వంగర: లక్ష్మీపేట దళిత బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కులనిర్మూలన పోరాట సమితి (కేఎన్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ అన్నారు. లక్ష్మీపేట మారణహోమం జరిగి శుక్రవారానికి మూడేళ్లయిన సందర్భంగా లక్ష్మీపేట ఆత్మగౌరవ పోరాట కమిటీ ఆధ్వర్యంలో దళిత మృతవీరుల సంస్మరణ సభను గ్రామంలో నిర్వహించారు. కొట్లాట ఘటనలో మృతిచెందిన నివర్తి సంగమేషు, నివర్తి వెంట్రావ్, బూరాడ సుందరరావు, చిత్తిరి అప్పడు, బొద్దూరు పాపయ్యల సమాధుల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టు భవనం ఆవరణలో దళిత మృతవీరుల సంస్మరణ సభలో ప్రభాకర్ మాట్లాడారు.
బాధితుల పక్షాన అన్ని దళిత సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. బాధితుల పక్షాన నిలబడి హక్కుల సాధన కోసం న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. లక్ష్మీపేట ఘటన జరిగి మూడేళ్లు అవుతున్నా ఇంకా కేసు ప్రాథమిక దశలోనే ఉందన్నారు. కారంచేడు ఘటనకు సంబంధించి కేసు తీర్పు వచ్చేసరికి 30 సంవత్సరాలు పట్టిందని, చుండూరు ఘటనకు సంబంధించి16 ఏళ్లు పట్టిందని, ఆ తరహాలో లక్ష్మీపేట కేసు కాలయాపన చేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కోర్టుకు పూర్తికాలపు న్యాయమూర్తిని నియమించాలని, త్వరతిగతిన లక్ష్మీపేట కోర్టు తీర్పు వెల్లడించి దోషులను శిక్షించాలన్నారు.
కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గణేష్ మాట్లాడుతూ హైదరాబాద్ ఇందిరాపార్కు, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పోరాటాల ఫలితమే లక్ష్మీపేటలో ప్రత్యేక కోర్టు ఏర్పాటన్నారు. దళిత బాధితుల సమస్యలను జిల్లా కలెక్టర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజా మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.కోటి మాట్లాడుతూ మడ్డువలస రిజర్వాయర్‌లో మిగులు భూములు దళితులకు ఇవ్వాలని, కేసు విచారణను వేగవంతం చేయాలని, ఎస్సీ,ఎస్టీ చట్టంలో పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలన్నారు. రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు తాండ్ర ప్రకాష్ మాట్లాడుతూ మృతులకు నష్టపరిహారం కింద రూ. పది లక్షలు, క్షతగాత్రులకు రూ.ఐదు లక్షలు ఇవ్వాల్సి ఉండగా అలా జరగలేదని ఆవేదన చెందారు.
సామాజిక న్యాయపోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పి.మురళి మాట్లాడుతూ క్షతగాత్రులకు ప్రభుత్వం జారీ చేసిన జీఓ 69ను అమలు చేసి ఉద్యోగాలు కల్పించాలన్నారు. అంతకు ముందు ప్రజా మండలి, ప్రజా నాట్యమండలి దళ సభ్యులు విప్లవగీతాలు ఆలపించారు. పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో లక్ష్మీపేట దళిత ఆత్మగౌరవ కమిటీ కన్వీనర్ చిత్తిరి గంగులు, కేఎన్‌పీఎస్ జిల్లా కార్యదర్శి మిస్క కృష్ణయ్య, బోడసింగి రాము, రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకుడు బి.శంకరరావు, పౌరహక్కుల సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు వి.చిట్టిబాబు, ఓపీడీఆర్ నేత సి.భాస్కరరావు, దళిత ఐక్యవేదిక నేత కల్లేపల్లి రాంగోపాల్, కేఎన్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు బి.ప్రభాకర్, దళిత విముక్తి సంఘం నేత ఎస్.వి.రమణ, డీటీఎఫ్ నేత ధర్మారావు, ఎస్.ఎన్.పి.ఎస్ నేత బి.బుద్ధుడు, ఆర్.రాంబాబు పాల్గొన్నారు.
న్యాయం జరిగే వరకూ పోరాటం
Published Fri, Jun 12 2015 11:26 PM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM
Advertisement
Advertisement