు పాతబస్టాండులో బైఠాయించి ఆందోళన చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు.
లగడపాటి వ్యాఖ్యలను నిరసిస్తూ పులివెందులలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
బద్వేలులో లగడపాటి తీరును తూర్పారాబడుతూ జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
లగడపాటి రాజగోపాల్ జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రైల్వేకోడూరులో పాత్రికేయులు ఆందోళన నిర్వహించారు.
రాయచోటిలో లగడపాటి తీరును నిరసిస్తూ పాత్రికేయులు ధర్నా నిర్వహించారు.